Suryaa.co.in

Features

ఆయన నేర్పిందే అక్షరం..లక్షణం..!

అక్షరలక్షలంటారు గాని
అక్షర కోట్లు అనాల్సి వస్తే
అవి నిస్సందేహంగా
పొత్తూరి అక్షరాలు..
వన్నె తరగని ఆణిముత్యాలు..

పాత్రికేయ రంగానికి పెద్దదిక్కు
విశాల ద్రుక్కు..
ఆయన సంపాదకీయాలు
సుసంపన్నాలు..
ఆ శైలి..అనితరసాధ్యం..
జర్నలిజానికి అక్షర నైవేద్యం..
మాటల ప్రవాహం..
భావాల జలపాతం..
మంచిపై హిమపాతం..
చెడుపై ఉల్కాపాతం..
అవినీతిపై సింహనాదం
ఆయన ప్రతి వాదం
జర్నలిజానికి ఆరవవేదం..!

వ్యక్తిగా మహోన్నత శిఖరం
పాత్రికేయుడిగా
ఆయన నడవడి
ఓ ఒరవడి..
అక్షరాలే పలుకుబడి
కీర్తి రాబడి..
మంచితనమే పెట్టుబడి
జీవితమంతా
విలువలకు కట్టుబడి..
ప్రెస్ అకాడమి చైర్మన్
ఉన్నత సాంప్రదాయాల హీమాన్..

ఆంధ్రభూమి పత్రిక..
ఆయన మానసపుత్రిక..
ఈనాడు..ఆయన సారధ్యంలో
తలవంచలేదు ఏనాడు..
ఆంధ్రప్రభకు ఆయన
సంపాదకత్వమే శోభ..
ఇక్కడే వెలిగిపోయింది
మరింతగా ఆయన ప్రతిభ..

కాలంతో పని లేని కలం..
అయిదు దశాబ్దాల
అక్షర మాయాజాలం..
ఆయన వెళ్ళినా..
వెలకట్టలేని ఆ విలువలు..
ఆకట్టుకున్న ఆ వలువలు..
సంపాదకీయాలు
తెలుగు పత్రికారంగంలో
ఎప్పటికీ వాడిపోని కలువలు..!

తెలుగువాడి వాడి..
తెలుగు ప్రజల నాడి..
గుండె అక్షరాల గుడి..
కొన్ని తరాల జర్నలిస్టులకు
పొత్తూరి ఆదిగురువు
అన్నది చెరిగిపోని నానుడి..!

పాత్రికేయ వృత్తిలో
విలువలు నేర్పి..
తొలి అక్షరాలు దిద్దించిన
గురుతుల్యులు..
పూజ్యులు..పెద్దలు..
పొత్తూరి వెంకటేశ్వర రావు

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE