– గవర్నర్ పై దూషణలకు దిగి టీడీపీ దుష్టసంప్రదాయానికి తెరతీసింది
– సభ గౌరవాన్ని కాపాడేలా హుందాగా ప్రవర్తించాలని టీడీపీ ఎమ్మెల్యేలకు హితవు
– మీడియాతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
శాసనసభ సమావేశాలు తొలి రోజునే టీడీపీ వ్యవహరించిన తీరు దురదృష్టకరం. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరతీసింది. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు దారుణంగా ఉంది.రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి, ఆయనను కించపరిచే విధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు.
గౌరవ శాసనసభలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించటం లేదు. విజ్ఞతతో వ్యవహరించ లేదు. గవర్నర్.. తన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏవిధంగా పనిచేయబోతుందో చెప్పే ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోవడం, ప్రసంగ ప్రతులను చించి వేయడం దురదృష్టకరం, దుర్మార్గం.
రాజకీయాలు ఎన్ని ఉన్నా.. గౌరవ శాసనసభలో సభ్యులు సంప్రదాయాలు పాటించాలి, సభా గౌరవాన్ని కాపాడాలనే ఆలోచన కూడా లేకుండా టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు సిగ్గు చేటు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా, ఇకమీదట అయినా ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుతున్నాం. టీడీపీ సభ్యుల చర్యను ఖండిస్తున్నాం.
గతంలో శాసనసభ్యులుగా మేము ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. కేవలం ప్రభుత్వ విధానాలని మాత్రమే మేము తప్పుబట్టాం. ఇది మంచి పద్ధతి కాదు అన్నది టీడీపీ సభ్యులు గుర్తెరగాలి.