( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎదుటివారి ఫోన్లలో ఏం మాట్లాడుకుంటున్నారో వినే దొంగచెవుల పెగసస్ స్పైవేర్ గత్తర ఇప్పుడు పార్లమెంటును దాటి ఆంధ్రా అసెంబ్లీకి చేరింది. ఇప్పటికే పార్లమెంటులో లొల్లి అయిన ఈ యవ్వారంపై కమిటీ వేశారు. దాని నివేదిక-తీర్పు ఎప్పుడు వస్తుందనేది మీరు అడక్కూడదు. నేను చెప్పకూడదు. ఎందుకంటే అదో రాజకీయ బ్రహ్మ రహస్యం కాబట్టి! పైగా రోగి అయిన టీడీపీ కోరింది, వైద్యుడయిన వైసీపీ అదే కోరుకుంది కాబట్టి, విచారణ ఎన్నాళ్లు ‘సాగు’తుందో చూడాలి.
ఇప్పుడు ఆంధ్రాలో గత్తర లేపుతున్న పెగసస్ స్పైవర్ యవ్వారమేంటో చూద్దాం. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా.. ఏపీ స్టేట్వాళ్లు కూడా పెగసస్ స్పెరేర్ మా దగ్గర కొన్నారు కాబట్టి, మీరూ ఓ 25 కోట్లు ఇచ్చి మా సాఫ్ట్వేర్ కొనుక్కోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, సదరు కంపెనీ ప్రతినిధి సూచించారట. దాంతో ఆమె కాళికావతారమెత్తి.. ‘ఠాట్. నేను మీకు ఎలా కనిపిస్తున్నాననుకుంటున్నారు? మేం అలా దొంగచెవులు పెట్టి ఎవరేం మాట్లాడుకుంటున్నారో వినాల్సినంత ఖర్మ పట్టలేద’ని తన్ని తగలేసిందట. ఆ ముక్క ఆమె ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిందట. సరే.. సరే ఆమె అలా అన్నట్లు ఎక్కడా రిపోర్టు కాలేదనుకోండి. అది వేరే విషయం.
మరి మమతాదీదీ చెప్పారంటున్న ఆ రగస్యం అన్ని రాష్ట్రాలు దాటి, ఆంధ్రాకు ఎలా చేరిందనేది కదా అందరి డౌటనుమానం? సింపుల్. అక్కడ మమతాదీదీకి-ఏపీలో జగనన్నకు, ‘ఉమ్మడి ఉపాయకర్త’ ప్రకాంత్కిశోరన్నయ్య కాబట్టి, ఆ ఉప్పు ఆటోమేటిక్‌గా ఆంధ్రాలో వైసీపేయులకు అందిందనుకుందాం. అది ఇస్యూ కాదు. అసలు మమతాదీదీని కలసిన ఆ స్పైవేర్ కంపెనీ ప్రతినిధి.. తన సేల్స్ ప్రమోషన్లో భాగంగా ఏపీ సర్కారు కూడా కొనుక్కుంది కాబట్టి, మీరూ కొనుక్కోండి అన్న కవి హృదయంతో చెప్పి ఉండవచ్చు. అది కూడా ఇస్యూ కాదు.ఇది కూడా చదవండి: దొంగచెవుల…పెగాసస్ స్పైవేర్
అసలు పెగాసస్ స్పైవేర్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఆంధ్రా సర్కారు కొన్నదా లేదా? అన్నదే ఇస్యూ. ఒకవేళ చంద్రబాబు నాయుడు సర్కారు అది కొని ఉంటే, దానికి బోలెడు ప్రోసీజర్లు పాటించాలి. ఆ స్పైవేర్ కొనడమంటే.. నేరుగా చట్నీస్ హోటల్లో దోసె మాదిరిగానో, కాకినాడ సుబ్బయ్య హూటల్ నుంచి బుట్ట భోజనం మాదిరిగానో, రామరాజ్ కాటన్ షాపులోకి వెళ్లి ధోవతి ఆర్డరు ఇచ్చి తెచ్చుకోవడమంత వీజీ కాదు!
ఆ ఇజ్రాయిల్ సంస్థ అలాంటి నిఘా నేత్రాలను, లయన్స్‌క్లబ్‌లో మాదిరిగా ఎవరికి పడితే వారికి ఉచితంగా దానం చేయవు. చిరంజీవి బ్లడ్‌బ్యాంకులో బ్లడ్ కావాలంటేనే బోలెడన్ని ఫార్మాలిటీసు ఉంటాయి. మరి అంతలావు ఇంటర్నేషనల్ కంపెనీకి ఉండవూ? ఇజాయ్రిల్ స్పైవేర్ కంపెనీకి పేటీఎం చేస్తే వచ్చి వాలటానికి, అది అమెజాన్ కంపెనీ కొరియర్ లో పంపే వెయ్యి రూపాయిల కెమెరా పెన్ను కాదు. పెగాసస్ స్పైవేర్!
దానిని కొనుక్కోవాలంటే ఓ లెక్కా, పత్రం ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు వాటిని అమ్మడం దుర్లభం. ఏదైనా సరే కేంద్ర ఏజెన్సీల ద్వారా కొనాల్సిందే. ఒకవేళ అప్పుడు బాబు సర్కారు రాజకీయ ప్రత్యర్ధుల కదలికపై కక్కుర్తి పడి దానిని కొన్నప్పటికీ, అది కేంద్ర ఏజెన్సీలో రికార్డయి తీరుతుంది. అదే నిజమయి ఉంటే మూడేళ్ల వైసీపీ సర్కారు ఎప్పుడో పసిగట్టి, ఈపాటికి టీడీపీని దుంపతెంచేది.
రాష్ట్ర ప్రభుత్వం దానిని కొనాలంటే, డీజీపీ నేతృత్వంలోనే ఒక కమిటీ ఏర్పడాలి. దాని ధర-నాణ్యతపై చర్చలు జరగాలి. డెమోను పరిశీలించేందుకు పోలీసు పెద్దలు ఇజ్రాయిల్ వెళ్లాలి. చూసి, అందులోని లాభనష్టాలేమిటన్నది ఒక నివేదిక ఇవ్వాలి. కంపెనీ చెప్పిన ధరపై బేరసారాలు లిఖితపూర్వకంగా జరిగి, చివరాఖరకు కొనడానికి బేరం కుదిరితే చెల్లింపులన్నీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే జరగాలి. ఇంత జరిగినా, ఈ వ్యవహారమంతా కేంద్ర ఏజెన్సీ ద్వారానే నడవాలి సుమా!
మరి ఆ లెక్కన సదరు దొంగచెవుల కంపెనీకి బాబు సర్కారు చెల్లింపులు చేసిందా? లేదా అన్న విషయం ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి గారు ఆయన చాంబరులో కూర్చునో, లేక అప్పుల కోసం ఇప్పుడు ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నందున ఏపీభవన్‌లో కూర్చునో, ఆర్ధికశాఖ అధికారులను పిలిచి ‘ఏమోయ్.. చంద్రబాబు ఆ స్పైవేర్‌ను ఎంతకు కొన్నారు? ఎప్పుడు కొన్నారు? మనం ఎంత పేమెంట్ చేశామో ఆ బిల్లులూ అవీ పట్రండి’ అని కాలుమీదకాలేసుకుని ఆర్డరిస్తే, ఆయన టీ తాగే అర్ధగంటలోగా వివరాలన్నీ ఆయన టేబుల్మీదనే వచ్చి వాలిపోతాయి. ఇది కొద్దిగా బుర్ర-బుద్ధి ఉపయోగిస్తే అందరికీ అర్ధమయ్యే లాజిక్.
మరి ఈరోజు వరకూ బుగ్గన గారు గానీ, ఆపత్సమయంలో అధికార పార్టీ అవసరాలు తీర్చే మిత్ర మీడియాలు ఆ విషయాన్ని ప్రత్యక్షంగా గానీ, లీకుల రూపంలోగానీ బయటపెట్టనందున, పెగాసస్ స్పైవేర్ కొన్నారనడం అనుమానమే. అసలు ఈ మూడేళ్లలో అధికార పార్టీ మీడియా కూడా చంద్రబాబు సర్కారు కొన్నది చెబుతున్న దానిపై శూలశోధన చే సి, నిజం నిగ్గుతేల్చకపోవడం ఆశ్చర్యమే కాదు. అన్యాయం కూడా!
పోనీ.. ఈ ఆరోపణలపై తెదేపాయులు తేలు కుట్టిన దొంగల్లా ఉంటే.. లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ వైసీపీ ఎంపీలు, చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం కేంద్రప్రభుత్వ ఏజెన్సీ ద్వారా స్పైవేర్ కొన్నదా లేదా? కొంటే ఎంతకు కొన్నది అని నిర్భయంగా ప్రశ్నించి జవాబు రాబట్టం ద్వారా, తెదేపాయులను నడిబజార్లో నిలబెట్టేవారు. పాపం ఎందుకో వైసీపీ ఎంపీలు ఇంతవరకూ ఆ పని కూడా చేయలేకపోయారు.
‘ అసలీ స్పైవేర్ యవ్వారమేమిటో అర్ధం కావడం లేదు. మీ ప్రభుత్వం కొన్నదా లేదా? చెప్పండి. టెన్షన్ భరించలేక ఛస్తున్నా’నని ఎవరో దారినపోయే ఎమ్మిగనూరు దానయ్య ఉత్సాహపడి, సమాచార హక్కు చట్టం ప్రకారం పాత డీజీపీ సవాంగన్నకు ఓ అర్జీ పెట్టుకున్నారట. సవాంగన్నేమో.. ‘‘ఛ.ఛ. అలాంటి

పాడు పనులు మేం చేయం బాబు. అలాంటి పనులు మా ఇంటా వంటా లేదు. అసలు అలాంటిదేమీ మా ప్రభుత్వం కొన్న పాపాన పోలేదు. మాకేమీ తెలియదు. మీ అనుమానం అబద్ధం’ అని చక్కగా ఆంగ్రేజీలోనే బదులిచ్చారు.
సో.. మొన్నటి వరకూ డీజీపీగా సవాంగన్నే ఉన్నారు కాబట్టి, ఆయనకు తెలియకుండా ఏ కొనుగోలూ జరగదు. ఇహ ఆయనే అవన్నీ ఉత్తిదేనని తేల్చిన తర్వాత, మరి స్పైవేర్ నిజంగా కొన్నారా లేదా అన్న విషయాన్ని మెడ మీద తల ఉన్న వాళ్లు ఆలోచించాల్సిందే!
ఈలోగా ఒక అంబటి, ఇంకో గుడివాడ అమర్నాధులు, అబ్బయ్యచౌదర్లు స్పైవేర్ సంగతి తేల్చాల్సిందేనని యాగీ చేయడం, లేటెస్టుగా అసెంబ్లీ కూడా హౌస్ కమిటీ వేయటం జరిగిపోయాయి. సరే.. మీరూ మీరూ కొట్టుకుని మమ్మల్నెందుకు ఈ రచ్చలోకి లాగుతున్నారో అర్ధం కాని ఇజ్రాయిల్ దేశం రాయబారి రంగప్రవేశం చేసి.. అసలు మేం స్పైవేర్‌ను ప్రైవేటు వ్యక్తులకు అమ్మలేదని అసలు విషయం కక్కేశారు. మంచిదే. అయినా రచ్చ రంబోలా సాగుతోంది.
ఏమాటకామాట. దీనిని నిగ్గుతేల్చాలంటున్న అంబటి రాంబాబు కూడా ‘మేము చంద్రబాబు ప్రభుత్వం స్పైవేర్‌ను కొనిందని ఎక్కడా చెప్పడం లేదు. టీడీపీ వాళ్లే భుజం తడుముకుంటున్నారు. అది అబద్ధమైతే మమతాపై పరువునష్టం దావా వేయమనండి’ అని నిజాయితీగా చెప్పడాన్ని మెచ్చుకోవలసిందే.
అసలు స్పైవేరే లేదని అప్పటి డీజీపీ సవాంగన్న, మేం ప్రైవేటు వ్యక్తులకు అమ్మేదిలేదని ఇజ్రాయిలు ఆసామీ, కేంద్ర ఏజెన్సీ అనుమతి లే నిదే నిఘా పరికరాలు కొనడం అసంభవమని నిబంధనలు చెబుతున్నా..
ఏబీ వెంకటేశ్వరరావు నిఘా బాసుగా ఉన్నప్పుడే వీటిని కొన్నారని, అందుకే ఆయనను సస్పెన్షన్ చేశారంటూ తలా తోకా లేని, కొన్ని కథనాల లీకులు చూసే వారికి రోత. ఆయన సస్పెన్షనుకు కారణాలు వేరు. ఏబీపై మీడియాలో వచ్చిన లీకు ఆరోపణలకు, చార్జిషీటులో ఉన్న అంశాలకు పొంతనే లేదు. స్పైవేర్ యాగీలో తనపేరు రావడంతో ఏబీ మీడియా ముందుకొచ్చి, తాను ఇంటలిజన్స్ ఏడీజీగా ఉన్నంతవరకూ ఎలాంటి స్పైవేర్ కొనలేదని వివరణ ఇచ్చారు. సరే దానితోపాటు ఆయన సొంత గోడు కూడా వినిపించారనుకోండి. అది వేరే విషయం.
మరి నిన్నటి డీజీపీ సవాంగన్న చెప్పినట్లు, స్పైవేర్‌ను ఇప్పటి ప్రభుత్వం కొనక.. అప్పటి నిఘా దళపతి ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లు అప్పటి ప్రభుత్వమూ కొనక.. అసలు మేం ప్రైవేటు సంస్థలు-వ్యక్తులకు అలాంటివాటిని అమ్మే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ రాజధాని చెప్పిన తర్వాత.. మరి వైసీపేయులు కొన్నట్లు ఆరోపిస్తున్న ఆ పెగసస్ స్పైవేర్ ఎక్కడికి పోయింది? అప్పుడు అబ్కారీ శాఖలో లీటర్లకు లీటర్లు ఎలుకలు మందు తాగినట్లు.. ఆసుపత్రుల్లో బస్తాలకు బస్తాలు మందులు మింగినట్లు.. కొంపదీసి స్పైవేర్‌ను కూడా అదే ఎలుకలు తినేశాయా? లేక కాకులె త్తుకెళ్లాయా? అంటే కొద్దిగా బుర్రపెట్టి ఆలోచిస్తే, ఈ పెగసస్ యవ్వారం చివరాఖరకు, నిజాలు నిగ్గు తేల్చేది కాకుండా.. ఉత్తి ‘పగ’సస్ అవుతుందనిపిస్తోంది. హేమంటారు?! ‘షేమ’ంటారా?