రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియంను నిర్మించాలనే ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రిలో క్రికెట్ స్టేడియం నిర్మించాలని అన్ని పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నప్పటికీ… ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిర్మాణాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇదే విషయంపై సీఎం జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు.
ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తాను వ్యతిరేకమని సీఎంకు రాసిన లేఖలో ఉండవల్లి స్పష్టం చేశారు. సెంట్రల్ జైలు స్థలంలో స్టేడియం నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. మరి ఈ అంశంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.