-రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబు
-ఆ అయిదేళ్లూ చంద్రబాబును సమర్థించిన పవన్‌కళ్యాణ్
-ఆ తర్వాత ప్యాకేజీ కుదరక బాబును వ్యతిరేకించిన పవన్
-ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో కలిసేందుకు పవన్ యత్నాలు
-అందుకే రైతులకు అన్నీ చేసిన మా ప్రభుత్వంపై విమర్శలు
-అలా రైతుమిత్ర ప్రభుత్వంపై అర్ధం లేని ఆరోపణలు, దూషణలు
-చంద్రబాబు డైరెక్షన్. పవన్ కళ్యాణ్ యాక్షన్
-అందుకే ఇద్దరూ వేర్వేరుగా విమర్శల పర్వం
-ఒకే విషయంపై ఒకేలా మాట్లాడుతున్నారు
-రైతులను రెచ్చగొట్టే విధానాలు వీడండి
-క్రాప్ హాలీడే ఎక్కడ ఉన్నదో చూపండి
-నటుడు పవన్‌కళ్యాణ్. మహానటుడు చంద్రబాబు
-రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా ఉంది
-రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు
-అందుకే చంద్రబాబు, పవన్ ఓర్చుకోవడం లేదు
-నిత్యం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం
-ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌కు పవన్‌కళ్యాణ్ డబ్బింగ్
-అసలు ఆయనకు వ్యవసాయం గురించి ఏం తెలుసు?
-చంద్రబాబు హయాంలో అంతా దరిద్రం
-ఆయన ఎక్కడ కాలు పెట్టినా ఒక అరిష్టం
-చంద్రబాబు హయాంలోనే క్రాప్ హాలీడే
-ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన మంత్రి కాకాణి
నెల్లూరు:ప్రెస్‌మీట్‌లో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:
రైతు ద్రోహితో మళ్లీ..:
రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తానని మాట ఇచ్చి, కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా వారిని మోసం చేసి రైతు ద్రోహిగా నిల్చిన చంద్రబాబును ఆ 5 ఏళ్లూ పవన్‌కళ్యాణ్ సమర్థించారు. ఆ తర్వాత ప్యాకేజీ కుదరక వ్యతిరేకించిన పవన్‌కళ్యాణ్ మళ్లీ ఇప్పుడు అదే రైతుద్రోహితో కలిసేందుకు తహతహలాడుతున్నాడు. అందుకే రైతులకు అన్ని విధాలుగా మేలు చేసి, వ్యవసాయాన్ని పండగలా చేసి రైతుమిత్రగా ఉన్న మా ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. అర్ధం లేని ఆరోపణలు దూషణలు కొనసాగిస్తున్నారు.
పవన్‌కు అసలేం తెలుసు?:
ఇవాళ వ్యవసాయం, రైతుల స్థితిగతులకు సంబంధించి నటుడు పవన్‌కళ్యాణ్, మహానటుడు చంద్రబాబుగారు వేర్వేరుగా, రకరకాలుగా కామెంట్స్ చేశారు. ప్రధానంగా క్రాప్ హాలీడే గురించి మాట్లాడారు. క్రాప్ హాలీడే గురించి తాను మాట్లాడిన తర్వాతే, ప్రభుత్వం భయపడి హడావిడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసిందని, కాల్వలు, చెరువలు సక్రమంగా లేకపోవడం వల్లనే రైతులు సాగు చేయలేకపోతున్నారని పవన్‌కళ్యాణ్ అన్నారు.
వ్యవసాయం, వ్యవసాయ విధానం, రైతుల గురించి పవన్‌కు అసలు ఏం తెలుసు? కానీ ఆయన మాట్లాడుతుంటే బాధనిపిస్తోంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదువుతున్నారు.
ఒక్క కారణమైనా చెప్పాలి:
పవన్‌కళ్యాణ్ స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. మరోవైపు వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం గతంలో వ్యవహరించిన తీరు గురించి ఒకసారి అవగాహన చేసుకుంటే, ఆయనకు కనీసం నోట మాట కూడా రాదు. నీవు ఒక్క కారణం స్పష్టంగా చెప్పు. దేని వల్ల క్రాప్ హాలీడే ఎక్కడ ప్రకటించారో చెప్పు. క్రాప్ హాలీడే గురించి ఏవేవో కారణాలు చూపుతున్నావు.
అప్పుడు జరిగింది కాబట్టి..:
చంద్రబాబు హయాంలో అంతా దరిద్రం. ఆయన ఎక్కడ కాలు పెట్టినా దరిద్రం. అరిష్టం. చంద్రబాబు హయాంలో క్రాప్ హాలీడే జరిగింది కాబట్టి, ఆయన డైరెక్షన్‌లో నీవు ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు డైరెక్షన్. పవన్ కళ్యాణ్ యాక్షన్.
చంద్రబాబు పాలనలో నాడు వందలాది కరువు మండలాలు ప్రకటించారు. మా ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. అన్ని చోట జలకళ ఉట్టిపడుతోంది. రిజర్వాయర్లు అన్నీ నీటితో నిండిపోయాయి. కళకళలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అర్థం లేకుండా ఇద్దరూ వేర్వేరుగా విమర్శలు చేస్తున్నారు.
దీనికి సమాధానం చెప్పాలి:
పవన్‌కళ్యాణ్‌ను నేను ఒక్కటే అడుగుతున్నాను. రైతుల రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు, ఆ పని చేయకుండా వారిని మోసం చేశాడు. దీన్ని కాదంటావా? చంద్రబాబు అసలు రైతులకు ఏం చేశాడో చెప్పు. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు వెనకబడ్డారని అంటున్నారు. ఏ విధానం వల్ల వాళ్లు నష్టపోతున్నారో చెప్పండి.
మేము రైతు భరోసా ఇస్తామన్నాం. ఇచ్చాం. రైతు భరోసా కింద రైతులకు ఇప్పటి వరకు రూ.23,875 కోట్లు ఇచ్చాం. అదే చంద్రబాబు రైతుల రుణాలు దాదాపు లక్ష కోట్లు మాఫీ చేస్తానని, చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. అలాంటి దద్దమ్మ చంద్రబాబు. అలాంటి వ్యక్తిని పవన్‌కళ్యాణ్ వెనకేసుకొస్తున్నాడు.
వ్యవసాయానికి కరెంటు మీటర్లు పెడుతున్నారని ఇద్దరూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచితే, దాని మీద ధర్నా చేస్తే బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపారు.
మరక అంటించే ప్రయత్నం:
చంద్రబాబు హయాంలో క్రాప్ హాలీడే జరిగింది కాబట్టి, దాన్ని గుర్తు చేసి, ఈ ప్రభుత్వానికి కూడా మరక అంటించాలన్న తపన తప్ప.. ఏ విధానం అయినా బాగా లేకపోతే, ఎక్కడైనా పొరపాటు జరిగితే, ఏ విధంగా రైతులకు నష్టం జరిగిందో చెబితే.. దానికి మేము సమాధానం చెబుతాం.
కానీ అవేవీ మాట్లాడకుండా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే, సంతకం పెట్టి, దానికి డబ్బింగ్ చెబుతున్నావు. ఒక 10 పంటలు చూపిస్తే 5 పంటల పేర్లు చెప్పలేని నీవు రైతుల గురించి మాట్లాడుతున్నావు. అసలు వారి గురించి మాట్లాడే స్థాయి నీకుందా?
ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. చంద్రబాబు నీకు చెప్పాడు. గతంలో మనం ఓడిపోయాం కాబట్టి, ఇప్పుడు రైతులను లోబర్చుకోవాలని చెప్పారు. అందుకే ఆయన చెప్పినట్లు నీవు మాట్లాడుతున్నావు.
ఆ దమ్ము ధైర్యం మీకున్నాయా?:
ఇవాళ నీవు మూడు ఆప్షన్లు అన్నావు. ఎవరికి ఆ ఆప్షన్లు ఇస్తున్నావు.
మీరందరూ కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటారంట. దాన్ని బట్టే మా బలం, మీ బలహీనత, లోపం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది.
మీరందరూ కలిసి ఎంత బలహీనంగా ఉన్నారో, వైయస్సార్‌సీపీ ఎంత బలంగా ఉన్నదో అర్ధం అవుతుంది.
చంద్రబాబు ప్రతిసారి ఎవరో ఒకరితో అంటకాగి, గెలవడం తప్ప, ఏనాడూ ఒంటరిగా గెలవలేదు. కానీ మా చరిత్ర అది కాదు. జగన్‌గారు ఏనాడూ ఎవరితోనూ జత కట్టలేదు. ఒంటరిగా పోటీ చేసి మీ అందరినీ మట్టి కరిపించారు. ఆ దమ్ము, ధైర్యం మీకున్నాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానంటున్నావు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటే కదా?
నిన్ను ప్రజలు ఏవగించుకుంటున్నారు:
నీవు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఎక్కడైనా, ఏ పార్టీ అధ్యక్షుడైనా గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగిందా? అంటే ప్రజలకు నిన్ను కనీసం అసెంబ్లీకి పంపడం కూడా ఇష్టం లేదు.
చంద్రబాబుతో నీవు అంటకాగుతున్నావని ప్రజలు ఆ బుద్ధి చెప్పారు. పైగా
నీ చర్యలు చూసి ప్రజలు, రైతులు ఏవగించుకుంటున్నారు.
చంద్రబాబుకు దత్తపుత్రుడిగా మారి, ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నావు. ఆయన కోసం పని చేస్తున్నావు. ఈసారి ప్రజల్లో కూడా నీవు తిరగలేవు. ఆ విషయం గుర్తు పెట్టుకో. చంద్రబాబు మీద నీకు ఎందుకో ప్రేమ విపరీతంగా పెరిగింది. ప్యాకేజీ కుదిరినట్లుంది.
నీవు ఏనాడైనా రైతుల గురించి ఆలోచించావా? అంటే దానికి సమాధానం లేదు.
ఆరోజు ప్యాకేజీలు మాట్లాడుకుని జగన్‌గారి మీద పోటీ చేశావు. ఆ తర్వాత ప్యాకేజీ కుదరక టీడీపీతో విభేదించావు. మళ్లీ ఇప్పుడు ప్యాకేజీ కుదిరింది. అందుకే చంద్రబాబు ఏం చెబితే అది మాట్లాడుతున్నావు. ఆయన రాసిచ్చింది చదువుతున్నావు.
‘రైతు రథం’లో అవినీతి:
చంద్రబాబు రైతులను ఎన్ని విధాలుగా మోసం చేశారో చెబుతున్నాం. రైతుల గురించి మేము పట్టించుకున్నట్లు ఎవరూ చేయలేదు. దాదాపు రూ.1.10 లక్షల కోట్లు వేర్వేరు పథకాల్లో రైతులకు ఇచ్చాం. మీరు చెబుతున్నారు. రైతులకు ట్రాక్టర్లు ఇచ్చామని. ఇప్పుడు మేమూ ఇచ్చాం. కానీ ఆరోజు మీరు రైతు రథం పేరుతో ఇచ్చిన ట్రాక్టర్లలో కూడా అవినీతికి పాల్పడ్డారు.
ఏ కంపెనీ ట్రాక్టర్‌ను, ఏ డీలర్ వద్ద, ఎక్కడ కొనాలన్నది మీరే నిర్ధారించి, బహిరంగ మార్కెట్‌లో రూ.5 లక్షలున్న ట్రాక్టర్‌కు రూ.6 లక్షల ధర నిర్ణయించారు. దాంట్లో రూ.4.50 లక్షల సబ్సిడీ అని చెప్పి, మిగిలిన రూ.1.5 లక్షలు రైతులు భరించాలని చెప్పారు. ఆ విధంగా ప్రతి రైతు నుంచి రూ.50 వేలు మొదలు లక్ష వరకు జేబులో వేసుకున్నారు. ఆనాడు
చంద్రబాబు, ఆయన కుమారుడు ఏ విధంగా దోచుకున్నారో అందరికీ తెలుసు. దీంతో ఎమ్మెల్యేలు మొర పెట్టుకోగా, వారికీ అంతో ఇంతో వాటా ఇచ్చారు.
మాదంతా పారదర్శకత:
ఇవాళ మేము కూడా ట్రాక్టర్లు ఇచ్చాం. ఎంత పారదర్శకంగా ఇచ్చామో చూపిస్తాం. దమ్ముంటే రండి. మీరు రైతులకు వ్యక్తిగతంగా ట్రాక్టర్లు ఇస్తే, మేము రైతుల గ్రూప్‌లకు ఇచ్చాం. అంతే కాకుండా, ఎవరైనా తమ ఇష్టం వచ్చిన మోడల్‌ను, ఎక్కడైనా కొనుక్కోవచ్చని చెప్పాం. సబ్సిడీని నేరుగా రైతుల గ్రూప్‌ల ఖాతాల్లో వేశాం. ట్రాక్టర్ ధరను రైతు గ్రూప్‌లనే బేరం చేయమన్నాం.
నీకా ప్రభుత్వం భయపడేది?:
పవన్‌కళ్యాణ్ మాట్లాడే విధానంలో ఒక ఎజెండా స్పష్టంగా కనిపిస్తోంది. తాము చంద్రబాబు ఒక్కటై, అవసరమైతే బీజేపీని కూడా కలుపుకుని జగన్‌గారిని ఓడించాలని.
ధాన్యం సేకరణ చేస్తే, వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. అయితే నాకు భయపడి, ప్రభుత్వం రూ.139 కోట్లు ఖాతాల్లో వేసిందని చెప్పుకుంటున్నావు. నీకా ప్రభుత్వం భయపడేది. రెండుచోట్ల ఓడిపోయిన నీవు, అసలు ఒక పార్టీకి అధ్యక్షుడివేనా?
ఇదీ మా ప్రభుత్వ పనితీరు:
జగన్‌గారు సీఎం కాగానే, రైతు భరోసా కింద రైతులకు నేరుగా పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేస్తున్నాం. గ్రామాల్లో విత్తనం మొదలు పంటలు అమ్ముకునే వరకు రైతు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయి. కావాలంటే వెళ్లి స్వయంగా చూడు.
చంద్రబాబు హయాంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు దివాలా తీశాయి. ఆప్కాబ్‌ను నాశనం చేశారు. జగన్‌గారు వచ్చాక వాటికి రూ.285 కోట్ల నిధులు ఇస్తే, వాటికి ఆర్థిక అండ దొరికి 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు తిరిగి నిలబడ్డాయి. అదే విధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (ప్యాక్స్) కూడా పని చేస్తున్నాయి.
ప్రతి పంటకు బీమా, గిట్టుబాటు ధర వచ్చేలా ఇ–క్రాపింగ్ చేస్తున్నాం. ఎక్కడా రైతులకు నష్టం కలగకుండా చూస్తున్నాం. చంద్రబాబు గతంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సాధ్యం కాదన్నారు. వారికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం మీటర్లు పెడుతుంటే, రైతులకు ఉరితాళ్లు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
జగన్‌గారు, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా చెల్లిస్తున్నారు. ఈనెల 14న ఇవ్వబోతున్న క్రాప్ ఇన్సూరెన్స్ ఏకంగా దాదాపు రూ.3 వేల కోట్ల వరకు ఉండనుంది. ఇది ఒక విడతలో, ఒక ఏడాదిలో ఇస్తున్న మొత్తం.
చంద్రబాబు 100 జన్మలు ఎత్తినా ఆ పని చేయగలడా?
రైతులు బాగుండడం మీకిష్టం లేదు:
నీవు, చంద్రబాబు ఇద్దరూ కూడబలుక్కుని, ఒక ప్లాన్ ప్రకారం రైతుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో రైతులు బాగా లేరు. కాబట్టి ఇప్పుడు కూడా వారు బాగుండొద్దని మీరు కోరుకుంటున్నారు. నీవు చంద్రబాబుకు దత్తపుత్రుడివే. మళ్లీ చెబుతున్నాం. ఎందుకంటే ఆయన కోసమే పని చేస్తున్నావు.
మా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో రైతులకు అడుగడుగునా అండగా నిలుస్తోంది. అవి ఒకవేళ సక్రమంగా పని చేయకపోతే, వాటికి రైతులు ఎందుకు వస్తున్నారు? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు కూడా సరఫరా చేస్తున్నాం. చివరకు పంటల కొనుగోలు కూడా చేస్తున్నాం.
30 ఆప్షన్లు ఉన్నా..:
ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టే, పదే పదే దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించు. మూడు ఆప్షన్లు అంటున్నావు. నీకు 30 ఆప్షన్లు ఉన్నా ఒరిగేదేమీ లేదు. మేము ఎక్కడా భయపడబోము. అసలు నీకేముందని మేము భయపడాలి. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయావు.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, రాత్రికి రాత్రి పారిపోయి ఇక్కడికి వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అయన తపనంతా ఒకటే. వెంటనే పరిపాలన చేపట్టాలని. అందరూ కలిసి ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన.. అన్ని పార్టీలది అదే లక్ష్యం. దానర్థం జగన్‌గారు ఎంతో బలంగా ఉన్నారనే కదా?
మేము ప్రజలకు చేసిన మేలు మాకు ధీమా. ఇంటింటికీ ఎన్ని పథకాలు ఇచ్చామన్నది చూపుతున్నాం. అందుకే వారు ఆదరిస్తున్నారు. చివరకు కుప్పంలో కూడా స్థానిక ఎన్నికల్లో మా పార్టీకి పట్టం కట్టారు.
పార్టీ లేదు. బొక్కా లేదని ఇప్పటికే వారు చెప్పారు. ఇంకా పార్టీ ఆఫీస్‌కు తాళం వేయడం ఏమిటి?
రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా ఉంది. అందుకే ఆక్వా రైతులు కూడా మళ్లీ సాగుకు ముందుకు వస్తున్నారు. ఇదే చంద్రబాబును, పవన్‌కళ్యాణ్‌ను బాధిస్తోంది.