Suryaa.co.in

Features

పోలవరం డయాఫ్రం వాల్‌

డయాఫ్రం వాల్‌ గురించి తెలుసుకోవాలంటే అంతకంటే ముందుగా నీటిపారుదల ప్రాజెక్టు.. అందులో ఏమేమి భాగాలుంటాయో తెలుసుకోవాలి. ఏ ప్రాజెక్టునైనా నదిపై నిర్మిస్తారు. నీటిని నిల్వ చేసుకునేందుకు జలాశయం నిర్మిస్తారు. దీనికి కాలువలతో అనుసంధానం ఉంటుంది. ఈ జలాశయానికి స్పిల్‌ వే, మట్టికట్ట లేదా రాతి, మట్టికట్ట కూడా నిర్మిస్తారు.

స్పిల్‌ వే అంటే ఏమిటి?

నదిలో వరద వచ్చినప్పుడు జలాశయం పూర్తిగా నిండిపోయిన తర్వాత ఆ ప్రవాహాన్ని ఒక క్రమపద్ధతిలో పొర్లిపోయేలా (స్పిల్‌ వే) బయటకు వదిలేసేందుకు నిర్మించే కట్టడమే ఇది. దీనికి తలుపులు ఏర్పాటుspillway చేస్తారు. ప్రతి ప్రాజెక్టులో వరదలు వచ్చినప్పుడు తలుపులు ఎత్తి నీళ్లు వదలడం మనం చూస్తుంటాం. ఆ కట్టడమే స్పిల్‌ వే.

ఏ స్థాయిలో నిర్మిస్తారు?

స్పిల్‌ వే నిర్మించే ముందు వందల ఏళ్ల నది వరద ప్రవాహ చరిత్రను పరిశీలిస్తారు. ఒక్క రోజులో ఎంత పెద్ద వరద రావచ్చో అంచనా వేస్తారు. హఠాత్తుగా అంత వరద వస్తే ఆ కట్టడానికి ఏ ఇబ్బంది రాకుండా తలుపులు తెరిచి ఆ నీటిని సులభంగా దిగవకు వదిలేసే స్థాయిలో, అంత పటిష్ఠంగా ఈ స్పిల్‌ వే నిర్మిస్తారు.

స్పిల్‌ వే విషయంలో పోలవరం ప్రత్యేకతలేమిటి?

పోలవరం ప్రాజెక్టులో ఒక్క రోజులో 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా గేట్లు ఎత్తి దిగువకు వరద వదిలేసేటంత సామర్థ్యంతో స్పిల్‌ వే నిర్మిస్తున్నారు. సాధారణంగా ఏ ప్రాజెక్టులోనైనా జలాశయానికి స్పిల్‌ వే నది ప్రవహించే మార్గంలోనే, నది మధ్యలోకి వచ్చేలా నిర్మిస్తారు. కానీ పోలవరంలో అలా నిర్మించడం లేదు.

ఎందుకని?

ఎందుకంటే చాలా లోతువరకు ఇసుక ఉన్న పరిస్థితుల్లో అక్కడ స్పిల్‌వే నిర్మాణం సరికాదని నిపుణులు పేర్కొన్నారు. గోదావరిలో పోలవరం వద్ద ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పుడో బ్రిటిష్‌ హయాం నుంచే ఉంది. ప్రాజెక్టు నిర్మించే క్షేత్రం చాలా సవాల్‌తో కూడినది. నదీ ప్రవాహాలపై అధ్యయనం చేసే అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ బ్యూరో ఆఫ్‌ రిక్లమేషన్‌ సంస్థ(యుఎస్‌ఆర్‌ఆర్‌) ఇక్కడ పరిశీలించి 1940కు ముందే ఇక్కడ స్పిల్‌ వే నిర్మాణం సరికాదని పేర్కొంది.

కారణాలు ఏం చెప్పింది?

యుఎస్‌ఆర్‌ఆర్‌ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన కీలకమైన సంస్థ. నదీ ప్రవాహ మార్గాలు…వాటిపై నిర్మాణాలకు సంబంధించి మంచి నైపుణ్యం ఉన్న సంస్థగా పేరుంది. పోలవరం వద్ద గోదావరిలో దాదాపు 100 అడుగుల నుంచి 300 అడుగుల వరకు దాదాపు కిలోమీటరు మేర మేటలు మేటలుగా ఉన్న ఇసుకను పరిశీలించారు. ఆ దిగువ ఎక్కడో రాతిపొరలు ఉన్న అంశాన్ని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గుర్తించిన క్షేత్రం కాంక్రీటు కట్టడం నిర్మాణానికి సరైనది కాదని, అక్కడ స్పిల్‌ వే నిర్మాణం సాధ్యం కాదని పేర్కొన్నారు. పైగా గోదావరి మహానది. అనేక నెలల పాటు వేల, లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉంటాయి. ఇంత మహా ప్రవాహాల నేపథ్యంలో ఒక కట్టడం నిర్మించడం అంత సులభమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఇంతగా పూడుకుపోయిన ఇసుకలో స్పిల్‌ వేకు పునాదిగా నిర్మించే కాంక్రీటు నిర్మాణం సాధ్యం కాదని తేల్చింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా నిర్మించాలా అనే నిపుణుల తర్జనభర్జనలతో గోదావరిని మళ్లించి స్పిల్‌ వే స్థలాన్ని కూడా మార్చాలని నిర్ణయించారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏం చేశారు?

అక్కడ ఇలాంటి సమస్య రాలేదు. నది మధ్యలోనే స్పిల్‌ వే నిర్మించారు. అక్కడ నదిలో ఉన్న రాతి నేలల్లో నుంచి కాంక్రీటు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు.

మరిప్పుడు ఏం చేస్తున్నారు?

గోదావరి నది ఇప్పుడు ప్రవహిస్తున్న మార్గాన్ని మళ్లిస్తున్నారు. గోదావరి కుడి గట్టుపై గతంలో ఏడు గ్రామాలు ఉండేవి. పెద్ద పెద్ద కొండల మీద ఈ ఊళ్లు ఉండేవి. ఆ కొండల్లో రాతి నేలలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొండలను ఒక స్థాయి వరకు తవ్వేసి నదిని ఆ ఊళ్ల మీదకు మళ్లించేలే ప్రవాహ మార్గాన్ని మార్చారు. ఆ కొండల్లో ఉన్న రాయి ఆధారంగా నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా స్పిల్‌ వే నిర్మిస్తున్నారు.

గోదావరి ఇప్పుడు ప్రవహిస్తున్న మార్గంలో ఏం కడుతున్నారంటే…

రాతి, మట్టి కట్టతో డ్యాం కడుతున్నారు. దానిని ఆంగ్లంలో ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం అంటున్నారు. గోదావరి నది ప్రవాహాన్ని జలాశయంగా నిలబెట్టేందుకు ఇది దోహదపడుతుంది. స్పిల్‌ వే నిర్మిస్తే ఇబ్బంది అనుకున్నారు కదా… రాతి, మట్టి కట్ట నిర్మించేందుకు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు అని సందేహం రావచ్చు. అలాంటి ఇబ్బంది రాకుండా నిర్మించిందే డయా ఫ్రం వాల్‌.

గొప్పతనం ఏమిటి?

పోలవరంలో గోదావరి నదికి అడ్డంగా ఏకంగా 1.5 మీటర్ల మందం(వెడల్పు)తో 1.38 కిలోమీటర్ల మేర నిర్మించినంత డయాఫ్రం వాల్‌ భారతదేశంలోనే లేదు. అంతే కాదు… నదిలో ఏకంగా దాదాపు 90 నుంచి 300 అడుగుల లోతుకు వెళ్లి రాయిని పట్టుకుని ఆ రాయిలో నుంచి ఇలాంటి ఊటనీటి నియంత్రణ గోడ నిర్మించింది దేశంలోనే ఎక్కడా లేదు. విదేశాల్లో కూడా ఇంత లోతు నుంచి ఎక్కడా నిర్మించింది లేదని ఈ నిర్మాణాల్లో అనుభవం ఉన్న బావర్‌ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

నిర్మాణంలో అసలు సవాల్‌ ఏమిటి?

ఊట నియంత్రణ గోడ నిర్మాణంలో దాదాపు 300 అడుగుల లోతు నుంచి కూడా నిటారుగా గోడ నిర్మించుకుంటూ రావాలి. అంటే 90 డిగ్రీల లంబకోణంలోనే ఆ నిర్మాణం ఉండాలి. ఎక్కడా చిన్నపాటి తేడా కూడా ఉండకూడదు. అది సరిగ్గా చేయడమే అసలు సవాల్‌. ఇందుకు ఉపయోగించిన యంత్రపరికరాలు, పని చేసిన వారి నైపుణ్యం, అనుభవమే ఇందులో కీలకమైంది.

నిర్మాణ ప్రక్రియ ఎలా సాగింది?

హైడ్రాలిక్‌ గ్రాబర్లు, బ్లాచింగ్‌ ప్లాంట్లు, ఎంసీ128 వంటి కట్టర్లు….ఇలా పెద్ద పెద్ద యంత్రపరికాలు వినియోగించారు. ఇక్కడ ఉన్నదంతా ఇసుకే. తవ్విన చోట ఆ ఇసుక పెచ్చులుగా ఊడితే నిర్మాణం కష్టం. అందుకే ఈ యంత్రాల సాయంతో తవ్వుతూ ఆ తవ్విన ప్రాంతంలో బెంటినైట్‌ ద్రావణం పోస్తూ రాయిpolavaram1 తగిలే వరకు తవ్వుకుంటూ వెళ్లారు. ఆ తవ్విన ఇసుక, మట్టి తదితరాలు పైకి తీసుకొచ్చేందుకు ఒక పంపు ఉంటుంది. ఆ ఖాళీ ఏర్పడ్డ ప్రదేశంలో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ నింపుతూ వెళ్లారు. ఇలా రాయి తగిలే వరకు వెళ్లారు. ఈ క్రమంలో ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. దేశంలో ఈ స్థాయి నిర్మాణం చేసిన గుత్తేదారు ఏజన్సీ లేకపోవడంతో జర్మన్‌ కంపెనీ బావర్‌ను రంగంలోకి దించి పనులు చేయించారు.

బెంటినైట్‌ ద్రావణం ఎందుకు?

లోతుకు తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు ఇసుకతో మళ్లీ పూడుకుపోయే అవకాశం ఉంటుంది. అలా పెచ్చులూడి పడకుండా ఒకపక్క చుట్టూ బెంటినైట్‌ ద్రావణ నింపుతూ లోతుకు తవ్వుకుంటూ వెళ్తారు.

ప్లాస్టిక్‌ కాంక్రీటు అంటే ఏమిటి?

డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ వాడారు అంటే ప్లాస్టిక్‌ వాడారని కాదు. సిమెంట్‌, ఇసుక, కంకరతో పాటు బెంటినైట్‌ పొడిని నీళ్లతో కలిపి జత చేస్తారు. దీని వల్ల కట్టడం గట్టిగా ఉంటుంది. భూకంపాలు వచ్చినప్పుడు ఆ ప్రభావాలను తట్టుకుంటుంది. ఉదాహరణకు ఒక కర్ర స్కేలు గట్టిగా వంచితే విరిగిపోతుంది. అదే ప్లాస్టిక్‌ స్కేలును గట్టిగా వంచినా ఏ ప్రభావమూ పడదు. అంటే ఈ కాంక్రీటు వల్ల కాస్త సంకోచ, వ్యాకోచ గుణం ఉండి నిర్మాణం పటిష్ఠంగా ఉంటుంది.

ఎన్ని రోజుల్లో, ఎలా నిర్మించారు?

గోదావరిలో లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉంటాయి. ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకే ప్రవాహాలు తగ్గుతాయి. ఈ సవాళ్లను తట్టుకుంటూ 412 రోజుల్లో డయా ఫ్రం వాల్‌ నిర్మించారు.

ఎంత ఖర్చయింది?

రూ.430 కోట్లు ఖర్చు చేశారు. జర్మనీ నిర్మాణ సంస్థ బావర్‌కు ఈ పనిలో అనుభవం ఉంది. వారు ఎల్‌అండ్‌టి జియోతో కలిసి ఈ నిర్మాణ పనులు చేశారు.

వరదలు వస్తే డయాఫ్రం వాల్‌కు ఇబ్బంది ఉండదా?

ఏ ఇబ్బంది ఉండదు. సాధారణంగా నదిపై ఉండే ఇసుక ఎప్పుడూ కోసుకుపోదు. వరద మరింత పూడికను తీసుకువచ్చి మేట వేసేలా చేస్తుంది. కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదని ఇంజినీర్లు చెబుతున్నారు.

ఇక రాతి, మట్టి కట్ట నిర్మాణమే!

పూర్తయిన డయాఫ్రం వాల్‌పై ఇక 1.47 కిలోమీటర్ల పొడవునా రాతి, మట్టి కట్ట నిర్మాణం చేపడతారు. ఈ డ్యాం దిగువ భాగంలో దాదాపు వెయ్యి అడుగుల వెడల్పు ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. అలా క్రమంగా తగ్గుతూ పైకి వచ్చేసరికి 50 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ నిర్మాణం 2019 డిసెంబర్‌కు పూర్తి చేయాలని లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఆకృతులు ఖరారు కావాల్సి ఉంది.

డయాఫ్రం వాల్‌ అంటే…?

నదిలో అడ్డుకట్టగా పెద్ద రాతి, మట్టి కట్ట కడుతున్న సమయంలో పునాది ఎలా నిర్మించాలి అనేది కీలకాంశం. ఊట నీరు అటు నుంచి ఇటు వైపునకు రాకుండా పకడ్బందీ ఏర్పాటు ఉండాలి. మన ఇంటికి పునాది ఎలాగో కరకట్టకు పునాది కూడా అంత పటిష్టంగా ఉండాలి. ఇందుకు అనేక విధానాలున్నాయి. పోలవరంలో డయాఫ్రం వాల్‌ పద్ధతి సరైంది అని తేల్చారు. ఇక్కడ చాలా లోతు వరకు ఇసుక ఉన్నందున ఆ ఇసుక గుండా నీటి ఊట అడ్డుకట్ట దాటుకుని వచ్చేసే ప్రమాదం ఉంది. అందుకే రాతిపొర తగిలే వరకు కూడా ఊట నియంత్రణ గోడ నిర్మించాల్సి వచ్చింది. ఆ గోడే డయాఫ్రం వాల్‌.

ఇసుక పొరల్లో కట్టిందిలా..

గోదావరి గర్భంలో ఇసుక పొరల్లో నిర్మించేదే డయాఫ్రంవాల్‌. ఆ గోడ అంతా ఏకమొత్తంగా నిర్మించుకుంటూ రావడం సాధ్యం కాదు. అందుకని యంత్రాల సాయంతో తొలుత 7 మీటర్ల మేర తవ్వుతూ బెంటినైట్‌ ద్రావణం నింపుతూ వెళ్లారు. తవ్విన ప్రదేశంలోని ఇసుక, మట్టి, రాళ్లను అదే యంత్రం సాయంతో బయటకు తీసుకొచ్చేశారు. తిరిగి ప్లాస్టిక్‌ కాంక్రీటును ఆ ఖాళీ ప్రదేశంలో నింపారు. ఇలా ఏడేసి మీటర్ల చొప్పున నిర్మించడమే ఒక ప్యానల్‌. దాని పక్కన మళ్లీ 2.8 మీటర్లు వదిలేసి మళ్లీ మరో 7 మీటర్ల మేర తవ్వుకుంటూ గోడ నిర్మించారు. తర్వాత ఇలా మధ్యమధ్యలో 2.8 మీటర్ల మేర వదిలేసిన వాటిని తవ్వి అక్కడ గోడ కడతారు.

పోలవరం ఏ రకంగా ప్రత్యేకం?

పోలవరం ప్రాజెక్టు 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు మళ్లించేందుకు అనువుగా నిర్మిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 13.56 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికి అనువుగా నిర్మించారు. అదే నాగార్జునసాగర్‌ 15.60 లక్షల క్యూసెక్కుల వరద మళ్లించేందుకు వీలుగా నిర్మించారు. పులిచింతల ప్రాజెక్టు 20 లక్షల క్యూసెక్కుల వరదను మళ్లించగలదు. ప్రకాశం బ్యారేజిని 12.12 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేయగలిగే సామర్థ్యంతో నిర్మించారు.

దాదాపు 90 అడుగుల ఎత్తైన గేట్లు

స్పిల్‌ వే 1.12 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్నారు. వీటికి అమర్చే 48 గేట్లు ఒక్కోటి దాదాపు 90 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంత పెద్ద తలుపులు దేశంలో ఏ ప్రాజెక్టులోనూ ఇంతవరకు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. ఈ స్పిల్‌ వే నిర్మాణం తలుపులతో సహా 2019 మార్చి నాటికి పూర్తి కావాలనేది లక్ష్యం.

-బొమ్మరాజు దుర్గాప్రసాద్‌

LEAVE A RESPONSE