హైందవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. వైదిక కాలంలో, మిగతా దేవతలతో పోలిస్తే సూర్యారాధనకే అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కాలం గడిచేకొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది. అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాలలో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం.
వీటిలో అరసవల్లి గురించి అందరికీ తెలిసిందే! శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం దాదాపు 1500 సంవత్సరాలుగు భక్తుల పూజలందుకుంటోంది. ఇక్కడి స్వామిని కొలుచుకున్నవారి కష్టాలు తొలగి, హర్షంతో తిరిగి వెళ్తారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరుకి హర్షవల్ల అనే పేరు ఉండేది. అదే కాలక్రమేణా అరసవల్లిగా మారింది.
ఇక తెలుగు ప్రజలకి సైతం అంతగా తెలియని మరో పురాతన సూర్య ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గ్రామం చెంతనే తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని ఓ నమ్మకం. ఊరిలోకి అడుగుపెడుతూనే అనేక గోపురాలు దర్శనమిస్తుంటాయి. అందుకే ఈ ఊరిని గోపురాల మామిడాడ అని కూడా పిలుచుకుంటారు.
గొల్లల మామిడాడలోని సూర్యనారాయణస్వామి దేవాలయం ఈనాటిది కాదు.మామిడాడ క్షేత్రంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి. అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగా ఉంటాయి.ఈ రెండు తూర్పు,పచ్చిమ దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి. దీనిలో మొదటిది 1950వ సంవత్సరంలో నిర్మించిన గాలి గోపురం 9 అంతస్తులతో 160 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ గాలిగోపురం 1958వ సంవత్సరంలో 13 అంతస్తులతో 200 అడుగుల ఎత్తు ఉంటుంది.
వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గోపురాల క్రింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. మెట్లు ఎక్కి గోపురం పైకి చేరిన తరువాత ఆ పైనుంచి చూస్తే చుట్టూ 25కి.మీ దూరం నుండి కనిపించే పచ్చని పంటలు, కాలువలు, కాకినాడ ప్రాంతం, ఇలా ఎన్నో ప్రకృతి రామణీయతలను వీక్షించవచ్చును ….
ఇంకా ఆ గోపురాల ముఖ్య విశిష్టత ఆ గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం.
గోపురాలపై ఉన్నశిల్పాలు రామాయణ,మహాభారత కధా వృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో మనోహరంగా,సుందరంగా అమర్చారు. ఆ శిల్ప సౌదర్యం చూస్తూఉంటే ఆనాటి రామాయణ,మహాభారత విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అకాలంలోనికి మనల్ని తీసుకోని పోతాయి…..
ఎప్పుడో 1902లో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరాటంకంగా ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వేళ్లలో ఈ ఆలయంలో జరిగే విశేష పూజలను చూసి తీరాల్సిందే. ఇక రథసప్తమి వంటి పర్వదినాలలో అయితే స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలుపంచుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు. గొల్లల మామిడాడలో సూర్య భగవానునికి ఆలయం ఉండటమే ఓ విశేషం అయితే, ఈ స్వామి ఉష, ఛాయ అనే దేవేరులతో కలిసి సతీసమేతంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత.
ఆలయానికి చేరుకొనే మార్గం :
మామిడాడ గ్రామం కాకినాడకు 20కి.మీ దూరం,రాజమండ్రికి 58 కి.మీ దూరం ,సామర్లకోటకు 17కి.మీ దూరంలో ఉంటుంది.
కాకినాడ,రాజమండ్రి,సామర్లకోట వరకు రైలు సౌకర్యం కలదు.
అక్కడనుండి బస్సులు,ఆటోలు,ఇతర ప్రెవేటు వాహనాలద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు