- మాధవ్ వీడియో క్లిప్ విచారణను కప్పిపుచ్చే ప్రయత్నాలు
- సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వెల్లడించండి
- ఎస్పీకి హైకోర్టు న్యాయవాది గూడపాటి లేఖ
అమరావతి: సిఆర్ పిసి – 1973 ప్రకారం ఒక క్రిమినల్ నేరాన్ని వ్యక్తికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా హాని కలిగించే గాయంగా పరిగణించబడుతోందని ప్రముఖ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎంపి గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్ పై విచారణ విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంబనపై లక్ష్మీనారాయణ అనంతపురం ఎస్పీ ఫకీరప్పకు ఒక లేఖ రాశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల చిత్రానికి సంబంధించి ప్రచారంలో ఉన్న వీడియో క్లిప్ ఒరిజినల్ కాదని పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. సాంప్రదాయ దర్యాప్తు విషయంలో ఫోరెన్సిక్ ప్రక్రియ తరువాత దశలో వస్తుంది. ఇక్కడ సైబర్ నేరాల విషయంలో వాస్తవాలను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ ప్రక్రియతో దర్యాప్తు ప్రారంభమవుతుంది. వాస్తవాన్ని నిర్ధారించడానికి వీడియో క్లిప్‌ను ఏ డిజిటల్ ల్యాబ్‌కు పంపకుండానే,10 ఆగస్టు, 2022న జరిగిన ప్రెస్మీట్లో మీరు చెప్పిన వీడియో క్లిప్ ఫేక్ అని నిర్ధారించినట్లుగా ఉందని తెలిపారు.
అలాగే ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెందిన ఫోన్(లు), ల్యాప్‌టాప్, ఐప్యాడ్/ట్యాబ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోలేదు. వీడియో క్లిప్ యొక్క వాస్తవికతను విశ్లేషించడానికి దర్యాప్తు బృందం న్యూఢిల్లీలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ICERT)ని సంప్రదించిందా లేదా అనేది చెప్పాల్సి ఉంది. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా చలామణిలో ఉన్న వీడియో నకిలీదని ప్రకటించడం దర్యాప్తు ప్రక్రియను తీవ్రంగా ఉల్లంఘించడమేనని గూడపాటి లక్ష్మీనారాయణ ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇంకా కొనసాగుతున్న విచారణకు సంబంధించి వక్రీకరించిన వివరాలను బహిర్గతం చేయడం పోలీసు ఎథిక్స్, పోలీసు మాన్యువల్ కు విరుద్ధం. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో చేసినట్లు కనిపిస్తోంది. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్‌పై సమగ్ర విచారణ జరిపి, విధి విధానాల ఆధారంగా వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని గూడపాటి విజ్జప్తి చేశారు.