Suryaa.co.in

Political News

గద్దర్ లో ఎందరో అపరిచితులు!

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి గుడికి గద్దర్ సూటు బూటుతో వచ్చిన ఫొటోలను ఆగస్టు 26నాటి పత్రికలు ప్రచురించాయి. సాధారణంగా దేవాలయానికి సంప్రదాయ లేదా సాధారణ దుస్తుల్లో వెళతారు. గద్దర్ మాత్రం అందుకు భిన్నంగా సూటు, బూటు, టైతో హాజరుకావడం వింతగా, విచిత్రంగా ఉంది. ఆయన మానసిక సంతులనం, సంయమనం పూర్తిగా కోల్పోయినట్టు కనిపిస్తోంది. గతంలోనూ ఇలాగే రకరకాల వేషధారణతో, వ్యవహార శైలిలో ‘బహురూపి’గా దర్శనమిచ్చాడు. ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తిగా ఇలా వైరుధ్యభరితంగా వివిధ వేషాలతో పిట్టలదొరను తలపించేలా వ్యవహరించడం సబబుగా ఉంటుందా?

ఇలా ద్వంద్వ ప్రమాణాలతో, ద్వైదీభావంతో మెలగడం ఆయనకే చెల్లింది. ఇదొక మానసిక రుగ్మత అయి ఉంటుంది. ఆ రుగ్మతలతో ప్రజల్ని గందరగోళ పరచడం భావ్యమా?… తన అభిప్రాయాలు, ఆశయాలు, ఆలోచనలకు… ఆయన నివసించే భవనానికి – ఆస్తిపాస్తులకు, కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్వహణకు ఎక్కడా పొంతన కుదరదు. మరి ఆయన మాటలకు, పాటల మకుటాలకు, ప్రసంగాలకు ప్రాసంగికత ఎలా ఉంటుంది?…. అందరూ ఆలోచించాల్సిన విషయమిది.

ఏకకాలంలో అటు కాంగ్రెసు, ఇటు బిజెపితో జట్టుకట్టి తన ప్రయోజనాలు నెరవేర్చుకునే నైపుణ్యం ఆయన సొంతం. ద్వంద్వ ప్రమాణాలకిది పరాకాష్టకాదా?…. ప్రజల్ని చైతన్యపరిచి కదలించాలనుకునే వ్యక్తి చేయవలసిన పనేనా ఇది?… ఈ విధానం ‘దగా’గాక ఏమనిపించుకుంటుంది?….

దశాబ్దాలపాటు ‘మతం’ మత్తు మందు అని గొంతుచించుకుని ప్రచారం చేసిన గద్దర్ ఇప్పుడు వివిధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడి మహిమాన్వితాలను ఆశువుగా, భక్తి ప్రపత్తులతో గానం చేయడాన్ని ఎవరైనా ఎలా అర్థం చేసుకంటారు?….

గతంలో మావోయిస్టుల ‘మౌత్ పీస్’గా దశాబ్దాలపాటు పనిచేసిన గద్దర్, మొన్న యాదాద్రిలో సూటుబూటుతో ప్రత్యక్షమైన గద్దర్ ఒకరేనా?… అన్న అనుమానం కలుగుతుంది. ఆయనలో ఎంతమంది అపరిచితులున్నారో అన్న సంశయం తప్పక కలుగుతుంది. నిశితంగా పరిశీలిస్తే లెక్కకు మిక్కిలి అజ్ఞాత వ్యక్తులు ఆయనలో కనిపిస్తారు. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలు బహిర్గతమవుతాయి. ఈ వైఖరి – పద్ధతి, తీరు ఎవరికి మేలు చేస్తుంది?…. ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది ఆయనకు తప్ప!
బుల్లెట్ రాజకీయాలకు రాం రాం పలికి, ప్రజాస్వామ్య బ్యాలెట్ రాజకీయాల్లోకి వచ్చానని కొన్నాళ్ళ క్రితం టముకువేసి మరీ ప్రకటించాడు. అప్పుడు పెద్ద హడావుడి జరిగింది. ఈ పరివర్తన విప్లవాత్మకమని కొన్ని పత్రికల్లో అక్షరజ్యోతులు వెలిగించాడు. సభలు – సమావేశాలు నిర్వహించి అధికార పక్షానికి తానే ప్రత్యామ్నాయమని ప్రకటించుకున్నాడు.

భారత రాజ్యాంగ ప్రతిని గుండెలకద్దుకుని అంబేద్కర్ లా ఫొటోలు దిగాడు. తాను అభినవ అంబేద్కర్ నని కూడా చెప్పుకున్నాడు. ఆ ఊపులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని తేదీ, స్థలాన్ని ప్రపంచానికి చాటాడు కానీ ఆ పార్టీ ఇప్పటికీ పురుడు పోసుకోలేదు. ఆయనలోని ఓ ‘అపరిచితుడు’ అలా తళుక్కున మెరిసి మాయమయ్యాడు. ఇలా అనేకానేక సందర్భాల్లో ఆయనలోని అపరిచిత వ్యక్తులు కనిపించి కనుమరుగవుతాడు. ఇది ఆయనలోని మానసిక ‘రుగ్మత’కు నిదర్శనం కాదా…….

ఒక దశలో తెలంగాణకు తానే ముఖ్యమంత్రినవుతానని, మరో సందర్భంలో దేశానికి రాష్ట్రపతినవుతానని కాలికి బలపం కట్టుకుని తిరగాడు. అవేవీ వాస్తవ రూపం దాల్చకపోవడంతో చివరకు తనో కవినని, కళాకారుడినని సమాజాన్ని అధ్యయనం చేసిన మార్క్సిస్టు – అంబేద్కరిస్టునని ఒదిగిపోడు చెప్పుకోసాగాడు. కొంచెం తగ్గి మాట్లాడాడు. ఆయనలో ఎన్ని విద్యలు – ఎన్ని కళలు రాశీభూతమై ఉన్నాయో కదా?… కాని ఇవన్ని ద్వంద్వ స్వభావాలకు చిరునామాలని, ద్వైదీ భావానికి నిలయమని ఆయన గ్రహించలేకపోవడం విషాదం.

కారల్ మార్క్స్ రచనల్ని ఔపోసన పట్టానని, అంబేద్కర్ భావజాలాన్ని జీర్ణించుకున్నానని, సంఘ సంస్కర్త జ్యోతిబాపూలే విద్యావిధానంతో స్ఫూర్తి పొందానని ఆయన ఎన్నోమార్లు బహిరంగంగా ప్రకటించారు. కాని ఆ ప్రకటనలకు ఆయన జీవనశైలికి, కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్వహణకు, సూటు బూటు టైతో ఖరీదైన కారులో తిగడానికి ఏమైనా పొంతన కుదురుతుందా?… నప్పుతుందా?

ఆయన మాటల్లో – పాటల్లో, భావాల్లో – ఆచరణలో, పారదర్శకత లేదు. శతకోటి వైరుధ్యాల పుట్టగా, ఎన్నో బలహీనతలు పడగవిప్పి బుసలుకొడుతున్న వ్యక్తి నుంచి అద్భుతమై సామాజిక మార్పునకు స్ఫూర్తిని, సంస్కరణలను ఎలా ఆశించగలం? సమాజాన్ని ప్రభావితం చేస్తాడని ఎలా అనుకుంటాం. నిజాయితీ, పారదర్శకత కొరవడినప్పుడు గొప్ప పనులు ఎలా సాకారమవుతాయి?… ఈ నేపథ్యంలో ఎన్ని ధర్మపన్నాలు వల్లించినా, దడ దడమని డప్పులు వాయించినా ఏమిటి ప్రయోజనం?…. అదంతా సొంత ప్రయోజనాలు పొందడానికే పనికొస్తుందితప్ప మరొకటి కాదు. ఎంతమంది ‘బ్యాకప్’ మనుషులున్నా, సోషల్ మీడియా దన్ను ఎంత ఉన్నా అదంతా కృతకం… కృత్రిమం తప్ప సహజ బలం – బలగం కాదు. కాంతిమంతం అసలేకాదు.

తనకిప్పుడు 70 వసంతాలు దాటాయని, శరీరంలో ఓ తుపాకి తూటా ఉందని సమయం – సందర్భం కాకపోయినా సానుభూతి పొందేందుకు ఆయన అందరికి చెబుతూ ఉంటాడు. కాని తన ప్రోద్బలం, ప్రోత్సాహంతో తాను ఉసిగొల్పడంతో మావోయిస్టు ఉద్యమంలోకి, అరణ్యాలలోకి వేలమంది వెళ్ళారు. వారిలో వందలమందికి ఉద్యమంలోకి అలాంటి తూటాలు తగిలి కన్నుమూశారు. వారి కుటుంబాల కడగండ్ల గూర్చిన ప్రస్తావన తీసుకురాడు, అనాధలైన వారి పిల్లల దీన, దైన్య పరిస్థితి గుర్తుకురాదు. తన శరీరంలో దిగిన బుల్లెట్ మాత్రం ప్రతిదినం గుర్తుకొస్తుంది. ఇది ఏరకమైన ఆదర్శ భావన అనిపించుకుంటుంది?… ఏవిధంగా విప్లవ స్వభావమవుతుంది?…. అసలు మానవీయత అనిపించుకుంటుందా?

ఎంతోమంది అపరిచితుల్ని తన పొట్టలో దాచుకున్న గద్దర్, ద్వంద్వ ప్రమాణాలు పాటించే గద్దర్ సమాజానికి – పేద ప్రజలకు సుద్దులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది. జుగుప్సకూడా కలుగుతుంది. వాస్తవానికి గద్దర్ గళం నుంచి వచ్చేమాట – పాట అన్నీ కాలం చెల్లిన పనికిరాని సాఫ్ట్ వేర్ లాంటివి. అవేవీ ఉపకరించవు. త్వరలో హైదరాబాద్ లో 5-జి టెలిఫోన్ సర్వీసులు ప్రారంభం అవనున్నాయి. బ్రాడ్ బ్యాండ్ సేవలు విరివిగా అందుతున్నాయి. కృత్రిమ మేధ ఆలంబనగా, డ్రైవర్ అవసరం లేని కార్లు – వాహనాల తయారీ భారత్ లోనూ జరగబోతోంది. అగ్రదేశాల్లోని ఆధునిక టెక్నాలజీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దర్శనమవుతోంది.

సూటు బూటుతో ఎవరిని ప్రభావితం చేయగలడు?… ఎవరిని ఆకర్షించగలడు?… ఇది కోటి రూకల ప్రశ్న. వాస్తవానికి మావోయిస్టు పార్టీ ఆయనను బహిష్కరించినప్పుడే ఆయన శకం ముగిసింది. ముగిసిన అధ్యాయంలో కొత్త కాంతి కనిపించదు. శూన్యం తప్ప!

-వుప్పల నరసింహ,
సీనియర్ జర్నలిస్టు,
తెలంగాణ సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత

సెల్ : 9985781799

LEAVE A RESPONSE