Suryaa.co.in

Telangana

నిమ్స్ డైరెక్టరు అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నారు

హైదరాబాద్ నడిగడ్డన ప్రభుత్వం నడిపే నిమ్స్ లో ‌స్టంట్లు వేస్తారు. బైపాస్ సర్జరీలూ చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచీ అలాంటి అవసరాల కోసం ‌సామాన్య రోగులు అక్కడికి విరివిగా వెళతారు. కాని ఆ నిమ్స్ ను నడిపే డైరెక్టరు గారు తనదాకా వచ్చేసరికి మాత్రం తన సంస్థను తానే బైపాస్ చేసి అక్కడికి దగ్గరే ఉన్న అపోలో హాస్పిటల్లో చేరి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాడు.

తెలంగాణా ముఖ్యమంత్రిగారు కూడా ఏ కా‌స్త నలత అనిపించినా యశోదా హాస్పిటల్ కే వెళతారు తప్పా, అదే సోమాజిగూడలో కూతవేటు దూరంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ నిమ్స్ కేసి పొరపాటున కూడా చూడరు.

ప్రభుత్వాన్ని నడిపేవాడికీ , సంస్థను నడిపేవాడికే ప్రభుత్వరంగ పెద్దాసుపత్రి మీద నమ్మకం లేనప్పుడు మిగతా మంత్రులూ , ఎమ్మెల్యేలూ , ఐఎఎస్ దొరలూ గవర్నమెంటు హాస్పిటల్స్ లో వైద్యం తమ ప్రిస్టేజికి భంగమని అనుకుంటున్నారంటే ఆశ్చర్యమెందుకు ?

ఆఖరికి దారిద్ర్య రేఖ దిగువన ఉన్న నిరుపేదల కు అత్యవ‌సర వైద్యసాయం కోసం ఆరోగ్యశ్రీ లాంటి పథకాల కింద వెచ్చించే వందల కోట్ల పబ్లిక్ సొమ్మును కూడా చాలావరకూ కార్పొరేట్ హాస్పిటల్స్ సొరచేపలకే సమర్పించుకుంటున్నారు . సామాన్య రోగులకు ఏకైక దిక్కు అయిన ఉస్మానియా, గాంధి వంటి- ఒకప్పుడు పెద్ద పేరున్న ధర్మాసుపత్రులకేమో నిధులు బిగదీసి , అతీగతీ పట్టించుకోకుండా వాటి కర్మానికి , పేద రోగుల ప్రారబ్ధానికి వదిలేస్తారు. ఇక వైద్య,ఆరోగ్య సేవలు బాగుపడమంటే ఎలా బాగుపడతాయి?

ఈ మాయరోగం వదిలించాలంటే ఒకటే మందు. పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా వైద్యం నిమిత్తం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ లోనే విధిగా చేరాలని, అత్యవసరంగా కావలసిన ‌సదుపాయాలు, వనరులు అక్కడ నిజంగా లేని సందర్భాలలో మాత్రమే‌ ప్రైవేటు రంగ సేవలు పొందాలని కట్టడి చేయాలి. అలా కాదు; మాకు కార్పొరేట్ వైభోగమే కావాలి అంటారా? తప్పక వెళ్లండి. కాని పబ్లిక్ సొమ్ముతో కాదు; మీ సొంత ఖర్చుతో .. అని రూలుపెడితే చాలా రోగాలు కుదురుతాయి. మెడికల్ మాఫియా నెక్సస్ తీవ్రత కొంతవరకైనా కంట్రోలు అవుతుంది.

mvr
-M. V. R. శాస్త్రి

 

LEAVE A RESPONSE