-మా అమ్మాయిని ‘మీ రాజధాని ఏది?’ అని ఆటపట్టిస్తున్నారు
-మన పిల్లలు కూడా తలవంచుకునే స్థితి
-జస్టిస్ దేవానంద్‌నోట పోతన పద్యం
రాష్ట్రంలోని తాజా పరిణామాలపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 స్వాతంత్య్ర భారతావనిలో తెలుగు వారికి ఇదీ రాష్ట్ర రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. బయట వారి వద్ద అవమానాలు ఎదుర్కొనే పరిస్థితికి తెలుగు జాతి చేరిందని ఆవేదన చెందారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకొనే పరిస్థితి తెలుగువారికి ఉందా అని… హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు. దానికి కారణం కొందరికి ముందుచూపు తక్కువ కావడం అయ్యుండవచ్చని అన్నారు.దిల్లీలో చదువుతున్న తన చిన్న కుమార్తెను… మీ రాజధాని ఏది అంటూ తోటి విద్యార్థులు ఆట పట్టిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
‘అమృత భారతి’ పేరిట ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాన్ని… విజయవాడలో జస్టిస్ దేవానంద్ ఆవిష్కరించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో తెలుగువారి ప్రగతి వ్యాసాల సంకలనంతో పుస్తకాన్ని ముద్రించారు. “గొప్పగా చెప్పుకోవచ్చుగానీ.. ఏం సాధించాం? రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? దిల్లీలో చదువుతున్న మా అమ్మాయిని ‘మీ రాజధాని ఏది?’ అని ఆటపట్టిస్తున్నారు. మన పిల్లలు కూడా తలవంచుకునే స్థితిలో ప్రస్తుతం తెలుగుజాతి ఉంది. ప్రతి దానికీ కులం, రాజకీయం, స్వార్థం.. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలదే” అని జస్టిస్ దేవానంద్ అన్నారు.
జస్టిస్ దేవానంద్‌నోట పోతన పద్యంజస్టిస్ దేవానంద్ తన ప్రసంగాన్ని ముగిస్తూ చివరిలో బమ్మెర పోతన పద్యం చదివి వినిపించారు. దానిని వర్తమాన పరిస్థితులకు అన్వయించారు. ‘బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్‌గూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుటకంటే సత్కవుల్‌హాలికులైననేమి గహనాంతర సీమల గందమూల కౌద్దాలికలైననేమి నిజ దార సుతోదర పోషనార్థమై’ కన్నకూతురి వంటి కావ్యాన్ని అనర్హులకు అంకితం చేసి.. వారు పెట్టే భోజనం తినే కంటే.. భార్యాబిడ్డల పోషణ నిమిత్తం సుకవి రైతుగా ఉండడం ఉత్తమమని దీని భావం. రచయితలు తమ రచనలను దుర్మార్గులైన పాలకులకు అప్పగించవద్దని.. ప్రజాశ్రేయస్సు, సమాజాభివృద్ధికి ఉపయోగించాలని న్యాయమూర్తి చెప్పారు. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయితలు విహారి, గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచందు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమృతభారతి పుస్తకానికి రచనలు చేసిన రచయితలు జస్టిస్ దేవానంద్‌ను సత్కరించారు.