తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన వారిలో అతి పిన్న వయస్కులు నల్లా నరసింహులు. పరాక్రమములో అభిమన్యుడు. దక్షతలో ధనుంజయుడు. పద్మవ్యూహములను, చక్ర బంధాలను అతి చాకచక్యంగా తప్పించుకున్న విజయుడు, మృత్యుంజయుడు నల్లా నరసింహులు.
తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకాలోని కడవెండి గ్రామం. నాడు నిజాం పాలనలో నల్లగొండ జిల్లాలో ఉండేది కడవెండి. 1946 జూలై 4వ తేదీన దేశముఖ్ గూండాల దాడిలో వీర మరణం పొందిన 18 ఏళ్ల యువకుడు దొడ్డి కొమరయ్యది కడవెండి. తన సొంత భూమి అన్యాక్రాంతం కాకుండా ఏ సంఘం అండ లేకుండానే ఒంటరిగానే విసునూరు దేశముఖ్ తో తలపడి పోరాడి కోర్టులో గెలిచి, దేశముఖ్ గుండాలచే హత్య గావింపబడిన బందగి, భూమి కోసం అవిశ్రాంత పోరాటం చేసిన చాకలి ఐలమ్మది కూడా ఈ ప్రాంతమే. చైతన్యానికి, త్యాగాలకు, పౌరుషాలకు పురిటిగడ్డ ఈ ప్రాంతం.
ఈ కడవెండి లోనే చేనేత కుటుంబీకులైననల్లా లచ్చమ్మ లచ్చయ్య దంపతులకు చారిత్రాత్మకమైన రోజు అక్టోబర్ 2, 1926 నరసింహులు జన్మించారు. లచ్చయ్య చెయ్యి తిరిగిన చేనేత కళాకారుడు. అతి సన్నని దారంతో వస్త్రాలు నేయుటలో నిపుణులు. లచ్చయ్య తయారు చేసిన వస్త్రాలకు మంచి గిరాకి ఉండేది. వారి ఉమ్మడి కుటుంబం సజావుగా సాగిపోతుండేది. నల్లా నరసింహులు బాలుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు పరిపాలన ఉండేది .నిజాం నవాబు పాలనలో జాగీర్దారులు, మఖతేదారులు, వీరితో పాటు దేశముఖు, దేశ పాండేలు ఉండేవారు. కొన్ని గ్రామాలు వీరి ఏలుబడిలోనే ఉండేవి.వీరు ప్రజలను పీడించే వారు, రకరకాలుగా హింసించేవారు. ఆ రోజుల్లో గ్రామాల్లో వీరు ప్రజలతో వెట్టి చాకిరి చేయించుకునేవారు. దండగలు వేసేవారు. ప్రజలను దోపిడీ చేయడమే వీరి రోజు వారి విధి, వృత్తి అన్నట్లుగా ఉండేది.
కడవెండికి ఐదు మైళ్ళ దూరంలో విస్నూరు ఉండేది. విసునూరు దేశముఖ్ రేపాక వెంకట రామచంద్రారెడ్డి దోపిడీదారుడు, దుర్మార్గుడు. ప్రజా కంటకుడు. యితని తల్లి జానమ్మ విధవరాలు, కడవెండికి వచ్చి రకరకాల పద్ధతుల్లో రైతుల వద్ద నుండి బలవంతంగా భూమి లాక్కొని వందల ఎకరాలు సంపాదించినది.
గొల్లలు, కురుమలు గొర్రెలను, మేకలను ఉచితంగా యివ్వాలి. కోమట్లు కిరాణా సరుకులను ఉచితంగా యివ్వాలి. చేనేతలు కోళ్లు, పండగలకు, పబ్బాలకు నేతవస్త్రాలు యివ్వాలి. వివిధ వృత్తుల వారు తాము తయారు చేసిన వస్తువులను ఉచితంగా యివ్వాలి. ఇతర వెనుకబడిన కులాల వారు వంతుల వారీగా వెట్టిచాకిరి చేయాలి. కొన్ని వెనుకబడిన కులాల వారు నిత్యం ఇంటిదగ్గర వెట్టి చాకిరిని చేయాలి. హరిజన గిరిజన వెనుకబడిన తరగతుల స్త్రీ, పురుషులతో రకరకాలుగా వెట్టి పని చేయించుకునేది. జానమ్మ ఏజెంట్లు భార్యాభర్తల మధ్య తగాదాల్లో కూడా తలదూర్చే వారు. తగవు తర్వాత భార్యతో జానమ్మకు ఫిర్యాదు చేయించేవారు. దొరసాని తగవు తీర్చి ఇద్దరికీ దండగలు వేసి డబ్బులు సంపాదించేది.
ఆరోజుల్లో రైతులు పండించిన పంటకు సరైన మార్కెట్ సౌకర్యం ఉండేది కాదు. అలాగే దొరసానమ్మ ప్రజల చేత వెట్టి చేపించి పండించిన పంటకు కూడా సరైన రేటు వచ్చేది కాదు. అప్పుడు తెలివిగా జానమ్మ మనుషులు కొంత ధాన్యము, మిరపకాయలు మొదలైనవి గ్రామంలో రైతులు కాని వారి వాకిట్లో బలవంతముగా పోసి పోయేవారు. తర్వాత కొద్ది రోజులకు వారి నుండి రెట్టింపు ధర వసూలు చేసుకునే వారు. యిలా రక రకాల మాయోపాయాలతో ప్రజల నుండి దండగలు వసూలు చేసేవారు. ఇలాంటి దౌర్జన్యకర పరిస్థితుల నేపథ్యంలో నరసింహులు తండ్రి లచ్చయ్యకి గతంలోచేసిన బట్టల వ్యాపారంలో నష్టం రావడం వలన వ్యాపారులు దావా వేసి అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తిని జప్తు చేసుకున్నారు. దాంతో నల్లా లచ్చయ్య కుటుంబానికి నిలువ నీడ కూడా లేకుండా పోయింది. కట్టుబట్టలతో మిగిలారు. అయితే నల్లా లచ్చయ్య మంచి పనిమంతుడు. రేయింబవళ్లు కష్టపడి కులవృత్తి చేసి త్వరలోనే కోలుకున్నాడు.
పచ్చ బడుతున్న వీరి కుటుంబాన్ని చూసి కొందరికి కళ్ళు మండాయి. వారు చేనేతలే కానీ దొరకు తొత్తులు ఏజెంట్లు. అసూయతో దేశముఖుతో రకరకాలుగా అసత్యాలు చెప్పి ఇబ్బందుల పాలు చేసేవారు. గతంలో ఆస్తి జప్తు చేసుకున్న వర్తకుడిని విసునూరు రామచంద్రారెడ్డితో మాట్లాడిపించి, కుట్ర చేసి ఇంకా అప్పు తీరలేదని మళ్లీ వడ్డీతో సహా తీర్చాలని తగవు పెట్టినారు. ఈ తగాదాలో సున్నిత మనస్కుడైన లచ్చయ్య ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. కానీ త్రుటిలో ప్రమాదం తప్పి బ్రతికాడు. అప్పుడు నరసింహులు పదేళ్ల బాలుడు. మరొక సంవత్సరానికి పదకొండేళ్ల వయసులో అదే గ్రామానికి చెందిన 9 ఏళ్ళ వజ్రమ్మతో నరసింహులుకి పెళ్లయింది.
కడవెండిలో శ్రీరంగాచార్యులు అనే పంతులు గారి వద్ద విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి పిల్లలు ముగ్గురు విద్య నేర్చుకుంటుండేవారు. నరసింహులు కూడా అక్కడే చదువుకునేవాడు. “శాలవాడికి చదువెందుకు” అని దేశముఖ్ తల్లి జానమ్మ నరసింహులును చదువుకోకుండా అభ్యంతరం పెట్టింది.
కానీ రంగాచార్యులు గారు నల్ల లచ్చయ్యకి మంచి స్నేహితుడగుట వలన జానమ్మ దొరసానికి నచ్చజెప్పి చదువుకునే అవకాశం కల్పించాడు. నరసింహులు మంచి ప్రతిభావంతుడు. తెలివైన విద్యార్థి. ఏది చెప్పినా వెంటనే గ్రహించే వాడు. ఏడు వరకు చదివి ఉత్తీర్ణుడయ్యాడు. నాటి ఏడవ తరగతి నేటి బి.ఏ కు సమానం. ఆ రోజుల్లో ఏడు పాసైన వారికి వెంటనే టీచర్ ఉద్యోగం వచ్చేది. కానీ నరసింహులుకు ఉద్యోగ అర్హతకు ఒక సంవత్సరం వయస్సు తక్కువగా ఉంది. ఇంకొక సంవత్సరం గడిస్తే ఉద్యోగం వచ్చేది.
నరసింహులుకు పదహారేళ్ళ వయసులో తండ్రి లచ్చయ్య అనారోగ్యంతో కన్నుమూశాడు. నరసింహులు యింటికి పెద్దవాడు కావటం వలన కుటుంబ భారం మొత్తం అతనిపై బడింది. టీచర్ ఉద్యోగం రావటానికి యింకొక సంవత్సరం కావాలి. ఈలోపు బ్రతుకు దెరువు కోసం కష్టపడి మగ్గం నేయడం నేర్చుకున్నాడు. భాగస్తులతో కలిసి చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది. నిలకడలేని భాగస్వాములు జానమ్మ దొరసానిని ఆశ్రయించారు. నరసింహులు పట్ల మొదటి నుండి కోపంగా ఉన్న జానమ్మ యింటికి పిలిపించి, తన సహజ శైలిలో బాగా అవమానకరంగా మాట్లాడి డబ్బు వెంటనే చెల్లించాలని హుకుం జారీ చేసింది.
యింట్లో ఉన్న బంగారు, వెండి నగలు మరియు బర్రెను అమ్మినను సరిపోక పోవడంతో మిగతా అప్పు తీర్చుటకు కాగితం రాసిచ్చినాడు. ఒక సంవత్సరం పాటు పరాయి ఊరిలో ప్రైవేట్ టీచర్ గా పని చేసి వచ్చిన డబ్బులతో మిగిలిన అప్పు మొత్తం తీర్చాడు. పరాయి ఊరికి వచ్చి పోయే దారిలో ఈ సంవత్సర కాలంలోనే పిట్టల నర్సయ్య గారితో పరిచయమయ్యింది. ఈ పరిచయం విప్లవాత్మకమైన మార్పుకి దారితీసింది. వారి సహవాసం, సహకారంతో ఆంధ్ర మహాసభతో పరిచయమేర్పడింది. ఆంధ్రమహాసభ నరసింహులుకు పరిచయము కావడమే కడవెండి గ్రామ చరిత్రను మార్చింది. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో కడవెండిని చేర్చింది. నరసింహులు బాగా సాహిత్య అధ్యయనం చేశాడు. పోరుచరిత్రలను చదివాడు, చైతన్యంపొందాడు.
కడవెండి గ్రామాన్ని జానమ్మ అరాచకాల నుండి కాపాడాలనుకున్నాడు. కడవెండి గ్రామంలో ఉన్న యువకులు కొందరిని కూడగట్టిండు. జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు వాళ్లకు చెప్పిండు. వారిని చైతన్యపరచిండు. ఒకరోజు కడవెండి గ్రామ యువకులు రహస్యంగా భవనగిరి వెళ్లిన్రు. అక్కడ ఉన్న ముఖ్య నాయకులతో మాట్లాడి వచ్చిన్రు. ఆంధ్ర మహాసభ ఈ విధంగా కడవెండిలో అడుగుపెట్టింది. కడవెండి పెద్ద రైతు దావూద్ రెడ్డి గారి సహకారంతో గ్రామంలో ఉన్న అన్ని కులాల వారిని పిలిచారు. సమావేశము ఏర్పాటు చేశారు. వెట్టి చేయవద్దని దండగ కట్టవద్దని చెప్పారు. ఒక గంట వ్యవధిలోనే వందలాది మంది ప్రజలు సంఘ సభ్యులుగా చేరారు.
ఆంధ్ర మహాసభ గ్రామ సంఘానికి అధ్యక్షులుగా దావూద్ రెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా నల్లా నరసింహులును ఎన్నుకున్నారు. ఈ విధంగా ప్రజల పక్షాన ప్రత్యక్షముగా పోరు సలుపుటకు నిలిచాడు నల్లా నర్సింహులు. కడవెండి గ్రామ ప్రజలు ఆంధ్ర మహాసభ గీసిన గీత దాటలేదు. వెట్టిచాకిరి బంద్ అయింది. దండగలు లేకుండా పోయాయి. ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రజలు మాట వినకుండా పోయారని జానమ్మ దొరసాని మరియు కొడుకు రామచంద్రారెడ్డి కలిసి సంఘాన్ని బలహీన పరచుటకు నల్లా నరసింహులు మరి కొందరిని భయపెట్టుట కొరకు విసునూరు పోలీసుల చేత అరెస్టు చేయించారు. అదే రోజు సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇది నల్లా నరసింహులు మొదటి అరెస్ట్. నరసింహులు భయపడలేదు. పైగా మరింత స్ఫూర్తిని పొంది, ప్రజల పక్షాన గట్టిగా నిలిచాడు. నిజాం ప్రభుత్వం కడవెండి గ్రామంలో ధాన్యం సేకరించుటకు కొందరు అధికారులను పంపించినది. వారు పక్షపాత బుద్ధితో జానమ్మకు తక్కువ లేవీ వేసి, రైతుల వద్ద నుండి అన్యాయంగా ఎక్కువ లేవీ సేకరించే ఎత్తుగడ వేశారు. దీనిని ప్రజలు గట్టిగ వ్యతిరేకించారు. ఎదురు తిరిగారు. ఇది కడవెండిలో వచ్చిన మొదటి ప్రజా తిరుగుబాటు.
కడవెండి గ్రామ కమిటీ ఆంధ్ర మహా సభ ద్వారా అధికారులతో ప్రాతినిధ్యం చేసి సంప్రదింపులు జరిపి జానమ్మ అక్రమంగా దాచి ఉంచిన 80 పుట్ల ధాన్యాన్ని జప్తు చేయించారు. యిదొక గొప్ప ప్రజా విజయం. తరువాత జీతగాళ్లతో సమ్మె చేయించారు. సెలవులతో పాటు వారి జీతాలను భారీ స్థాయిలో పెంపుదల చేయించారు. ఈ విధంగా కడవెండి గ్రామ ప్రజలకు, దేశముఖుకు మధ్యన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రామంలో నెలకొన్న పరిస్థితిని పెద్ద నాయకులకు వివరించి, చేపట్ట వలసిన చర్యల గురించి చర్చించి, అనుమతి పొందుటకు నరసింహులు హైదరాబాదుకు వెళ్ళాడు.
సరిగ్గా ఆ సమయంలోనే దొరలు, దొరల గుండాలు కడవెండి గ్రామంపై దాడి చేశారు. చైతన్యవంతులైన కడవెండి గ్రామ ప్రజలు దాడిని ఎదుర్కొని నిలిచారు. హోరాహోరీగా పోరు సాగింది. గుండాల దాడిలో యువకుడు దొడ్డి కొమరయ్య వీరమరణం పొందాడు. ప్రజల్లో ఆవేశం పెల్లుబికింది. నల్లగొండ జిల్లా అంతటా ఎక్కడ చూసినా పోరాటాలే. తెలంగాణ సాయుధ పోరాటము ఉప్పెన వలె నైజాం సర్కార్ పై విరుచుకు పడింది.
నరసింహులు పిలుపు ఒక ప్రభంజనం. అంతేకాదు ఉవ్వెత్తున కెరటం వలె లేచిన ప్రజలను కనుసైగతో ఒక మాటతో ఆపగలడు. సాయుధ పోరాటములో తాను ఉన్న ప్రతి చోట చాలా చిన్న వయసులోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చాడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వలె ఒకేసారి ఐదారు గ్రామాల్లో ప్రత్యక్షమయ్యే వాడు. పోలీసులు, ప్రజలు యితను మాంత్రికుడయి ఉండవచ్చని భావించేవారు.
నరసింహులు బక్క పలుచగా, ఎత్తుగా ఉంటాడు. కానీ ఎక్కుపెట్టిన బాణంలా ఉంటాడు. దీర్ఘమైన నాసిక. విశాలమైన కర్ణములు. తెల్లని ధోవతి, దానిపై తెల్లని లాల్చీ, కళ్లకు నల్ల ఫ్రేమ్ కళ్ళద్దాలు. ఆ కళ్ళల్లో కరుణ. ఆకర్షణీయమైన స్వరూపము.
నల్లా నరసింహులును ఏవిధంగానైనా పట్టుకోవాలని పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అనేక రోజులు అనేక గ్రామాల్లో తిరుగుతూ తప్పించుకున్నాడు. చివరికి సూర్యాపేటలో నల్లా నరసింహులు పోలీసులకు దొరికాడు. అరెస్ట్ చేసి పోలీస్ క్యాంపులో అమానుషంగా రకరకాలుగా క్రూరంగా హింసించారు. ఆ రోజుల్లో జైళ్లు నరక కూపాలుగా ఉండేవి. సరైన తిండి కూడా పెట్టేవారు కాదు.
తర్వాత కొన్నాళ్లకు పకడ్బందీగా ప్లాన్ వేసి ఒక రోజు మహబూబ్ నగర్ జైలునుండి చాక చక్యంగా తప్పించుకున్నాడు. అక్కడి నుండి కష్టపడి వివిధ మార్గాల ద్వారా ప్రయాణించి విజయవాడలోని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం చేరుకున్నాడు. అక్కడ విజయవాడలో కొన్నాళ్లు భీమిరెడ్డి నర్సింహారెడ్డి మొదలైన వారితో కలిసి గెరిల్లా పోరాటంలో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత పార్టీ ఆదేశం మేరకు జనగామ తాలూకాలోని గ్రామాల్లో ప్రజా ఉద్యమాల్లో విస్తృతంగా పాల్గొన్నాడు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశంలో ఉన్న సంస్థానాలన్ని కొన్ని షరతులతో విలీనమయ్యాయి. నైజాం నవాబు భారత యూనియన్‌లో విలీనం కావడానికి ఒప్పుకోలేదు. స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. కమ్యూనిస్టులు హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేయడానికి పోరాటం ఉధృతం చేశారు. రజాకార్లు, నిజాం పోలీసులు కమ్యూనిస్టుల ఆచూకీ తెలపమని ప్రజలను హింసించేవారు. ప్రజలు గ్రామాలు ఖాళీ చేసి చేలల్లో, కొండల్లో, బావుల దగ్గర తల దాచుకునే వారు.
ఈ సమయంలోనే 1948 ఆగస్టు 17 నాడు బైరాన్ పల్లిలో ఖాసిం రజ్వీ నాయకత్వాన రజాకార్లు 118 మంది ప్రజలను సామూహికంగా కాల్చి చంపారు. ఇదొక నరమేధం. ఇది అత్యంత హేయమైన కిరాతక చర్య.
జలియన్ వాలాబాగ్ ఉదంతమువలె నున్నది. ఈ సందర్భంలోనే ప్రజాకవి కాళోజీ “కాలంబు రాగానే కాటేసి తీరాలె” అని ఆవేశంగా గేయం రాశాడు. విసునూరు దేశముఖ్ కుమారుడు బాబు దొరను ప్రజలు జనగామ రైల్వే స్టేషన్ లో దొరికిచ్చుకున్నారు. అతనికి 50 మంది పోలీసులు రక్షణగా కూడా ఉన్నారు. ప్రజాగ్రహాన్ని చూసి పోలీసులు నిశ్చేష్టులై పోయారు. గూడ్స్ రైలు కింద దాగి ఉన్న బాబు దొరను ప్రజలు బయటకు లాగి కర్రలతో చితకబాది తలను నుజ్జు నుజ్జు చేశారు.
తరువాత నిజాం చెర నుండి తెలంగాణను విముక్తం చేయడానికి 1948 సెప్టెంబర్ 13వ తేదీన సైనిక చర్య ప్రారంభమైంది. రెండు రోజుల్లోనే సైన్యం రజాకార్లను తుడిచిపెట్టి వేసింది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానమును భారతదేశంలో విలీనం చేశాడు నవాబు. కమ్యూనిస్టుల పోరు ఆగలేదు, సాగుతూనే ఉంది. నల్లా నరసింహులు లక్ష్మక్కపల్లి లో పట్టుబడినాడు. పట్టుబడిన వారిని కాల్చి చంపమని సైనికాధికారులకు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, నరసింహులుకున్న ప్రజాభిమానం, అతని భావజాలము, సిద్ధాంతం పట్ల విశ్వాసం, అవగాహన, వాదనా పటిమ, నిర్భయయాన్ని, నిజాయితీగల ప్రవర్తనను చూసి చలించిపోయారు. చంపలేదు సరికదా! సైనికాధికారులు చాలా మర్యాదగా ప్రవర్తించారు. పోలీసులకు అప్పగించారు.
పోలీస్ స్టేషన్లో కనీస సౌకర్యాలు కూడాలేవు. వేళకు తిండి లేదు. నరసింహులు అరెస్టు వార్త తెలిసి ప్రజలు వందలాదిగా స్టేషన్ చుట్టూ గుమికూడే వారు. నరసింహులుకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చూసి పోలీసులు రగిలిపోయి, అతి క్రూరంగా హింసించినారు. నరసింహులును ఒకసారి చూసిపోదామని వచ్చిన సుబేదారు క్షతగాత్రుడయిన నరసింహులును చూసి చలించిపోయాడు. నరసింహులును హింసించ కూడదని, పోలీసులకు ఆ అధికారం లేదని, యిక ముందు యిలా ప్రవర్తించ కూడదని గట్టి వార్నింగ్ యిచ్చాడు.
తర్వాత నర్సింహులు పై ఆరోపించబడిన మూడు అక్రమ కేసుల్లో ముగ్గురు జడ్జీల ముందు తన కేసును తనే వాదించుకున్నాడు. న్యాయవాదులను నియమించుకునే అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేదు. కమ్యూనిస్టు పార్టీ భావజాలాన్ని, దాని ఆవశ్యకతను విశదీకరిస్తూ సుదీర్ఘమైన స్టేట్మెంట్ రాసిచ్చాడు. ఆ స్టేట్మెంటును వాపసు తీసుకుంటే ఉరి శిక్ష విధించమని, యావజ్జీవ శిక్షగా మారుస్తామని న్యాయమూర్తులు చెప్పినప్పటికీ వినలేదు.
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్దపడ్డాడు భగత్‌సింగ్ వలె.
నల్లా నరసింహులు ఉరిశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయంగా అనేక దేశాల నుండి నిరసనలు, టెలిగ్రాములు వచ్చాయి. తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
తర్వాత హైదరాబాద్ హైకోర్టు విచారణ సమయంలో తప్పించుకునే అవకాశం దొరికింది. పార్టీ అధిష్టానంతో సంప్రదించి హైకోర్టు నుండి తప్పించుకొని సంచలనం సృష్టించాడు.
కేంద్ర నాయకత్వాన్ని కలుసుకొని వారి ఆదేశానుసారం వజ్రమ్మతో సహా మళ్ళీ ఉద్యమంలో పాల్గొన్నాడు మహబూబ్ నగర్ జిల్లా అటవీ ప్రాంతంలో.
వజ్రమ్మ నల్లా నరసింహులు అర్ధాంగి. అర్ధాంగి అనే పదానికి అసలైన అర్థం ఆమె. పెళ్లయిన నాటినుండి భర్త ఆలోచన విధానములోనే తాను కూడా ఉద్యమంలో పని చేసింది. వజ్రమ్మ పేరుకు తగినట్లుగా వజ్రం లాంటిది. వజ్ర సంకల్పం కలిగినటువంటిది. నిండు గర్భిణిగా ఉన్న వజ్రమ్మను భీమదేవరపల్లి హాస్పిటల్లో చేర్చగా పండంటి బిడ్డను కన్నది. తమ జీవితానికి అరుణోదయ మని, తెలంగాణకు అరుణోదయం రావాలని ఆ పాపకు అరుణ అని పేరు పెట్టారు. హాస్పిటల్ చుట్టూ చాలా రోజులుగా నిఘా వేసి ఉన్న పోలీసులు వజ్రమ్మను అరెస్ట్ చేశారు. భర్త తప్పించుకోవడంలో ఆమె పాత్ర ఉన్నదని జైలుకు పంపించారు. నరసింహులు కు హైకోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరించింది. ఈ కాలమంతా నరసింహులు అజ్ఞాతంలోనే ఉన్నాడు.
1955 మార్చి 5న వడ్లకొండ లో నరసింహులు తో బాటు మరికొందరిని అరెస్టు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ కృషి వలన నాటి ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చబడినది. పుచ్చలపల్లి సుందరయ్య గారి అకుంఠిత కృషి పట్టుదల వలన రాష్ట్ర ప్రభుత్వము 1959 జనవరి 26 నాడు యావజ్జీవ కారాగార శిక్షను రద్దు పరిచి విడుదల చేశారు. తన పోరాట ప్రస్థానంలో ఎక్కడా రాజీ పడని ధీరోధాత్తుడు. భగత్ సింగ్ వలె పార్లమెంట్లో బాంబులు వేయకపోవచ్చును. కానీ ధైర్య సాహసాల్లో భగత్ సింగ్ తో పోల్చవచ్చు. ఇతను భూస్వాముల పై దాడి చేసినప్పుడు ధనాన్ని దోచుకోలేదు. స్త్రీలను అవమాన పరచలేదు. మహోన్నత వ్యక్తిత్వం గల ధీశాలి. పాతికేళ్లు కూడా నిండకుండానే ప్రముఖ ప్రజా నాయకుడిగా ఎదిగి ఉరిశిక్ష విధించబడిన నల్లా నరసింహులు పోరాట సమయంలోనూ, మిలటరికీ దొరికిన తర్వాతను అనేకమార్లు త్రుటిలో చావు నుండి తప్పించుకున్న మృత్యుంజయుడు. అతని ప్రజాభిమానమే అతన్ని కాపాడింది. ఇంతటి సాహసికుడు, యువ నాయకుడు, భారత కమ్యూనిస్టు చరిత్రలో మరొకరు లేరనుట అతిశయోక్తి కాదు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రగతి, భాష, యాస పరిరక్షణ కొరకు ప్రజలను చైతన్యం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించిన ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రజా శ్రేయస్సుకోసం ప్రాణాలు సైతం లెక్క చేయక పోరాడిన యోధులు దొడ్డి కొమరయ్య, బందగి, నల్ల నరసింహులు, చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ ల విగ్రహాలను ట్యాంక్‌బండ్ పై ప్రతిష్టించి గౌరవించుకోవాలి. జనగామ జిల్లాకు నల్లా నరసింహులు పేరుని, ఆదిలాబాద్ జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని కోరుకుంటున్న సమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి.
రాపోలు జగన్
-9494997608