– ఎంపీ పదవితో ప్రజలసొమ్ము దోచుకోవడంతప్ప, రాజమహేంద్రవరం పార్లమెంట్ కి భరత్ చేసింది సున్నా.
• భరత్ రామ్ దృష్టంతా సాటి ఎంపీ రఘురామరాజుపై ఫిర్యాదులు చేయడంపైనే ఉంటుంది.
• పబ్లిసిటీ స్టంట్ కోసమే భరత్ రామ్ ప్రజల్లోకి వస్తాడు. ఆవభూముల్లో అక్రమార్జనపై మాట్లాడే ధైర్యం భరత్ రామ్ కి ఉందా?
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్
జగన్ రెడ్డి మెప్పుకోసమో, తాడేపల్లి పెద్దలకరుణ కోసమో పిల్లమనస్తత్వంతో రాజమహేం ద్రవరం ఎంపీ భరత్ రామ్ చంద్రబాబు, టీడీపీనేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ హితవు పలికారు.
మంగళవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు… ఆ వివరాలు ఆయన మాటల్లోనే …“కోతికి కొబ్బరిచిప్పలా భరత్ రామ్ కి ఎంపీ పదవి దొరికింది. దాన్ని అడ్డుపెట్టుకొని సంపద పోగేసుకోవడమే గానీ, ప్రజాసమస్యలు, అభివృద్ధిపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు. ఆవభూముల్లో జరిగిన అక్రమార్జన గురించి భరత్ బయటకు చెప్పగలడా? ఆవభూముల్లో దోచుకున్నదెంత..తనపార్టీవారితో ఆయనకు రావాల్సిన వాటాలు తేలాయా? ఆ భూముల్లో ఇళ్లనిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తున్నారో ఎంపీ చెప్పాలి. భరత్ రామ్ ఎంపీగా రాజమహేంద్రవరానికి ఏంచేశాడో చెప్పగలడా? పబ్లిసిటీ స్టంట్ కోసమే భరత్ రామ్ ప్రజల్లోకి వస్తాడు.
తనపార్టీ ఎంపీ అయిన రఘురామరాజుపై ఫిర్యాదులు చేయడంలో చూపుతున్నశ్రద్ధలో సగమైనా భరత్ రామ్ తనపార్లమెంట్ సమస్యలపై చూపితే బాగుండేది. ఉభయగోదావరి జిల్లాలకు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ మూడున్నరేళ్లలో ఏంచేశారో భరత్ చెప్పగలడా? కొవ్వూరు నియోజకవర్గంలో జరిగే ఇసుకదోపిడీపై భరత్ ఎందుకు మాట్లాడడు? అమరావతి రైతులకు నిరసనగా నల్లబెలూన్లు ఎగరేస్తే గొప్పనాయకులు కారని వైసీపీ ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలి. మాట్లాడితే హైదరాబాద్ గురించి మాట్లాడే వైసీపీనేతలంతా ఆ నగరం ఒక్కరోజులోనే అభివృద్ధి చెందలేదని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు.
అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం వృద్ధిలోకి వస్తుందన్న విషయం వైసీపీవారికి తప్ప, ప్రజలందరికీ తెలుసు. ఆదానీకి పోర్టులు కట్టబెట్టడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందా? భరత్ రామ్ ఏమీతెలియని పసికూన..ఏదో గాలిలో గెలిచి, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది చంద్రబాబని తెలుగువారికి బాగాతెలుసు.
చంద్రబాబుపై, టీడీపీనేతలపై అవాకులు, చవాకులు పేలితే భరత్ పై వ్యక్తిగత విమర్శలు చేయడానికి వెనుకాడం. భరత్ రామ్ పైగోపాలపురం, కొవ్వూరుతోపాటు తన పార్లమెంట్ పరిధిలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇవేవీ తెలుసుకోకుండా తాడేపల్లి పెద్దల మెప్పుకోసం పెద్దపెద్ద మాటలు మాట్లాడినంత మాత్రాన భరత్ పెద్దవాడు కాలేడు. ముందు వైసీపీఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అభివృద్ధి వికేంద్రీకరణకు, పరిపాలనా వికేంద్రీకరణకు తేడా తెలుసుకుంటే మంచిది.”