బాలిక.. ఇప్పుడు ఏలిక..!

Spread the love

తను ఉందని తెలిస్తే గర్భవిచ్చిత్తి..
అమ్మ గర్భాలయంలో
నవమాసాలు
తాను అవమానాలు మోయడమే గాక
తనకు చోటిచ్చి..
చాటిచ్చి..
తన ఉనికిని
చాటించే అమ్మకు కూడా
ఈసడింపుల
ఇక్కట్లు తెచ్చే ఆడపిల్ల..

ఉసురు పోసుకున్న ఉత్తరక్షణం మొదలు
ఊపిరి ఆగేదాకా ఉసూరుమనే దశ నుంచి
చాలా దూరం వచ్చేసింది ఆడకూతురు..

తనిప్పుడు
చేదుమాత్ర కాదు
విజయయాత్ర!

ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఇంటికి పండగ..
పుత్రోత్సాహాన్ని మించి
పుత్రికోత్సాహం..

తన చదువు బరువు కాదు
ఇంటి పరువు..
తన గెలుపు
సమాజానికే మలుపు..!

గిరిని విడిచి బరిలో..
యుద్ధమైనా సిద్ధమే..
గనిలో..వనిలో కార్ఖానాలో..
గుడిలో బడిలో..
బస్సులో..విమానంలో..
తానే సారథి..
ఇంట వారధి..
జీవితమనే కురుక్షేత్రంలో
గెలుపోటముల
నిగ్గుతేల్చే
మహారధి..
నీ ఇంట ఎప్పటికీ
తరిగిపోని నిధి..!

సురేష్ కుమార్ e
9948546286

Leave a Reply