– తెలంగాణాలో కలిపేయాలనడంలో సజ్జల ఉద్దేశం ఏమిటి?
– టి ఆర్ ఎస్ కు ప్రయోజనం కల్గించేలా తెలంగాణా సెంటిమెంట్ రెచ్చగొట్టాలన్న కుత్సితం
-తెలంగాణలో కలపమనడానికి ఆంధ్ర రాష్ట్రం మీ అబ్బ సొత్తనుకొంటున్నారా ?
– సజ్జల మాటలు కుట్ర పూరితం
– టీడీపీ పొలిటట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
రాష్ట్ర విభజనకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ఆ వివాదాన్ని మళ్ళీ లేవనెత్తవద్దని సుప్రీం కోర్టులో ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ వెంటనే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంధ్రను తెలంగాణాలో కలిపేస్తే తమకు అభ్యంతరం లేదని ప్రకటన చేశాడు. ఏమిటీ రెండు నాలుకల వైఖరి?
రాష్ట్ర విభజనకు జగన్ మద్దతు అవసరం ఇప్పుడేమీ లేదు. దాన్ని ప్రత్యేకంగా సుప్రీం కోర్టులో చెప్పవలసిన అవసరం లేదు. విభజన ముగిసిపోయిన అధ్యాయం.
ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణాలో కలిపేయాలనడంలో సజ్జల ఉద్దేశం ఏమిటి? ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక, అప్పులు కూడా దొరకని దివాళా స్థితిలో, తెలంగాణాలో కలిపేయమని వేడుకుంటున్నాడా? లేక ఆంధ్ర రాష్ట్రాన్ని దోపిడీతో ఊడ్చి పారేశాము, ఇక తినడానికి ఇక్కడేమీ మిగిలి లేదని తెలంగాణపై పడాలనుకుటున్నాడా?
నిలువెల్లా విషం నిండిన వారి నోట విషపూరిత పలుకులే వెలువడుతాయి. సజ్జల మాటలు కుట్ర పూరితంగా కన్పిస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో టి ఆర్ ఎస్ కు ప్రయోజనం కల్గించేలా తెలంగాణా సెంటిమెంట్ రెచ్చగొట్టాలన్న కుత్సితం ఆయన మాటలలో ధ్వనిస్తున్నది. అందుకోసం ఆంధ్రులకు ద్రోహం చేయడానికి కూడా వెనుకాడడం లేదు.
25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు జగన్. ఇప్పుడు 30 మంది ఎంపీలున్నారు. కానీ తానే కేంద్రం ముందు మెడ వంచుతున్నాడు తప్ప కేంద్రాన్ని కనీసం ఒక మాట కూడా అడగలేక పోతున్నాడు. విభజన చట్టం ప్రకారం మనకు రావలసిన లక్ష కోట్ల రూపాయల సొమ్ము ఇమ్మని కేసిఆర్ ను అడిగే ధైర్యం లేదు.
చట్టంలో ఏ ఒక్క అంశాన్ని పట్టించుకోకున్నా ప్రధాని మోడీ ముందు నోరు తెరిచేందుకు భయం. తన స్వార్థం కోసం, తన కేసుల కోసం, తన దోపిడీ కోసం, తన దుర్మార్గాల కోసం, తన దౌర్జన్యాలా కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రుల జీవితాలను బలిపెడుతున్న వైకాపా ప్రభుత్వం, ఇప్పుడు అసలు మాకు రాష్ట్రమే వద్దు, తెలంగాణాలో కలిపేయాండి మహా ప్రభో.. అని వేడుకుంటోంది. తెలంగాణలో కలపమనడానికి ఆంధ్ర రాష్ట్రం మీ అబ్బ సొత్తనుకొంటున్నారా ? రాష్ట్రాన్ని పాలించడం చేత కాకుంటే, గద్దె దిగి పారిపోండి. అంతే తప్ప విశాఖ కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టినంత సులభంగా రాష్ట్రం మొత్తాన్ని పరాధీనం చేయాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు.