-కంచికచర్ల కోటేశు ఘటన ప్రపంచానికి తెలియజేసిన వేముల జార్జి మాష్టర్ , తంగిరాల షడ్రక్ లు
– వీరి పోరాటంతోనే కంచికచర్ల కోటేశు ఘటన వెలుగులోకి వచ్చింది . నేటికీ 55 ఏళ్ళు
కంచికచెర్ల కోటేశు కధ విన్నారా…!
ఒక దిష్ఠిబొమ్మ :- దాని కాళ్ళు చేతులు ఒక గుంజకు కట్టివేయబడి ఉన్నాయి. దిష్ఠిబొమ్మ మీద కిరసనాయలు పోసారు. ఈ దిష్ఠిబొమ్మ సరదాగా ఉంది అక్కడ చెందిన వారికి. సరదాపడుతున్న వారిని చూసి మంరింత సంబరపడ్డారు ఆ దిష్ఠిబొమ్మను ఊరకనే కాల్చాలనుకున్న నలుగురు మనుషులు. అగ్గిపెట్టెలోంచి ఒక పుల్లను తీసి వెలిగించి దిష్ఠిబొమ్మ మీదకు విసిరారు. ఆ దిష్ఠిబొమ్మ దడుసుకుంది కాని ఆ అగ్గిపుల్ల ఆరిపోయింది.
రెండవ అగ్గిపుల్ల గీసి ఆ దిష్ఠిబొమ్మ మీద విసిరారు. అదీ ఆరిపోయింది. అలా గీయగా గీయగా 48 అగ్గిపుల్లలు ఆరిపోయాయి. ప్రతి అగ్గిపుల్లకు దిష్ఠిబొమ్మ గజగజలాడింది. నవనాడులు కృంగిపోయాయి. నరకమంటే ఇలానే ఉంటుందని ఊహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతికున్న జీవచ్చవమే అయ్యింది. ఏడ్చింది, మొత్తుకుంది, రోదించింది. అది అరణ్యరోదనే అయ్యింది. ఆ దిష్ఠిబొమ్మ దీనంగా బ్రతిమలాడుతోంది. తనేపాపం చేయలేదని, తనకు ప్రాణబిక్ష పెట్టమని, కనికరం లేని ఆ నలుగురు మనుషులు కిలకిల నవ్వారు. వికట్టహాసం చేశారు. అగ్గిపెట్టెలో ఉన్న చివరి పుల్ల 49 వ అగ్గిపుల్లను అతి జాగ్రత్తగా వెలిగించి ఆ దిష్ఠిబొమ్మపై వేశారు. ఆ దిష్ఠిబొమ్మపై మంటలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దిష్ఠిబొమ్మకు ఆవేశం వచ్చింది. అది కంచికచెర్ల కోటేశు అయ్యింది. కట్లు తెంపుకుంది.
ఒక మనిషి బ్రతికుండగానే దిష్ఠిబొమ్మగా గుంజకుకట్టి కిరసనాయిలు పోసి నిప్పంటించిన క్రూరులు సైతం బెదిరిపోయారు. కోటేశూ ప్రాణరక్షణ కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. కోటేశును చూడగానే బయటకు గెంటివేయించాడు డాక్టర్. చేసేది లేక పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు. ఒంటి మీద బట్టలు లేవు. ఒళ్ళంత నెత్తుటి మాంసపు ముద్దలా ఉంది. చూడటానికి, చెప్పడానికి భయం కొల్పేదిలా ఉంది.
ఎప్పుడు, ఎక్కడ జరిగింది :- ఈ వాస్తవ గాధ కృష్ణా జిల్లా కంచికచెర్లలో జరిగింది. 1968 ఫిబ్రవరి 22 న పట్టపగలు మిట్టమధ్యాహ్నం ఒక పొగాగు బేరన్ వద్ద జరిగింది. ఇంత దారుణంగా ఒక మనిషిని సజీవదహనం చేయడం ఏంటీ అనే ప్రశ్న మనందరకు వస్తుంది. దానికి రెండు రకాల కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. అగ్రకులానికి చెందిన ఒక ఇంట్లో ఇత్తడీ చెంబు తీసుకుని హోటల్ కు వెళ్ళి యజమాని వద్ద తాకట్టుపెట్టి భోజనం తిన్నాడనేది ప్రధాన ఆరోపణ.
ఆ ఆరోపణలో అంత బలమున్నట్టు కనిపించదు. చెంబు కోసం మనిషిని సజీవదహణం చేయాల్సిన అవసరం ఏముంది. మరో కారణం ఏమైనా ఉందా ? ఉంటే అదేమిటి ? మనం తేలికగానే ఊహించుకోవచ్చు. కోటేశు గాడు మాదిగోడు. మాదిగోడు పోయి అగ్రకులానికి చెందినవారి కోడలితో మాట్లాడితే లోకం ఏమంటుంది ! కోడై కూస్తుంది. ఆ కోడి కూసిన తెల్లారే ఈ ఘాతుకం జరిగింది.
ఎవరు చేశారు :- ఇంకెవరు చేస్తారు అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు.
పోలీసులు ఏం చేశారు :- కంచికచెర్ల కోటేశూ చెప్పిన విషయాన్ని పిర్యాదుగా నమోదు చేసుకున్నారు. అప్పుడు డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపాడు. ముద్దాయిలను నలుగురిని అరెస్ట్ చేశారు. జి.అప్పారావు సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారప్పుడు.
కోటేశు బతికాడ :- లేదు 96 గంటల పాటు మృత్యువుతో పోరాడి పోరాడి చివరకు ఓడిపోయాడు. 1969 ఫిబ్రవరి 26 న మరణించాడు.
కోటేశుది కంచికచెర్ల కాదా :- అవును కోటేశుది కంచికచెర్ల కాదు. కంచికచెర్ల పక్కన ఉన్న పరిటాల గ్రామం. అతని ఇంటిపేరు ఆరుకట్ల. ఆరుకట్ల పున్నయ్య, శేషమ్మల పెద్ద కుమారుడే కంచికచెర్ల కోటేశు. ఆరుకట్ల నరసింహుడు కోటేశు తమ్ముడు. కోటేశు చెల్లిలి పేరు రోజా రాణి. పరిటాలలోనే ప్రస్తుతం నరసింహుడు, రోజా రాణి ఉన్నారు.
ఉద్యమానికి పునాది :- ఎంత దారుణం జరిగిందని ప్రశ్నించింది వేముల జార్జ్ మాస్టారు. ఆయనకు తంగిరాల షడ్రక్, కనకాల వెంకటరత్నం తోడుగా నిలిచారు. అందరూ కలిసి పరిటాల చుట్టుపక్కల గ్రామాలైన కొత్తపేట, గొట్టిముక్కల, కంచికచెర్ల, పాన్నవరం తదితర గ్రామాల దళితుల్ని సహకరించారు. ఈ దారుణానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు.
ఆ రోజుల్లోనే న్యూయార్క్ టైమ్స్ :- వేముల జార్జ్ మాస్టారు ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ కు పంపిన టెలిగ్రాం ను అమెరికాలో అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ వార్తగా ప్రచురించింది. ఆ సమయంలోనే స్విట్జర్లాండ్ లో టీ స్పూన్ దొంగిలించాడనే నెపంతో ఒక వ్యక్తి సజీవదహనానికి గురయ్యాడు. ఆ సంఘటనను కంచికచెర్ల సంఘటనను పోలుస్తూ అంతర్జాతీయ దినపత్రికల్లో పేర్కొనడంతో భారతదేశం మేల్కొనింది.
బాబు జగ్జీవన్ రామ్ రాక :- కంచికచెర్ల కోటేశు సమస్య అంతర్జాతీయ సమస్యగా పేర్కొనబడటంతో కేంద్ర ప్రభుత్వం అప్పుడు కేబినెట్ మంత్రిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ ను పరిటాల పంపింది. కోటేశు కుటుంబ సభ్యులను బాబు జగ్జీవన్ రామ్ స్వయంగా ఓదార్చారు. బీహార్ దళితుల నుండీ సేకరించిన 15,000 రూపాలతో కోటేశు కుటుంబానికి పక్కా ఇళ్ళు నిర్మించి, కోటేశు ప్రాంగణం అని పేరుపెట్టారు. నాలుగు ఎకరాల సాగుభూమిని కూడ ప్రభుత్వం ఇచ్చింది.
కోటేశు హంతకులకు యావజ్జీవం :- బాబు జగ్జీవన్ రాకతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎంతో పగడ్బందీగా కేసును తయారు చేశారు. బందరు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ముద్దాయిలకు యావజ్జీవ శిక్ష విధించారు. శిక్ష అనుభవించి బయటకు వచ్చినవారిలో ఒకరు మరణించారు. మిగిలిన ముగ్గురు బ్రతికే ఉన్నారు.
వేముల జార్జ్ గారికి కోటి దండాలు :- భారతదేశంలో దళితుల సమస్యను అంతర్జాతీయ వేదికకు ఎక్కించిన వేముల జార్జ్ మాస్టారుకి జాతి ఎంతో బుణపడి ఉంది. జార్జ్ గారు మన మధ్య లేకపోయిన ఆయన మేలును దళితజాతి మరచిపోదు.
– కలేకూరి ప్రసాద్ (యువక)
( సేకరణ : తంగిరాల. సోని )