-బీజేపీ-వైసీపీ సంబంధాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బతీశాయి
-బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ఉంటేనే మంచిది
-ఫలితాలపై రాష్ట్ర నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి
-బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్య
ముక్కుసూటిగా మాట్లాడే నైజం ఉన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ-బీజేపీ కలసి పనిచేస్తున్నాయన్న భావన జనంలో తొలగించకపోతే, భవిష్యత్తులో వచ్చే ఫలితాలన్నీ ఇలాగే ఉంటాయని దాదాపు హెచ్చరించినంతపనిచేశారు. తాజా ఓటమికి అదే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ఉంటేనే మంచిదని కుండబద్దలు కొట్టారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితాలపై విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సోషల్‌మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళిపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోవడంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, అందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనం అని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. వైసీపీతో ఉన్నామన్న ముద్ర తొలగించుకోకపోతే బీజేపీకి మున్ముందు ఫలితాలు ఇంతకంటే తీవ్రంగా ఉంటాయని తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆదరించకపోవడాన్ని గమనించాలని, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఏవీ పనిచేయకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతాలుగా భావించాలని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తేనే మేలు జరుగుతుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ఈ కలయిక తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.