Suryaa.co.in

Political News

అంతా భ్రాంతియేనా? అంతా మాయేనా?

(ఎన్వీ సుమన్‌, న్యాయవాది-వైజాగ్‌)

“దొంగ వోట్ల, దొంగ నోట్ల రాజ్యమొక రాజ్యమా” అని శ్రీశ్రీ 1975లో రాజ్యాన్ని ఈసడించాడు. అక్కడి నుంచి అర్ధశతాబ్ది గడిచేసరికి మనం దొంగ సర్టిఫికెట్ల, బుకాయింపుల రాజ్యానికి చేరాం, ఆహా ఎంత అభివృద్ధి! ఎంత ఘనత! నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తూ, నామినేషన్ పత్రాల్లో తాను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1978లో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి 1983లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానని రాశాడు. అది ఒక పబ్లిక్ డాక్యుమెంటు. దానిలో అబద్ధాలు చెప్పడానికి వీలు లేదు. ప్రమాణపూర్తిగా నిజాలే రాయాలి.

కనుక, ఈలోగా ప్రధానమంత్రి కూడ అయిపోయిన ఆ అభర్థి ప్రమాణపూర్తిగా చెప్పిన ఆ నిజానికి సంబంధించిన సమాచారం కావాలని ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడ అయిన అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయాన్ని, గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని అడిగాడు. వాళ్ల నుంచి సమాచారమూ సమాధానమూ రాకపోవడంతో ఆ కేసు కేంద్ర సమాచార కమిషనర్ దగ్గరికి చేరింది. అప్పటి కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు (మాడభూషి శ్రీధర్) 2016 లో నరేంద్ర మోదీ విద్యార్హత ధృవపత్రాలను బైటపెట్టవలసిందే అని తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును పాటిస్తూ గుజరాత్ విశ్వవిద్యాలయం తాను నరేంద్ర మోదీ సర్టిఫికెట్ ను అప్పటికే వెబ్ సైట్ మీద పెట్టానని పత్రికా సమావేశంలో వెల్లడించింది. కాని, మరొక పక్క అలా ఒక వ్యక్తి సర్టిఫికెట్ అడగడం వారి వ్యక్తిగత గోప్యతకు భంగకరమని, కనుక సమాచార కమిషనర్ ఆదేశాలను కొట్టివేయాలని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఏడు సంవత్సరాల విచారణ తర్వాత ఇవాళ మహా ఘనత వహించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీరేన్ వైష్ణవ్ కేంద్ర సమాచార కమిషనర్ ఇచ్చిన 2016 ఉత్తర్వులను కొట్టివేశారు. అంతమాత్రమే కాదు, ప్రధాని చెప్పుకున్న విద్యార్హతలకు రుజువు ఉందా అని అడిగే నేరం చేసినందుకు గాను అరవింద్ కేజ్రీవాల్ కు రు. 25,000 జరిమానా విధించారు. ఇంతకూ ఆ రెండు సర్టిఫికెట్లూ దొంగ సర్టిఫికెట్లని ఇప్పటికే రుజువైపోయింది. ఢిల్లీ విశ్వవిద్యాలయ సర్టిఫికెట్ లో అప్పటికింకా కనిపెట్టని మైక్రోసాఫ్ట్ అక్షరాలు (ఫాంట్లు), గుజరాత్ విశ్వవిద్యాలయ సర్టిఫికెట్ లో ఎం ఎ “ఎంటైర్ పొలిటికల్ సైన్స్” అనే అర్థరహితమైన సబ్జెక్టులు కలిసి ఆ సర్టిఫికెట్ల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి.

ఇంతకూ ఫలానా వ్యక్తి చదువుకున్నాడా లేదా అనేది ప్రశ్న కాదు. చదువు వల్ల జ్ఞానమూ సామర్థ్యమూ వివేకమూ వస్తాయనే నమ్మకమేమీ లేదు. ఆ వ్యక్తి చదువుకోకపోయినా జ్ఞానమూ సామర్థ్యమూ వివేకమూ ఉండవచ్చు. ఇక్కడ ప్రశ్న ఒక ప్రమాణ పత్రంలో నిజాలు రాశారా రాయలేదా అనేది… నిజాలే రాశారు అని.. ఒక సర్టిఫికెట్ బైటపెట్టిన యూనివర్సిటీయే, అది బైటపెట్టనక్కరలేదు అని వాదించింది. బైటపెట్టమని ఆదేశించడమే తప్పు అని ఇప్పుడు హైకోర్టు అంటున్నది. కలడు కలండనువాడు కలడో లేడో… అంతా భ్రాంతియేనా? అంతా మాయేనా? ఇంతకన్న దిగజారగలమా?

LEAVE A RESPONSE