నా చిరకాల మిత్రుడు, 1980 దశాబ్దంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్. ఉద్యమ నిర్మాణంలో సహచరుడు వి.కె.రంగారెడ్డిగారు ఒక దళిత యువరైతు ఆత్మహత్య ఉదంతాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగల్ల గ్రామంలో మీనుగ సంజీవ అనే యువరైతు ఆత్మహత్య చేసుకొన్నాడు. వరుసగా వేరుశనగ, టమోటా, మిర్చి పంటలు పండించాడు. పంటలు బాగానే పండినప్పటికీ గిట్టుబాటు ధర రాక వరుస నష్టాలతో వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక చిన్న వయసులోనే మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
వ్యవసాయంలో వచ్చిన నష్టం పర్యవసానంగానే అప్పుల ఉబిలో కూరుకుపోయి, తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. గుర్తిస్తే ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది. అందుకే, అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ తరహా రైతు ఆత్మహత్యలు జిల్లాలో మరికొన్ని ఇటీవల కాలంలో జరిగినట్లు వార్తలొచ్చాయి.
అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం, గౌరవాధ్యక్షులు వి.కె. రంగారెడ్డిగారి నాయకత్వంలో కలగల్ల గ్రామానికి వెళ్లి ఆ పేద కుటుంబాన్ని పరామర్శించారు. పూర్వాపరాలు తెలుసుకొన్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి చిన్న వయస్సులో ఉన్న ఇద్దరు ఆడపిల్లలున్నారు. భార్య గర్భవతి. హృదయ విదారకమైన స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒకవైపున ప్రభుత్వానికి విన్నవిస్తూనే, పిల్లల విద్యకు సంబంధించి తమ వంతు తోడ్పాటును ప్రకటించారు. “జై జవాన్ – జై కిసాన్” నినాదం స్ఫూర్తితో స్పందించి, తోడ్పాటును అందించిన మాజీ సైనికుల సంఘానికి అభినందనలు.
కానీ, ప్రభుత్వం స్పందించక పోవడం అత్యంత గర్హనీయం. రైతుల ఆత్మహత్యల నివారణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో డా.జయతి ఘోష్ కమిటీ చేసిన సిఫార్సులను మరియు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో రైతు సంఘాలు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను, డా.యం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి ఉంటే, రైతు సంఘాలు చేస్తున్న డిమాండును అంగీకరించి వ్యవసాయ ఉత్ఫత్తులకు కనీస మద్దతు ధరలను చట్టబద్ధం చేసి ఉంటే రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్టపడేది.
ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ పాలకులు చేసే వాగాడంబర ఉపన్యాసాలకు తక్షణం స్వస్తి చెప్పి, నిజాయితీతో రైతు ఆత్మహత్యల నివారణకు, వ్యవసాయాన్ని సంక్షోభం నుండి రక్షించడానికి యుద్ధప్రాతిపదికన కార్యాచరణ అమలు చేయాలి. పరిమితమైన ప్రయోజనం వనగూడ్చే “రైతు భరోసా పథకం”తో మాత్రమే వ్యవసాయ రంగాన్ని పరిరక్షించలేరన్న వాస్తవాన్ని గుర్తించాలి.