Suryaa.co.in

Andhra Pradesh

మహిళా సంక్షేమంపై మంత్రి రోజా బహిరంగ చర్చకు సిద్దమా ?

-కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న చందంగా ఎప్పుడో ఒకసారి సీఎం బయటకొచ్చి అంకెల గారడీతో ప్రల్ని మోసం చేస్తున్నారు
-4 ఏళ్లలో అగ్రవర్ణ కార్పోరేషన్లకు రూ. 1 ఖర్చు చేశారా, ఒక్కరికైనా రుణం ఇచ్చారా?
-మహిళా సంక్షేమమంటే డ్వాక్రా సభ్యుల నిధులు దారి మళ్లించటమా జగన్ రెడ్డి?
-టీడీపీ పాలనతోనే మహిళా సంక్షేమం సాధ్యం
-టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న చందంగా ఎప్పుడో ఒకసారి సీఎం జగన్ రెడ్డి బయటకొచ్చి అంకెల గారడీతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. బుధవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…….. గత నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ప్రజలకు కనపడటం మనం చూస్తూనే ఉన్నాం. మోసకారి పథకాలతో అంకెల గారడీ చేస్తూ నేను మీ బిడ్డను, మీ తండ్రిని అంటూ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

ఈబీసీ నేస్తం పేరుతో పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలతో మరోసారి మహిళలను మోసం చేస్తున్నాడు. గత నాలుగేళ్లుగా బడ్జెట్ లో ఒక్క రూపాయి అయినా ఈబీసీలకు కేటాయించారా? చంద్రబాబు గారి హయాంలో ఈబీసీ మహిళలకు ఎంతో సంక్షేమం అందించారు. బ్రాహ్మణులకు రూ. 285 కోట్లు, క్షత్రియులకు రూ. 50 కోట్లు, ఆర్యవైశ్యులకు రూ. 50 కోట్లు సంక్షేమం కింద ఖర్చు చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య , ఎన్టీఆర్ ఉన్నత విద్య కింద రూ. 28 కోట్లు వ్యయం చేయగా 1400మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందారు. ప్రతి జిల్లాలో రూ. 5 కోట్ల తో కాపు భవనాలు నిర్మించాం.

నాలుగేళ్లుగా కార్పొరేషన్ల పేరుతో హడావుడి చేయడం తప్పించి అగ్రవర్ణాలకు జగన్ ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? ఒక్కరికైనా రుణం ఇచ్చారా? కాపులకు చంద్రబాబు నాయుడు రూ. 2 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించినట్టే తానూ కేటాయిస్తానని చెప్పి ఆ హామీకి తిలోదకాలు ఇచ్చిన హీన చరిత్ర జగన్ రెడ్డిది. రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, రెడ్ల కులాల వారు 75 లక్షలమందికి పైగా ఉండగా జగన్ రూపాయి కూడా కేటయించకపోగా అంకెల గారడీ చేస్తున్నాడు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరీకి అమ్మఒడి అని జగన్ రెడ్డి భార్య భారతీరెడ్డి ప్రచారం చేశారు. చివరకు ఏమైంది.

రూ. 13 వేలు ఇచ్చి చేతులు దులుపున్నారు. అమ్మఒడి పేరుతో మహిళలను మోసం చేశారు. చంద్రబాబు గారి హయాంలో ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు కింద 82 లక్షలమందికి రూ. 13 వేల చొప్పున ఇచ్చాం. మీ పాలనలో ఎందరు లబ్ధి పొందారు? జగన్ రెడ్డి ప్రవేశపెట్టిన మరో మోసపూరిత పథకం ఆసరా. అరకొర సాయం చేసి డ్వాక్రా గ్రూపుల మధ్య గొడవలు పెట్టిన హీన చరిత్ర జగన్ రెడ్డిది. ఆనాడు రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా డ్వాక్రా రుణమాఫీ కింద రూ. 8500 కోట్లు, పసుపుకుంకుమ కింద రూ 10,000 కోట్లు, వడ్డీ రాయితీ కింద రూ. 2500 కోట్లు వెచ్చించాం. టీడీపీ హయాంలో సున్నా వడ్డీ రాయితీ రూ. 5 లక్షల వరకూ వర్తింపజేస్తే జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో రూ. 10 లక్షలకు పెంచుతానని తీరా అధికారంలోకి వచ్చాక రూ.3 లక్షలకు కుదించడం దుర్మార్గం కాదా?

సున్నా వడ్డీ కింద రూ. 4,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం రూ.1260 కోట్లతో చేతులు దులుపుకున్నారు. ఇదేనా మహిళలను ఉద్దరించడమంటే? సంక్షేమం అమలులో జగన్, చంద్రబాబుకు నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అభయహస్తం నిధులు రూ. 2118 కోట్లు దారి మళ్లించేశారు. ఆ డబ్బు ఏమైంది? డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న రూ. 10,000 కోట్లను దారి మళ్లించే యత్నం చేసింది నిజం కాదా? పెళ్లికానుక కింద చంద్రబాబు గారు రూ. బీసీలకు రూ.35 వేలు ఎస్సీ, ఎస్టీలకు రూ.55 వేలు , కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 75 వేలు ఇచ్చాం. పెళ్లి కానుక ఏమైంది?

స్త్రీ నిధి కింద రూ. 5,800 కోట్లు రుణాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిదే. నాలుగేళ్లుగా స్త్రీ నిధి అమలు అటకెక్కించారు. బాలింతలకు చంద్రబాబు గారు రూ. 5 వేలు ఆర్థిక సాయం చేయగా అదీ ఎగ్గొట్టేశారు. దీపం పథకం గ్యాస్ కలెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం కింద రూ. 800 ఇచ్చాం. అవన్నీ నాలుగేళ్లుగా అమల్లో లేవు. చంద్రబాబు గారు దిగ్విజయంగా అమలు చేసిన తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్లను నిలిపేశారు. బేబీ కిట్లకు చంద్రబాబు గారు రూ. 50 కోట్లు ఖర్చు చేస్తే మీరు చేసింది గుండుసున్నా.

దీపం పథకం, ఉన్నతి పథకం ఆపేశారు. గ్యాస్ ధరలు పెంచి మధ్య తరగతి ఇబ్బందులపాలు చేస్తున్నారు. డ్వాక్రా సభ్యులు మరణిస్తే చంద్రబాబు గారు ఇచ్చిన రూ. 30 వేలనూ కక్షపూరితంగా నిలిపేశారు. ఇదేనా మహిళలను ఉద్దరించడమంటే? ఈబీసీ పథకం మా మేనిఫెస్టోలో లేనప్పటికీ సాయం చేస్తున్నామని జగన్ చెబుతున్నారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఏమైంది జగన్ రెడ్డీ? నాలుగేళ్లుగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. లేని దిశా పేరుతో మహిళలన మోసం చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు, సెంటు పట్టాల భూములపై గొప్పలు చెబుతున్నారు. గృహ నిర్మాణానికి మీరు చేసిన సాయం గుండు సున్నా. సెంటు పట్టా పేరుతో 7500 కోట్లు కొట్టేశారు. ఓటీఎస్ కింద 10 నుంచి 30 వేల వరకూ బలవంతపు వసూళ్లు చేసింది వాస్తవం కాదా? చంద్రబాబు గారి పాలనలో 12 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించాం. ఒకటి నుంచి రెండు సెంట్ల వరకూ భూములకు పట్టాలిచ్చాం.

చంద్రన్న హయాంలో ప్రతి ఒక్కరికీ లక్షన్నర సాయం చేశాం. భూమి కొనుగోలు పథకం కింద 6 వేల ఎకరాల పట్టా భూములు పంపిణీ చేశాం. ఎక్కడా అవినీతికి తావులేదు. లోటు బడ్జెట్ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది చంద్రబాబు గారే. జగన్ పథకాల మాటున అరకొర సాయం చేసి గొప్పలు చెబుతున్నారు. తండ్రిగా, అన్నగా సాయం చేశానని మాయమాటలు చెబుతున్నాడు. ఏంటి నువ్వు చేసింది నీ మొహం. న్యాయం కోసం ఓ చెల్లి హైదరాబాద్, ఓ చెల్లి ఢిల్లీ వీధుల్లో తిరుగుతోంది జగన్ కు కనిపించలేదా?

అమరావతిని గ్రాఫిక్స్ అని ఎగతాళి చేసిన రోజా ఏపీఐఐసీ బిల్డింగ్ నుంచి కిందకు దూకాలని మేము చాలెంజ్ విసిరాం. ఆ చాలెంజ్ కు భయపడి రోజా పారిపోయింది. బడ్జెట్ లో ఎవరి కేటాయింపులు ఏంటో బహిరంగ చర్చకు రోజా సిద్ధమా అని మరోసారి చాలెంజ్ విసురుతున్నాం.చాలెంజ్ లకు పారిపోయే పార్టీ వైసీపీ. దమ్ముంటే శాండ్ , ల్యాండ్ మాఫియాపై చర్చకు జగన్ రెడ్డి సిద్ధమా. డ్వాక్రా మహిళలను సీఎం సభలకు బలవంతంగా తరలిస్తున్నారు. సభలకు రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించడం దుర్మార్గం కాదా? నాశిరకం మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచుతున్నారు. మహిళా సంక్షేమం టీడీపీతోనే సాధ్యం. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని పంచుమర్తి అనురాధ ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE