Suryaa.co.in

Andhra Pradesh Telangana

మీ దగ్గర ఏమున్నాయి?

-ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు…మెడలు వంచాలి అంటిరి.. ఇప్పుడేమో అడగరు
-ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టిన ఏం అడగరు
-విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు
-అధికారంలో ఉన్న వాళ్ళు అడగరు…ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు
-ప్రజలను గాలికి వదిలేశారు
-మా దగ్గర ఉన్నాయి.. చెప్పమంటే దునియా చెబుతాం
-మరోసారి ఏపీ‌పై మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

విశాఖ స్టీల్‌ కేంద్రంగా ఆంధ్రా-తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం పదునెక్కుతోంది. తెలంగాణలో ఏం ఉందన్న ఆంధ్రా మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ సీనియర్‌ మంత్రి హరీష్‌రావు విరుచుకుపడ్డారు. మా దగ్గరేముందో చెప్పాలంటే దునియా ఉంది. మరి చెప్పుకోవడపానికి మీదగ్గరేం ఉంది? అధికార-ప్రతిపక్ష పార్టీలు కలసి మోదీని మోసి, ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇంకోసారి తమ గురించి మాట్లాడితే మంచిగుండదని హెచ్చరించారు.

మరోసారి ఏపీ‌పై మంత్రి హరిశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ‘‘మీ దగ్గర ఏమున్నది అని అంటున్నారు. మా దగ్గర ఉన్నాయి చెప్పమంటే దునియా చెబుతాం.మా దగ్గర 56 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది, రైతు బీమా, రైతు బంధు ఉంది.ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం‌ను నిర్మించాం. మీ దగ్గర ఏమున్నాయి? ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు…మెడలు వంచాలి అంటిరి.. ఇప్పుడేమో అడగరు. ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టిన ఏం అడగరు.విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలో ఉన్న వాళ్ళు అడగరు…ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మిన ఎవ్వరు అడగరు. ప్రజలను గాలికి వదిలేశారు.. మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. YSRCP, ప్రతి పక్ష TDP రెండు పార్టీలు కలిసి ఏపీని ఆగం చేశాయి. ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి…మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచింది. ఢిల్లీలో ఉన్నోళ్లు మనల్ని నూకలు బుక్కమని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రజలంతా కలిసి ఢిల్లీల ఉన్నోడికి మనం నూకలు బుక్కీయ్యాలి.’’ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

త్యాగాల పునాదులు పార్టీ BRS అని పేర్కొన్నారు. తెలంగాణను తాకట్టు పెట్టె పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని తొమ్మిదవ వార్డులో రూ.20 లక్షలతో చేపట్టనున్న కార్మికుల భవన నిర్మాణ పనులకు మంగళవారం రాత్రి ఆయన భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేడే రోజున సీఎం కేసీఆర్‌ నోట కార్మికులు శుభవార్త వింటారని పేర్కొన్నారు. జిల్లాలో రూ.2 కోట్లతో రెండు ఎకరాల్లో కార్మికుల భవన నిర్మాణం చేపటబోతున్నామని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. ఆంధ్ర, తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా.. ఏది బాగుందో కార్మికులు చెప్పాలని కోరారు.

రాష్ట్ర అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఆ మేరకే తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులతో పాటు అన్ని రంగాల ప్రజల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

LEAVE A RESPONSE