– ముప్పవరపు వెంకయ్యనాయుడు
మా వియ్యంకుడు శ్రీ ఇమ్మణ్ని విష్ణురావు గారు సామాన్యూడిగా కనిపించే అసామాన్యులు. క్రమశిక్షణ, నిబద్ధత, అంకిత భావాల త్రివేణి సంగమంగా జీవితాన్ని ముందుకు సాగించారు. పెద్దలు ఇచ్చిన సంపదతో పాటు, స్వయంకృషితో జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. తమతో పాటు సోదరులు, సోదరీమణుల బాధ్యతను తీసుకుని కుటుంబ సభ్యుల ఉన్నతికి శ్రమించారు. క్రమశిక్షణతో పిల్లలను పెంచి, ఉన్నతంగా తీర్చిదిద్ది మాకు సర్వలక్షణ సంపన్నుడైన అల్లుణ్ని ఇచ్చారు. వారు వ్యక్తిగతంగా భోళా మనిషి. జనాలతో కలిసి తిరగటం, వారి అభివృద్ధికి పాటు పడటంలోనే ఆనందాన్ని పొందేవారు.
సినిమా నిర్మాణంలో, డిస్ట్రిబ్యూషన్ లో చురుగ్గా పాల్గొని ఆ రంగంలోని ప్రముఖులందరితో స్నేహ సంబంధాలు కొనసాగించారు . లైన్స్ క్లబ్ లాంటి వాటి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగానూ పని చేశారు. ముఖ్యమంత్రులతో, రాష్ట్ర స్థాయి పాత తరం కాంగ్రెస్ నాయకులతో సత్సంబంధాలు కలిగిన ఆయన, మా కుమార్తె వివాహం తర్వాత నన్ను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు స్వస్థి పలికి, రాజకీయాలకు అతీతంగా నిడదవోలు ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారు.
నిడదవోలులో రామకృష్ణ కోపరేటివ్ బ్యాంక్ స్థాపన ద్వారా ఆ ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి చేశారు. ప్రజల సంక్షేమంతో పాటు పట్టణాభివృద్ధి, సినిమా హాళ్ళ నిర్మాణం, లయన్స్ క్లబ్, స్థానిక కళాశాలలు, మందిరాలు వంటి వాటి నిర్మాణంలో విశేష కృషి చేశారు. విశాఖపట్నంలో కాకతీయ అసోసియేషన్ వారి కళ్యాణమండపం నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, చురుగ్గా పాల్గొన్నారు. తమ తండ్రి గారు 1960లో స్థాపించిన రామకృష్ణ ఇంజనీరింగ్ సంస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది, అనేక మందికి ఉపాధి కల్పించటంతో పాటు… వివిధ సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలబెట్టారు.
పరిపూర్ణ జీవితాన్ని గడిపి, కుటుంబ సభ్యుల ఉన్నతిని చూసి, అవసరమైన సమయాల్లో సహకారాన్ని అందించి, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నా ఉత్సాహాన్ని, సంతోషాన్ని వదలకుండా ఎంతో హుషారుగా మాట్లాడేవారు. కాన్సర్ బారిన పడి, ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలుసుకుని పలకరిద్దామని వస్తే, నమస్తే అని పలకరించి తనువు చాలించారు. చివరి క్షణం వరకూ ఉత్సాహంగా గడిపిన ఆత్మవిశ్వాసం వారి సొంతం.
ఆత్మీయతతో కూడిన వారి పలకరింపు, నా పట్ల వారి అభిమానం, మా పిల్లల పట్ల వారి వాత్సల్యం, అరమరికలు లేని వారి వ్యక్తిత్వం మరువలేనివి. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.