– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రంలో టెక్స్ టైల్స్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహమందిస్తోందన్నారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు మంత్రి సవితను శుక్రవారం అమెల్ సి ఆల్ట్ కన్సార్టియం ప్రతినిధులు కలిశారు. హిందూపురంలోని ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్స్ పార్క్ లో పెట్టుబడులకు ఆసక్తిచూపుతున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు డాక్టర్ చక్రవర్తి, సతీష్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను తక్షణమే అందజేస్తున్నామన్నారు.
ముఖ్యంగా నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకురావడంతో ఆ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున టెక్స్ టైల్స్ పార్క్ లో నిర్మాణం చేపట్టామన్నారు. అనంతరం అమెల్ సి ఆల్ట్ కన్సార్టియం ప్రతినిధులను మంత్రి సవిత ఘనంగా సత్కరించారు.