Suryaa.co.in

Telangana

అన్ని రంగాలకు విశ్వసనీయత కల్పించే బడ్జెట్

– భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్

లోక్‌సభలో ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ అభివృద్ధి చెందుతున్న భారత్ కు చిహ్నం. నేటి యువతరం ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీగా నిలుస్తుంది. పేదలు, యువత, అన్నదాత, మహిళల సంక్షేమానికి, వారి మేలు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.

అన్ని రంగాలకు విశ్వసనీయతను కల్పించేదిలా బడ్జెట్ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి, ప్రధాని నరేంద్ర మోదీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తూ, సమ్మిళిత అభివృద్ధి గ్రామస్థాయికి చేర్చేలా, క్రీడాకారులకు ఆత్మస్థైర్యం పెంచేలా, యువతకు పెద్దపీట వేసేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. సాంకేతికత రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేయడం గొప్ప పరివర్తనకు నిలువుటద్దం.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఆశాజనకమైన నిధులు కేటాయించి మరోసారి తెలంగాణ రాష్ట్రానికి చిత్తశుద్ధిని చాటడం హర్షణీయం. భారతీయ రైల్వేల మరింత అభివృద్ధి కోసం 2.4 లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్ లో రైల్వేకు సంబంధించి తెలంగాణకు రూ. 5071 కోట్లు కేటాయించడం గొప్ప విషయం.

దేశంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో అనేక చర్యలు తీసుకుంది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి బడ్జెట్‌లో రైల్వేశాఖకు అద్భుతమైన బహుమతి లభించింది. ప్రయాణికుల భద్రత, సౌలభ్యం మేరకు 40 వేల రైల్వే బోగీలను వందేభారత్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు దోహదం కానుంది.

కేంద్ర బడ్జెట్ లో మహిళా సాధికారతపై దృష్టి సారించేలా ప్రవేశపెట్టిన ‘లక్‌పతి దీదీ’ పథకంలో లబ్ధిదారుల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించడం అభినందనీయం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో గ్రామీణ పేదలకు మరో 2 కోట్ల ఇళ్ల నిర్మించేందుకు నిర్ణయించి మరోసారి నరేంద్ర మోదీ గారు పేదల దూతగా నిలిచారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు రూ.1.27 లక్షల కోట్లు కేటాయించి మరింత భరోసా కల్పించారు.

వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్‌, ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఎన్నికల సంవత్సరం సందర్భంగా గత ప్రభుత్వాలు ఊహలపల్లకీలో మోసే బడ్జెట్ గా కాకుండా.. భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం, వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ను రూపకల్పన చేయడం నరేంద్ర మోదీ ప్రభుత్వం దూరదృష్టి, దేశ ప్రజల పట్ల సంక్షేమంపై ఉన్న సంకల్పానికి నిదర్శనం. రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికలను చూస్తాడు.. రాజనీతిజ్ఞుడు భవిష్యత్ తరాలను చూస్తాడని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించారు.

LEAVE A RESPONSE