రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు

-నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్న ఆస్తి
– నేను కొన్నది 904 గజాల ఇంటి స్థలం
– ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్

షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం నేను శ్యాంసుందర్ ఫుల్జాల్ ( తండ్రి పి వి హన్మంతరావు ) అనే వ్యక్తి నుంచి 2016లో (సేల్ డీడ్ నంబర్ 5917/2016. 11 నవంబర్ 2016) పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. రూ. 3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, బాజాప్తా సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశాను. కాబట్టి ఫోర్జరీ అనే మాటకు తావులేదు . అది వాస్తవం కాదు . ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయవివాదం తలెత్తలేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు.

నాకు ఇంటి స్థలాన్ని అమ్మిన శ్యాంసుందర్ ఆ భూమిని 1992లో సేల్ డీడ్ నంబర్ 1888/1992 ద్వారా కొనుగోలు చేశారు. అప్పటినుంచి ఎలాంటి న్యాయవివాదాలు లేవని ఆయన నాకు స్పష్టంగా తెలియజేశారు. అంటే దాదాపు 32 ఏళ్లుగా ఆ భూమిపై ఎలాంటి న్యాయవివాదాలు లేవు.

నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయి. ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా నాకు అమ్మిన వ్యక్తి మరియు నా ఆధీనంలోనే ఉన్నది .

ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్ నోటీసు ఇవ్వాలి. వివరణ అడగాలి. కానీ అలాంటివేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఇంటి స్థలం 1350 గజాలు అని పోలీసులు, మీడియా పేర్కొంటున్నారు. కానీ నేను కొన్నది 904 గజాల ఇంటి స్థలం అని గమనించగలరు.

దీనిని బట్టి ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు అని స్పష్టంగా అర్థమవుతుంది. నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ.. ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. నేను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు. నేను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

32 సంవత్సరాలుగా లేని వివాదం కొత్తగా ఇప్పుడు ఎందుకు తెర మీదికి వచ్చిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మా పార్టీపై, నాపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.

 

Leave a Reply