- చైనాతో భాగస్వామ్యంలో హంబన్ టోట పోర్టు
- చైనా సంస్థకు 99 ఏళ్లకు లీజుకి ఇచ్చిన శ్రీలంక
- ఆగస్టు 11న పోర్టుకు రానున్న చైనా నౌక యువాన్ వాంగ్-5
- సాధారణ నిఘా కోసమే వస్తోందన్న చైనా
శ్రీలంకలోని హంబన్ టోట వద్ద చైనా నిర్వహణలో ఓ పోర్టు కొనసాగుతోంది. శ్రీలంక ప్రభుత్వం ఆ పోర్టును చైనా సంస్థకు 99 ఏళ్ల లీజుకు అప్పగించింది. ఇప్పుడా పోర్టు వద్దకు ఓ చైనా నౌక (యువాన్ వాంగ్ 5) రానుంది. ఈ నెల 11 నాటికి అది హంబన్ టోట నౌకాశ్రయానికి చేరుకుంటుందని అంచనా. ఆగస్టు 17 వరకు అది అక్కడే ఉంటుంది. ఈ పరిణామం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజా పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.
దీనిపై శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా ప్రతినిధి కల్నల్ నళిన్ హెరాత్ స్పందించారు. భారత్ ఆందోళనను శ్రీలంక అర్థం చేసుకోగలదని, చైనా నౌకలో సైనిక వ్యవస్థలు ఉన్నప్పటికీ, అది సాధారణ కసరత్తుల్లో భాగంగానే ఇక్కడికి వస్తోందని స్పష్టం చేశారు. భారత్, చైనా, రష్యా, జపాన్, మలేసియా నావికాదళాలకు చెందిన నౌకలకు తాము అనుమతి ఇస్తుంటామని, ఆ విధంగానే చైనా నౌకకు కూడా అనుమతి ఇచ్చామని వెల్లడించారు. కేవలం అణ్వస్త్ర సహిత నౌకలు వచ్చినప్పుడు మాత్రమే తాము అనుమతి నిరాకరిస్తామని నళిన్ హెరాత్ వెల్లడించారు.
హిందూ మహాసముద్రంలో నిఘా, నేవిగేషన్ కార్యకలాపాల కోసమే ఆ నౌక వస్తున్నట్టు చైనా తమకు సమాచారం అందించిందని, ముందస్తు అనుమతి కోరిందని వెల్లడించారు. కాగా, ఆ చైనా నౌక అత్యంత సమర్థవంతమైనదని, అందులోని కీలక వ్యవస్థలు ఎంతో అధునాతనమైనవని శ్రీలంక రక్షణ మంత్రిత్వ వర్గాలు వెల్లడించాయి.
2014లో హంబన్ టోట పోర్టుకు రెండు చైనా జలాంతర్గాములు కనీసం అనుమతి తీసుకోకుండానే రావడం కలకలం రేపింది. కొంతకాలంగా చైనా హిందూ మహాసముద్రంలోనూ తన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకకు సాయం పేరిట తన ప్రాబల్యం పెంచుకునేందుకు చైనా యత్నిస్తోందని భారత్ అనుమానిస్తోంది.