క‌ర్ణాట‌క మిల్క్ డెయిరీని సందర్శించిన అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న ముగిసిన మ‌రునాడే అమిత్ షా క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. పార్టీ శ్రేణుల‌తో స‌మావేశం కోస‌మే బెంగ‌ళూరు వెళ్లిన అమిత్ షా… బెంగ‌ళూరులోని క‌ర్ణాట‌క మిల్క్ ఫెడ‌రేష‌న్ (కేఎంఎఫ్‌) ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న డెయిరీ ప్లాంట్‌ను సంద‌ర్శించారు. స‌హ‌కార రంగంలో న‌డుస్తున్న డెయిరీల్లో ఈ డెయిరీ దేశంలోనే రెండో అతి పెద్దదిగా రికార్డుల‌కెక్కింది.

డెయిరీలో ఆయా విభాగాల‌ను ప‌రిశీలిస్తూ సాగిన అమిత్ షా… మిల్క్ డెయిరీ కార్య‌క‌లాపాల‌పై ఆరా తీశారు. ఉద్యోగాల క‌ల్ప‌న‌, పాడి ఉత్ప‌త్తిదారుల‌కు ఆదాయం, వారి జీవ‌నోపాధి మెరుగుద‌ల‌కు డెయిరీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. అమిత్ షా వెంట కర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై కూడా ఉన్నారు.