– టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ విద్యారంగాన్ని దేశ భవిష్యత్తుకు పునాదిగా భావిస్తోందని, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఏకంగా 2 లక్షల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తమదే అని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1,96,000 మంది ఉపాధ్యాయులు టీడీపీ హయాంలో ఉద్యోగాలు పొందినవారేనని కూడా స్పష్టం చేశారు. విద్యారంగాన్ని మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని లోకేష్ విశ్వసిస్తున్నారని తెలిపారు.
2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని, మెగా డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో కనీసం ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని విమర్శించారు. దీనికి విరుద్ధంగా నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో నిరుద్యోగులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీ మీద పెడతానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడుని ఒప్పించి ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకాన్ని డీఎస్సీ మీద పెట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
దీనిలో భాగంగా కేవలం 150 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని ఈ ఘనత భారతదేశంలో ఎవరికీ దక్కనిదని లోకేష్, చంద్రబాబు నాయుడులకు దక్కిందన్నారు. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత నారా లోకేష్ త్వరలో రాబోయే విద్యా సంవత్సరానికి కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే మార్చిలో మరొక డీఎస్సీ, టెట్ నిర్వహిస్తామని ప్రకటించడం నిరుద్యోగ యువతకు పెద్ద భరోసా అని పేర్కొన్నారు.
ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటిస్తామన్న లోకేష్ పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటున్నారని, ఇది విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను కించపరిచే విధంగా వారిని బాత్రూ రూం కడిగించడం, వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టించడం వంటి పనులు చేయించారని ఆరోపించారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ విద్యారంగ సంస్కరణలు చేపట్టి, ఉపాధ్యాయులకు అత్యధిక గౌరవాన్ని పెంచారని ‘తల్లికి వందనం’ వంటి పథకాలతో వారికి మనోధైర్యాన్నిచ్చారని తెలిపారు.
నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ చేశారు. 90 మంది ఎస్టీ యువత కొత్త ఉపాధ్యాయులుగా నియామించారు. 700 కోయ భారతీ టీచర్ పోస్టుల భర్తీ, జూనియర్ కళాశాలల్లో 700 మంది సిబ్బంది సేవల్లో పునరుద్ధరణ, 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల్లో పునరుద్ధరణ వంటివి చేపట్టారని వివరించారు.
గత ప్రభుత్వం అసమర్థత కారణంగా నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 3వ స్థానంలో ఉన్న విద్యారంగం 19వ స్థానానికి పడిపోయిందని, కానీ లోకేష్ దానిని తిరిగి భారతదేశంలోనే తొలి స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. లోకేష్ సంస్కరణల ఫలితంగానే నేడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెరగడమే కాకుండా, ఉత్తీర్ణత శాతం కూడా పెరిగిందన్నారు.
నారా లోకేష్ కేవలం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పారిశ్రామికాభివృద్ధి పైనా దృష్టి పెట్టారు. ఇందుకోసం ఆయన దేశ విదేశాల్లో పర్యటించి, పారిశ్రామికవేత్తలను కలిసి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తిరిగి బలం చేకూర్చేందుకు కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. చేతల్లో చూపించే వ్యక్తి నారా లోకేష్ అని ఇచ్చిన హామీలను నెరవేర్చి, రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెడుతున్నందుకు ఆయనకు యువత, విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలిపారు