నేటికి నలభై సంవత్సరాల క్రితం, 29 ఏళ్ల యువ పాత్రికేయుడు దశరధరామ్ను విజయవాడ సత్యనారాయణపురం రోడ్డుపై 20 కత్తిపోట్లతో దారుణంగా హత్య చేశారు. అతని శరీరాన్ని చిద్రం చేయగలిగారు కానీ, అతను సమాజంలోని అసమానతలు, అన్యాయాలపై లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ సమాధానాల కోసం నిలిచే ఉన్నాయి.
ఈ రోజుల్లో జర్నలిజం లాబీయింగ్, కాపీయింగ్లకు పరిమితమైపోతున్న తరుణంలో, దశరధరామ్ తన జీవితాంతం చావుతో చదరంగం ఆడి, ప్రజా పాత్రికేయుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన రక్తం, ఆయన లోపాలను కూడా శుద్ధి చేసినంత ప్రభావాన్ని చూపింది. తెలుగు జర్నలిజం దశరధరామ్ హత్యపై చూపిన నిర్లక్ష్య వైఖరికి నేటికి 39 సంవత్సరాలు!
ప్రభుత్వం నుంచి ప్రతిపక్షం వరకు, ఆస్తికుల నుంచి నాస్తికుల వరకు, కమ్యూనిస్టుల నుంచి దళిత సంఘాల వరకు – ఎవరి తప్పులనైనా నిర్భయంగా బట్టబయలు చేసిన ధైర్యం ‘ఎన్కౌంటర్’ పత్రికదే.
ఈ రోజు చాలా మందికి ఆయన గురించి తెలియకపోవచ్చు. కానీ ఒక తరం యువతను ప్రభావితం చేసిన ఆయన కృషి చిన్నది కాదు. ఎల్లో జర్నలిజం అంటూ తుడిచిపెట్టే ప్రయత్నాలు చేసినా, ఆయన నిజాయితీని మర్చిపోలేరు.
నేటికీ ఆయన పేరే కొందరికి భయాన్ని కలిగిస్తుంది. దశాబ్దాల తరువాత కూడా ఆయనపై కొనసాగుతున్న వివక్ష, ద్వేషాన్ని చూస్తే, కేవలం నాలుగేళ్లు ఒక పత్రికను నడిపిన పాత్రికేయుడి నిజాయితీకి ఇది గొప్ప తార్కాణం.
ఎవరూ అంగీకరించకపోయినా, వ్యవస్థపై చివరి వరకూ కలంతో పోరాడిన ప్రజా పాత్రికేయుడు దశరధరామ్. ఎవరూ గుర్తించకపోయినా, విస్మరించలేని విప్లవ పత్రిక – ‘ఎన్కౌంటర్’. అంతే!
ఆయన వాడిన భాష, భావాలపై ఎవరికైనా విభేదాలు ఉండొచ్చు కానీ ప్రజా పక్షంగా నిలిచి, వీరోచితంగా మరణించిన దశరధరామ్ తెగువకు మనిషిగా నివాళి అర్పించకుండా ఉండలేరు. ఆయన 40వ వర్ధంతి సందర్భంగా ఆ విస్మృత కలం యోధుడిని స్మరిస్తూ ఈ చిన్న నివాళి.