– దేశంలోనే అతి పెద్దది!
– ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే పెద్దది
– అమరావతి ఎల్పిఎస్ స్ఫూర్తిని ఓఆర్ఆర్ కోసం అమలు చేయడం ద్వారా భూ యజమానుల భాగస్వామ్యాన్ని పెంచాలి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ( ఓఆర్ఆర్ ) నిర్మాణ ప్రకటన చారిత్రక ఘట్టమైతే, బెంగళూరు పెరిఫెరల్ రింగ్ రోడ్డు ( పిఆర్ఆర్ గత దశాబ్దాలుగా భూసేకరణ సమస్యలు మరియు వ్యయం పెరుగుదల కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లు ఒక కీలకమైన పాఠం.
రూ. 24,791 కోట్ల అంచనా వ్యయంతో, 190 కిలోమీటర్ల పొడవుతో నిర్మించ తలపెట్టిన అమరావతి ఓఆర్ఆర్ , పొడవు మరియు విశాలత్వం (140 మీటర్ల వెడల్పు) పరంగా భారతదేశంలోనే అతిపెద్ద రాజధాని రింగ్ రోడ్లలో ఒకటిగా నిలుస్తుంది. ఇది ఇప్పటికే విజయవంతమైన హైదరాబాద్ ఓఆర్ఆర్ (158 కి.మీ.) కంటే పెద్దది.
ఆరు వరుసల ప్రధాన రహదారి, నాలుగు వరుసల సర్వీస్ రోడ్లు, కృష్ణానదిపై రెండు భారీ వంతెనలు వంటి అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ నిర్మాణం, విజయవాడ-గుంటూరు-తెనాలి వంటి కీలక కేంద్రాలను అనుసంధానిస్తుంది. అయితే, బెంగళూరు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, భూమి యజమానులకు నష్టపరిహారం, ప్రాజెక్టు అమలు వేగంపైనే అమరావతి విజయం ఆధారపడి ఉంటుంది.
బెంగళూరు పిఆర్ఆర్ (117 కి.మీ., అంచనా వ్యయం రూ. 27,000 కోట్లు) ఆలస్యం కావడానికి ప్రధాన కారణం భూమి విలువలు విపరీతంగా పెరగడం నష్టపరిహార వివాదాలే. వాస్తవానికి, కర్ణాటక ప్రభుత్వం ఒకానొక సందర్భంలో, ముఖ్యంగా పిఆర్ఆర్ మరియు ఇతర పెద్ద ప్రాజెక్టుల కోసం భూసేకరణ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో, అమరావతి భూ సమీకరణ పథకం ( ఎల్పిఎస్ ) స్ఫూర్తిని అనుకరించే ప్రతిపాదనను పరిశీలించింది. ఎల్పిఎస్ లో భూ యజమానులకు నగదుకు బదులు అభివృద్ధి చేసిన వాణిజ్య, నివాస ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఆలోచనను స్వీకరిస్తూనే, ఇటీవల బెంగళూరు కేబినెట్ పిఆర్ఆర్ కోసం “కొత్త నష్టపరిహార విధానాన్ని” ప్రకటించింది. దీనిలో భూ యజమానులకు నగదుతో పాటు, అభివృద్ధి చేసిన ప్లాట్లు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ( టిడిఆర్ ), ఫ్లోర్ ఏరియా రేషియో ( ఎఫ్ఏఆర్ ) వంటి ప్రత్యామ్నాయ పరిహారాలు అందించాలని నిర్ణయించారు. ఇది సాంప్రదాయ పద్ధతి కంటే భిన్నమైన విధానం, భూసేకరణకు బెంగళూరు ఎదుర్కొంటున్న దశాబ్దాల సమస్యలకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎల్పిఎస్ ఆలోచనను ఆధారం చేసుకున్న ఒక కొత్త ప్రయత్నంగా ఈ పరిణామాన్ని చూడవచ్చు.
అమరావతి ఓఆర్ఆర్ ప్రత్యేకతను ఇతర రాజధాని నగరాలతో పోల్చి చూస్తే స్పష్టమవుతుంది. చెన్నై ఓఆర్ఆర్ (62 కి.మీ.) మరియు ఢిల్లీ రింగ్ రోడ్ (55 కి.మీ.) పరిమిత పొడవుతో, దట్టమైన నగరాల సమస్యలతో పోరాడుతుంటే, ముంబై రింగ్ నెట్వర్క్ చిన్నదైనా (90 కి.మీ.), దాని నిర్మాణ క్లిష్టత కారణంగా అత్యధిక వ్యయం (రూ. 58,517 కోట్లు) కలిగి ఉంది. ఈ నేపథ్యంలో, అమరావతి ఓఆర్ఆర్ పొడవు (190 కి.మీ.), వెడల్పు (140 మీటర్లు) మరియు ప్రణాళికాబద్ధమైన అనుసంధానం పరంగా అగ్రస్థానంలో ఉంది.
ఈ భారీ ప్రణాళిక వెనుక ఉన్న ఉద్దేశం, కేవలం ట్రాఫిక్‌ను తగ్గించడం మాత్రమే కాదు, ఓఆర్ఆర్ చుట్టూ కొత్త లాజిస్టిక్స్ హబ్‌లు, పారిశ్రామిక క్లస్టర్లు మరియు నివాస ప్రాంతాలను సృష్టించడం. దీనివల్ల అమరావతి యొక్క ప్రాదేశిక మరియు ఆర్థిక కేంద్రం మరింత విస్తరించి, సుదీర్ఘకాలిక పట్టణాభివృద్ధికి పునాది పడుతుంది.
బెంగళూరు సవాళ్లు పెద్ద ప్రాజెక్టులకు భూసేకరణ ఎంత క్లిష్టమైనదో నిరూపిస్తుంటే, అమరావతి ఓఆర్ఆర్ యొక్క విజయం ప్రారంభ దశలోనే పారదర్శకత మరియు నష్టపరిహార నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ వ్యయాన్ని భరించడానికి ముందుకు రావడం సానుకూల అంశం.
బెంగళూరు పిఆర్ఆర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, అమరావతి ఎల్పిఎస్ స్ఫూర్తిని ఓఆర్ఆర్ కోసం అమలు చేయడం ద్వారా భూ యజమానుల భాగస్వామ్యాన్ని పెంచాలి. అమరావతి ఓఆర్ఆర్ 140 మీటర్ల విశాలమైన భూమి, భవిష్యత్తులో మాస్ ట్రాన్సిట్ కారిడార్లకు కూడా స్థలాన్ని రిజర్వ్ చేస్తూ, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఒక నమూనాగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ సకాలంలో, నాణ్యతతో పూర్తయితే, అది అమరావతిని ఆధునిక, సుసంపన్నమైన గ్లోబల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతుంది.
ఈ రోజు నాకు, మాకు ఏంటి, రేపేంటి అనే స్పీడ్ కాలంలో.. తన రికార్డును తానే తిరగరాస్తున్న మయుడు నాయుడు. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ఆలోచన త్వరగా సాకారం కావాలని కోరుకుందాం.