Suryaa.co.in

Telangana

ఓయూ చరిత్రలో నూతన అధ్యాయం.. ప్రిన్సిపల్‌గా ఆదివాసీ మహిళ

ఉస్మానియా యూనివర్శిటీ చరిత్రలోనే నూతన అధ్యాయం నమోదైంది. ఓయూ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ గుమ్మడి అనురాధ నియమితులయ్యారు. బషీర్‌బాగ్‌లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా ఆమెను నియమిస్తూ, వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఉత్తర్వులు జారీ చేయగా… గురువారం మధ్యాహ్నం ఆమె బాధ్యతలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం టేకులగూడెంలో జన్మించిన ఆమె.. ఓయూలోనే పీజీతో పాటు లా కోర్సులు పూర్తి చేశారు. అనంతరం ఓయూ లా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులై.. ఇప్పుడు ప్రిన్సిపల్‌ స్థాయికి ఎదగడం విశేషం. వందేళ్ల ఓయూ చరిత్రలోనే ఓ ఆదివాసీ మహిళ(కోయ) కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.
అనురాధ ఉన్నతమైన రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆమె తండ్రి సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఆయన ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాధారణ జీవితం గడుపుతున్నారు. నేటి కాలంలో రాజకీయ విలువలకు, హుందాతనానికి ప్రతీకగా నిలిచిన గుమ్మడి నర్సయ్య కుమార్తె.. ఓయూ కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE