• RoFR పట్టాలు సాగు చేసుకుంటున్న రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టాలి
• అన్ సర్వే ల్యాండ్స్ కు కొత్త నెంబర్లు కేటాయించాలి
• మండలాల వారీగా రీ సర్వే చేపట్టాలి
• సన్న, చిన్నకారు రైతు భూ సమస్యలను పరిష్కరించాలి
• దేవాదాయ భూముల వివరాలు క్రమబద్ధీకరించాలి
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారధి
విజయవాడ: అటవీ భూములకు RoFR పట్టాలు ఇచ్చినా అటవీ శాఖాధికారులు సాగు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు వెల్లువెత్తుతున్నాయి, వాటిపై ప్రభుత్వం దృష్టి సారించి సమస్యలకు చెక్ పెట్టి రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కోరారు.
మంగళగిరి సీసీఎల్ఏ రాష్ట్ర కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం ప్రాంతీయ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సు దృష్టికి మంత్రి పార్థసారధి పలు సమస్యలను తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. అటవీ సరిహద్దుల్లో ఇచ్చిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులు సాగు చేసుకుంటున్నారని, కానీ అటవీ పరిధి విషయంలో అధికారులు మారిన ప్రతిసారి ఇది అటవీ భూమి సాగు చేయకూడదని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి పార్థసారధి తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ, అటవీ జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి సర్వే చేసి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఆన్ సర్వే ల్యాండ్స్ కు నూతన నెంబర్లు కేటాయించాలని మంత్రి పార్థసారధి కోరారు. అన్ సర్వే ల్యాండ్ సాగు చేసుకుంటున్న రైతుల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. అలాగే గతంలో అటవీ భూమిగా నమోదై ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందించాలని కోరారు. అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని అలాగే సన్న, చిన్నకారు రైతులకు కూడా సాగు భూమి పట్టాలు ఇవ్వాలని కోరారు.
ఇక ప్రధాన సమస్య ఆన్ లైన్ నమోదైన వివరాలను సైతం కొందరు మండల స్థాయి అధికారులు మార్పులు చేస్తున్నారన్నారు. వాటితో గ్రామాల్లో సమస్యలు పెరిగిపోతున్నాయని, జిల్లా ఉన్నతాధికారులు అలాంటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలాగే ఆన్ లైన్ లో మార్పులు చేసిన సదరు ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని కోరారు.
సాగు భూములకు పట్టాలు ఉంటాయి, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి, యాజమాన్య దృవీకరణ పత్రాలు అన్నీ ఉన్నా కాని సదరు యజమానులు ఇతర ప్రాంతాల్లో ఉండటాన్ని అవకాశంగా తీసుకుని ఆక్రమణలు జరుగుతున్నాయని వాటికి చెక్ పెట్టి వాస్తవ యాజమానులకు న్యాయం చేయాలన్నారు. అలాగే దేవాలయాలకు వందల ఎకరాలను దాతలు దానం చేయడం జరిగిందని, కానీ అవి ఆక్రమణల్లో ఉన్నాయని, దేవాలయ భూసమస్యలను పరిష్కరించాలని కోరారు.
నూజివీడు, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న గృహాలకు సంబంధించి ఇటీవల వక్ఫ్ ఆస్థులంటూ క్లెయిమ్ చేయడంపై ఆ ప్రాంత ప్రజలు మల్లగుల్లాలు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రికార్డులు పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
ఈ సదస్సులో ఉప సభాపతి రఘురామ కృష్టంరాజు, ఎమ్మెల్యేలు బొండా ఉమా మహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, గద్దే రామ్మోహన్, వసంత కృష్ణ ప్రసాద్, రాజగోపాల శ్రీరామ్ (తాతయ్య), వర్ల కుమార్ రాజా, కొలికపూడి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు రామరాజు, అశోక్ బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోదియా, సీసీఎల్ఏ జయలక్ష్మీ, 12 జిల్లాల కలెక్టర్లు, జేసీలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.