• గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నగర ప్రజలు నష్టపోయారు
• బుడమేరు పునర్నిర్మాణానికి అధికారులతో కలసి ప్రణాళికలు సిద్ధం
• గత ప్రభుత్వం బుడమేరుకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు
– మంత్రులు పి. నారాయణ, నిమ్మల రామానాయుడు
విజయవాడ:బుడమేరు వరద నియంత్రణ పై విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ, లు ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష చేశారు.
ఈ సమీక్షా సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వరావు లతో పాటు ఇరిగేషన్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమగ్ర నివేదిక అందించేందుకు ఆయా శాఖల అధికారులతో బుడమేరుపై సమగ్ర సమీక్ష చేశారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృత్తం కాకుండా, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు ఇప్పటికే నాలుగుసార్లు బుడమేరు వరదలపై ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా సమీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా వరదల సమయంలో బుడమేరు నుంచి వెళ్లే ప్రవాహ వేగాన్ని పెంచడంతోపాటు 40,000 క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునే విధంగా భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
సమీక్ష అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. బుడమేరు నష్టాన్ని అందరం చూశామని, ఒక్కరోజే 50,000 క్యూసెక్కుల వరద నీరు రావడం, మూడు చోట్ల గండ్లు పడటం జరిగాయన్నారు. ముఖ్యమంత్రి అపార అనుభవంతో వరదల నుంచి ప్రజలను గట్టెకించగలిగామన్నారు. భవిష్యత్ లో బుడమేరు వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు దీనిపై సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామన్నారు.
బుడమేరు డైవర్షన్ కెనాల్ కెపాసిటీ ప్రస్తుతం 17,500 క్యూసెక్కుల నుంచి 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అందిస్తామన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుండి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్ద్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచనలు చేశామన్నారు.
2014-19 కాలంలోనే బుడమేరు డైవర్షన్ ఛానెల్ సామర్ధ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచేలా రూ. 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80 శాతం పనులు కూడా పూర్తి చేశామన్నారు. అయితే గత ప్రభుత్వం బుడమేరు విస్తరణకు నిధులు ఉన్నా మిగిలిన 20 శాతం పనులకు సంబంధించి తట్ట మట్టిగాని, బస్తా సిమెంట్ పని గాని వేయలేదన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పాపం ఫలితమే బుడమేరు ముంపుకు కారణమన్నారు. అంతేకాకుండా దానికి విజయవాడ నగర ప్రజలు మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నారు.
2014-19 కాలంలోనే ఎనికేపాడు యూటీ నుండి కొల్లేరు వరకు వెళ్ళే ఛానల్ విస్తరణ పనులను గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బుడమేరు ఛానెల్ కు సమాంతరంగా ఓల్డ్ ఛానెల్ ను కూడా 10 వేల క్యూసెక్కుల సామర్ద్యంతో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. కొల్లేరు నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా సముద్రానికి వెళ్లేలా ఉప్పుటేరు ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇదే అంశం మీద ఈ నెల 18న మరోసారి సమీక్ష చేస్తామన్నారు.
మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని 34 వార్డుల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. ముఖ్యమంగా 5 లక్షల మంది 4 రోజులు నీళ్ళలోనే ఉండటం బాధాకరమన్నారు. ఆ సమయంలో వారికి కనీసం రోజు వారీ అవసరాలకు కూడా నీరు అందని పరిస్దితి ఉందన్నారు.
అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన స్ఫూర్తితో ప్రజలకు రోజుకు 20 నుంచి 30 లక్షల డ్రింకింగ్ వాటర్ బాటిళ్ళు పంపిణీ చేశామన్నారు. వాటర్ బాటిళ్ళ పంపిణీని కూడా కొద్దిమంది రాజకీయం చేసారన్నారు. అయితే మేము ప్రజలకు ఏది అవసరమో అదే అందించామన్నారు.
గత ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్దితి వచ్చేది కాదన్నారు. బుడమేరు వరదలకు గత ప్రభుత్వమే కారణమన్నారు. మరోసారి జనవరి 18 న మూడు శాఖల అధికారులతో ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖలతో సమావేశం అవుతామన్నారు. భవిష్యత్తులో విజయవాడ నగరానికి వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం పై చర్చించామన్నారు.
బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్నదానిపై కూడా ప్రధానంగా చర్చించామన్నారు. దీనిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ తో కూడా చర్చించాల్సి ఉందన్నారు. ఒక పక్క రాష్ట్ర ఖజానా కూడా ఖాళీ అయిన పరిస్థితి ఉందని అయితే గత ప్రభుత్వం సరైన ఫైనాన్స్ ప్లానింగ్ చేయకపోవడం వల్ల ఇబ్బందులున్నాయన్నారు. ముఖ్యమంత్రి అపార అనుభవం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పడిప్పుడే గాడిన పడుతుందన్నారు. బుడమేరు వరద నియంత్రణ కు సంబంధించి కేంద్రానికి నివేదించి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరతామన్నారు.