– ఆర్థిక పరమైన అంశంలో 40 మందితో డెయిరీ వద్దకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?
– బాధితులకు తగిలిన దెబ్బలు చాలా చిన్న దెబ్బలు
అమరావతి: సంగం డెయిరీపై కక్ష సాధింపు వ్యవహారంలో హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. దూళిపాళ్ల నరేంద్ర సహా డెయిరీ సభ్యులపై హత్యాయత్నం కేసులో పోలీసుల తీరును హైకోర్టు ప్రశ్నించింది..
కేసు విషయంలో ప్రాసిక్యూషన్ తప్పులను ప్రస్తావిస్తూ.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వివాదానికి కారణం అని చెపుతున్న ద్వారకామయి మిల్క్ డెయిరీ ఫాంకు ఫిర్యాదు దారుడికి సంబంధం ఉందని నిరూపించలేకపోయారని కోర్టు పేర్కొంది. సంగం డెయిరీ చెల్లింపులు జరపాలని చెపుతున్న ద్వారకామయి డెయిరీ ఫామ్ కు సంబంధం లేకపోయినా, ఫిర్యాదు దారు తాళాలు వేశాడన్న డెయిరీ వాదనపై పోలీసులు సాక్ష్యాలు చూపలేకపోయారని కోర్టు ప్రశ్నించింది..
లీగల్ గా పరిష్కరించుకునే ఆర్థిక పరమైన అంశంలో 40 మందితో డెయిరీ వద్దకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటూ కోర్టు ప్రస్తావించింది. ఘటన జరిగిన సమయంలో బాధితులు అక్కడే ఉన్నట్లు పోలీసులు చెపుతున్నా….సీసీ కెమెరాల్లో వారెక్కడా ఆ సమయంలో కనిపించలేదని కోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణలో సంగం డెయిరీ సిబ్బందితో పాటు వారి తల్లిదండ్రులను నిర్భందించడంపై పోలీసులు ఎటువంటి వివరణ ఇవ్వలేకపోయారని తెలిపింది.
మెడికల్ రిపోర్టు ప్రకారం బాధితులకు తగిలిన దెబ్బలు చాలా చిన్న దెబ్బలు అని…వాటి ఆధారంగా హత్యాయత్నం పెట్టడం కూడా సరికాదని కోర్టు పేర్కొంది. చిన్న దెబ్బలకు సెక్షన్ 307 పెట్టకూడదన్న సుప్రీం కోర్టు సూచనలను బెయిల్ ఆర్డర్ లో కోర్టు ప్రస్తావించింది. విచారణ అధికారి కోరిన సమాచారాన్ని సంగం డెయిరీ వారు రిజిస్టర్ పోస్టులో పంపితే దాన్ని తీసుకోకపోవడాన్ని కూడా కోర్టు తప్పు పట్టింది..