ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2024 – 25లో నాకు ఆశ్చర్యం కలిగించిన అంశం, గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పద్దు కింద ఏకంగా రు.2,438.94 కోట్లు కేటాయించడం.
ఈ కేటాయింపులో గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ నిర్మాణానికి రానున్న 4 నెలల కాలంలో ఎంత వ్యయం చేస్తారన్న హిమాలయ పర్వతమంత ప్రశ్న నా బుర్రను తొలిచేస్తున్నది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ నిర్మాణానికి ఐదేళ్ళ కాలంలో ఒక్క రూపాయి కేటాయించకుండా ఆ ప్రాజెక్టును అటకెక్కించింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రకటించిన ఆరు ప్రాధాన్యతా ప్రాజెక్టులలో గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ లేదు.
కానీ, పోలవరం జాతీయ ప్రాజెక్టు తర్వాత బడ్జెట్ లో అత్యధిక కేటాయింపు చేసింది గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకే. అందుకే, ఖర్చు చేస్తారా! అన్న అనుమానం వచ్చింది. అంతే!
ప్రభుత్వం ప్రకటించిన ఆరు ప్రాధాన్యతా ప్రాజెక్టులలో గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ లేకపోవడంతో స్పందించి, గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించాలని విజ్ఞప్తిచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగారికి పది రోజుల క్రితం నేను ఉత్తరం కూడా వ్రాశాను. ప్రాజెక్టుకు బడ్జెట్ లో భారీ కేటాయింపు నాలుకపై తేనె రాసినట్లు ఊరించడానికి మాత్రమే కాకూడదు, అన్నదే నా ఆకాంక్ష.
– టి.లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక