-తెలుగుదేశం శ్రేణులకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పిలుపు
తుఫాన్ నష్టం అపారంగా ఉందని, ఆపద సమయంలో ప్రజలకి తెలుగుదేశం శ్రేణులు అండగా నిలవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పిలుపునిచ్చారు. మంగళవారం మీడియాకి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ తీవ్రతపై వారం నుంచే కేంద్ర విపత్తు సంస్థలు హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షించకపోవడం దారుణం అన్నారు. తుఫాన్ పై అప్రమత్తం చేయడంలోనూ, సహాయకచర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం విఫలం కావడంతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వరద ప్రాంతాల్లో గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా, టిడిపి అధికారంలో ఉన్నా, లేకున్నా మానవతాదృక్పథంలో సహాయం చేసే తెలుగుదేశం శ్రేణులు తుఫాన్ సహాయకచర్యలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓ వైపు వర్షం-మరోవైపు తీవ్రమైన గాలులు ఉన్న నేపథ్యంలో అన్నిజాగ్రత్తలు తీసుకుని వరద బాధితులకు ఆహారం, ఇతరత్రా సాయం అందించాలని టిడిపి కేడర్‌కి సూచించారు.