– సచివాలయంలో సీఎస్ ఆఫీసు ఆయన సొంతమా?
– అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం అమానవీయం
– ఆంధ్రాలో అడ్రస్ లేని సంప్రదాయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా అధికారులే నిబంధనలు, గౌరవ మర్యాదలకు పాతరేసే కొత్త సంప్రదాయానికి తెరలేవడం విషాదం. రాజకీయ కోణంలో ఆలోచించే పాలకుల నిర్ణయాల తప్పొప్పులను సరిదిద్ది, సరైన దిశానిర్దేశం చేయాల్సిన అధికారులు కూడా.. పాలకుల పార్టీల కోణంలోనే ఆలోచించి, ఆ మేరకు సలహాలివ్వడం దురదృష్టం. అయితే.. పాలకుల దొడ్లో పాతుకుపోవాలనుకునే అత్యుత్సాహం ప్రదర్శించే ఈ బాపతు అధికారులు, ఆనక కోర్టుల ముందు నిలబడుతున్న సిగ్గుమాలిన ఉదంతాలు ఐఏఎస్-ఐపిఎస్ వ్యవస్థకే కళంకం. నిజానికి కోర్టుల ముందు తలదించుకుంటున్నది సుబ్బారావో పుల్లారావో కాదు. అధికారుల వ్యవస్థ. ఆ సోయి ఇప్పటి ఆంధ్రా అధికారులకు ఉన్నట్లు భూతద్దం వేసినా కనిపించడం లేదు. నిబంధనలకు పాతరేసి అడ్డమైన సలహాలిచ్చి, ఆనక కోర్టులో అభాసుపాలవుతున్న అవమానపర్వం విజయవంతంగా కొనసాగుతోంది. సీనియర్ ఐపిఎస్ అధికారి, డీజీపీ హోదా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ యవ్వారమే ఓ నిదర్శనం.
టీడీపీ జమానాలో నిఘా బాసుగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్లో ఆయనతోపాటు సతీష్‌చంద్ర అనే ఉత్తరాదికి చెందిన సీనియర్ ఐఏఎస్ కలసి, వైసీపీ ఎమ్మెల్యేల బేరసారాలు చేశారన్నది వైసీపీ పెద్దల ఆగ్రహానికి అసలు కారణం. సరే.. ఆ పనిచేశారని ఆరోపించిన సతీష్‌చంద్రకు పోస్టింగ్ ఇచ్చిన సర్కారు పెద్దలు, అందులో భాగస్వామిగా ఉన్నారని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు అనే ఐపిఎస్‌కు మాత్రం పోస్టింగ్ ఇవ్వకపోగా, సస్పెండ్ వేటు వేశారు. వేటులో కూడా పక్షపాతమేమిటో ఎవరికీ అర్ధంకాని ప్రశ్న.
ఏబీపై ప్రభుత్వం అనేక అభియోగాలు మోపింది. సర్కారు నిధులు దుర్వినియోగం చేశారని, సొమ్ములు పప్పుబెల్లాల మాదిరిగా ఆయన కొడుకు కంపెనీకి పంచారన్నది అభియోగం. అందువల్ల విచారణ ముగిసేవరకూ ఆయనను సస్పెండ్ చేసింది. బాగుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలవరూ కాదనరు. అది ప్రభుత్వానికి ఉన్న హక్కు. ఆ తర్వాత సర్కారు ఓ కమిషన్ వేసింది. ఆయనను పిలిచింది. ఏబీ కూడా తాను విచారించాల్సిన అధికారులను పిలిపించి, కమిషన్ ఎదుటే లాయర్ లెక్క క్రాస్‌ఎగ్జామ్ చేసి, లా పాయింట్లు తీశారు. తాను ఇంకా మరికొందరిని విచారించాలని ఓ జాబితా ఇచ్చారు. సరే అందులో కొంతమందిని విచారణ కమిషన్ మొహమాటంతో మినహాయించింది. అది వేరే విషయం.
చివరారఖరకు రెండేళ్లయినా ప్రభుత్వం ఏబీపై వేసిన నిందలు ఏవీ నిరూపించలేకపోయింది. కానీ రెండేళ్ల కాలం హననమయిపోయింది. జగన్ సర్కారు ఏ ఆరోపణలయితే చేసి, ఆయనపై వేటు వేసిందో.. వాటి ఆధారాలు కోర్టులో నిరూపించలేక చేతులెత్తేసింది. దానితో హైకోర్టు.. సర్కారు ఆరోపణల్లో సరుకు లేదని భావించి, ఆయన సస్పెన్షన్ ఎత్తేసి జీతం ఇవ్వాలని ఆదేశించింది. మామూలుగా అయితే ఏ ప్రభుత్వమయినా, తాను చేసిన సిగ్గుమాలిన పనికి సిగ్గుపడి సస్పెన్షన్ ఎత్తివేసి..నీ ఉద్యోగం నీవు చేసుకోమని ఎక్కడో లూప్‌లైన్ పోస్టింగు ఇస్తుంది. అంటే ఒక చిన్న రూము, ఒక అటెండరు ఉన్న ఆఫీసుతోపాటు.. పనీపాటా లేని పోస్టు ఇస్తుందన్నమాట. తనకు ఇష్టం లేని అధికారులకు ఏ ప్రభుత్వమయినా ఇలాంటి ‘మర్యాద’లే చేస్తుంటుంది. ఇది కొత్తేమీకాదు. గతంలో మహంతి, ఇంకా కొందరు ఐపిఎస్‌లను పాత పాలకులు ఇలాగే ‘గౌరవించి’ ఆత్మానందం పొందారు.
అలా దిద్దుబాటుకు దిగితే అది ఆంధ్రప్రదేశ్ ఎందుకవుతుంది? హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ ఏబీ కథ మళ్లీ పెండింగ్‌లో పడి, గత నెలలోనే ఆయన సస్పెన్షన్ చెల్లదని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. గెలవని ఈ కేసు కోసం సర్కారు ప్రజాధనాన్ని నీళ్లమాదిరి ఖర్చు పెట్టినా ఫలితం శూన్యం. ఇది జరిగి ఇంతకాలమయినా ఇప్పటిదాకా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వును అమలుచేయాల్సిన సీఎస్ అయితే.. తన వద్దకు వచ్చిన డీజీపీ హోదా ఉన్న ఏబీని రెండుసార్లు వెయిట్ చేయించి, తన పీఏకి అర్జీ ఇచ్చి వెళ్లమనడం అమానవీయమే కాదు, అహంకార ప్రదర్శన కూడా అన్నది సీనియర్ ఐఏఎస్‌ల వ్యాఖ్య. ఇద్దరం యుపిఎస్సీ పరీక్ష రాసి వచ్చినవాళ్లమేనని ఏబీ తాజాగా చేసిన వ్యాఖ్యను తప్పుపట్టలేం.
‘ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏబీ వెంకటే శ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వడం సీఎస్ విధి. ఆయన తనను కలిసినప్పుడు ఇచ్చే వినతిపత్రాలు తీసుకుని, తగినవిధంగా స్పందించి ఆయన సమస్య పరిష్కరించడం సీఎస్ కర్తవ్యం. ముఖ్యంగా తనకు రావలసిన వేతన బకాయిలు అవీ పరిష్కరించాలి. ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ హోదా ఉన్న సీనియర్ ఐపిఎస్. అలాంటి అధికారికి తగిన మర్యాద ఇవ్వడం వృత్తి ధర్మమే కాదు, సంప్రదాయం కూడా. పోస్టింగు ఎక్కడ ఇవ్వాలనేవి ప్రభుత్వ ఇష్టం కాబట్టి దాని గురించి నేనేమీ వ్యాఖ్యానించను. ప్రభుత్వ పెద్దలు ఎంత దన్నుగా ఉన్నప్పటికీ అధికారులు రాజ్యాంగం, చట్టం, సంప్రదాయాలను గౌరవించాలి. ఏబీని విధుల్లోకి తీసుకోకపోతే ఆయన మళ్లీ కోర్టు ధిక్కరణ కేసు పెడితే సీఎస్ ఇబ్బందిపడవలసి ఉంటుంది. ఏదేమైనా ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై దేశంలోని ఐపిఎస్-ఐఏఎస్ అధికారులు ఆసక్తితో గమనిస్తున్నార’ని ఏసీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు.
నిజానికి ఐఏఎస్-ఐపిఎస్‌లకు ఎక్కడ ఉన్నా వారి జీతం వారికొస్తుంది. కాకపోతే వారి సమర్ధతకు తగ్గ పోస్టింగులు ఉంటేనే మరింత కిక్కుతో పనిచేస్తారు. సీనియర్లు, పనిమంతులను ఎలా వినియోగించుకోవాలన్నది పాలకుల స్థాయి, వయసు, అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాలకులకు అనుభవం లే కపోతే, సీఎస్- సీనియర్ అధికారులు వారిని గైడ్ చేయాలి. ఏమాత్రం పూర్వానుభవం లేకుండా, విద్యార్థి ఉద్యమాల నుంచి అధికారంలోకి వచ్చిన అసోం గణపరిషత్ ప్రభుత్వానికి, అప్పట్లో అధికారులే దిశానిర్దేశం చేశారు. ఆవిధంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, చట్టం, నాయస్థానాల పాత్ర గురించి అధికారులు పాలకులకు వివరించాలి. రాజకీయాలు-ఈర్ష్యాద్వేషాలతో సంబంధం లేకుండా అధికారుల అనుభవానికి తగిన పోస్టింగులు సిఫార్సు చేయటం సీఎస్, డీజీపీ విధి.
కానీ.. ఏపీలో గత కొన్నేళ్లుగా పాలకులను నడిపించాల్సిన అధికారులు కూడా, పాలక పార్టీల కోణంలో నిర్ణయాలు తీసుకోవడమే దౌర్భాగ్యం. చివరాఖరకు సీఎస్‌గా ఉన్న ఎల్వీఎస్‌ను, ఒక జూనియర్ అధికారి అవమానకరరీతిలో సాగనంపే దుస్సంప్రదాయానికి తెరలేపారు. ఇది అధికార వ్యవస్థకు మాయనిమచ్చ. అయినా ఇదేం అరాచకమని నాడు ఒక్క అధికారి గానీ, చివరకు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ప్రశ్నించే సాహసం చేయలేదు. డీజీపీ హోదాలో ఉన్న ఏబీ విషయంలో సాటి ఐపిఎస్‌లదీ ఇదే మౌనపాత్ర. ఈ అవమానపర్వం రేపు తమదాకా వస్తుందని ఊహించకపోవడమే విచిత్రం.
ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది సీఎస్, డీజీపీలు తమ అభిప్రాయాలను పాలకులకు నిర్భయంగా చెప్పేవారు. అప్పటి ముఖ్యమంత్రులు కూడా వారి అభిప్రాయాలను గౌరవించేవారు. అదేవిధంగా ఐఏఎస్-ఐపిఎస్ అధికారుల అసోసియేషన్లు.. తరచుగా తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన సందర్భంలో, పాలకులు కూడా సానుకూలంగా స్పందించేవారు. ఇప్పుడు అసలు ఆ సంఘాలు పనిచేస్తున్నాయా లేదా అన్నది కూడా సందేహం. తమ తోటి అధికారులకు జరిగే అన్యాయంపై గళమెత్తేందుకు ఐఏఎస్-ఐపిఎస్ చదువుకున్న వారికీ చొక్కాలు, లాగూలు తడుస్తుండటమే ఆశ్చర్యం. మరి ఇదే మౌనం అంతకుముందు ఎందుకు లేదన్నదే ప్రశ్న.
సరే.. మళ్లీ ఏబీ సస్పెన్షన్ దగ్గరకొద్దాం. గత రెండేళ్లలో ఏబీని మళ్లీ విధుల్లోకి చేరకుండా ఉండేందుకు జగన్ సర్కారు సుప్రీంకోర్టులో బోలెడంత ప్రజాధనం వృధా చేసింది. ఒక జీవోలో లాయర్ ఫీజుకు 20 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్న ప్రభుత్వం, తర్వాత ఆ జీఓలను రహస్యంగా ఉంచింది. ఏబీ కేసులో దాదాపు అరడజను మంది సీనియర్ లాయర్లను నియోగించగా, వారికి దాదాపు 2 కోట్ల వరకూ ఫీజుల రూపంలో చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. పోనీ ఇంతచేసినా ఏబీ సస్పెన్షన్‌ను ఆపగలిగారా అంటే అదీ లేదు. మరి ఈ ప్రజాధనం ఎవరి ఖాతాలో వేస్తారు? ఎవరి నుంచి రాబడతారన్నది ప్రశ్న. ఇప్పుడు తన కేసులో ప్రభుత్వం లాయర్ల కోసం పెట్టిన ఖర్చును తనకు చెల్లించాలని, అది కూడా తన సస్పెన్షన్‌కు కారణమయిన వారి నుంచి వసూలు చేయాలని ఏబీ కొత్త మెలికతో మరో కొత్త సమస్య. పైగా సస్పెన్షన్ సమయంలో ఆయనకు సగం జీతం ఇచ్చింది. అదేదో ఆయనకు పోస్టింగ్ ఇచ్చి పనిచేయించుకుని ఉంటే, ఆయన సర్వీసును వినియోగించుకున్నట్లు ఉండేది.
ఏబీపై సస్పెన్షన్ ఎత్తేసిన సర్కారు ఇప్పుడు ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవచ్చు. ఎస్పీ, డీఎస్పీ, ఐఏఎస్ మాదిరిగానే వెయిటింగ్‌లో ఉంచి, జీతం మాత్రం చెల్లించవచ్చు. అలా ఒక అధికారికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచి, ప్రజాధనాన్ని ఉత్తి పుణ్యానికి దుర్వినియోగం చేసినా మళ్లీ అదొక చర్చ లాంటి రచ్చ. సహజంగా ఎవరినీ ఖాళీగా కూర్చోపెట్టి జీతాలివ్వడం ఎక్కడా జరగదు. ఒకవేళ అది ఏబీ విషయంలో జరిగితే తప్ప సర్కారుదే అవుతుంది.
ఇక ఏబీ కేసులో సీఎస్ సమీర్ శర్మ పోషిస్తున్న పాత్ర విమర్శలకు దారితీయడంలో తప్పేమీలేదనిపిస్తోంది. ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి తన వద్దకు వచ్చినప్పుడు ఆయనను పిలిచి మాట్లాడాల్సిన సీఎస్, అందుకు భిన్నంగా వ్యవహరించడం విమర్శలపాలవుతోంది. పైగా ఇప్పుడు సమీర్‌శర్మ పొడిగింపు మీద ఉన్న అధికారి అని, ఏబీ సర్వీసులో ఉన్న అధికారి అన్న విషయాన్ని విస్మరించకూడదన్న వ్యాఖ్యలు ఐఎఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏబీ.. సీఎస్ వద్దకు వెళ్లిన రెండుసార్లు అపాయింట్‌మెంట్ ఇవ్వలేద ంటే.. సీఎఎస్‌కు సీఎం నుంచి, ఎలాంటి ఆదేశాలూ రానట్లు మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. అయితే ఆదేశాలిచ్చింది స్వయంగా సుప్రీంకోర్టు కాబట్టి, స్పందించాల్సింది సీఎం కాదు, తానే అన్న స్పృహ సీఎస్‌కు రాకపోవడమే ఆశ్చర్యం.
రేపు ఒకవేళ ఏబీ కోర్ఠు ధిక్కరణ కేసు వేస్తే హాజరవడంతోపాటు, దాని మంచి చెడులకు బాధ్యత వహించాల్సింది కూడా సీఎస్ తప్ప.. సీఎం కాదన్నది విస్మరించటం మరో ఆశ్చర్యం. సచివాలయంలోని సీఎస్ ఆఫీసు ప్రభుత్వానిది. కాబట్టి సీఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వస్తే కలవడం సంప్రదాయం. కానీ, వస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం మాజీ సీఎస్ ఎల్వీ చెప్పినట్లు మంచి సంప్రదాయం కాదు. రాజుల కాలం నుంచి ప్రజాస్వామ్యయుగంలోకి వచ్చామని గుర్తించకపోవడం దారుణం. సీఎస్ తన ఇంటికి ఎవరు రావాలి? ఎవరు రావద్దని అని నిర్ణయించడం ఆయన హక్కు. కానీ, సచివాలయంలో ఉన్నది ప్రభుత్వ కార్యాలయం అని అధికారులు గుర్తు చేస్తున్నారు.