Home » జగన్‌కు తల్లి ఝలక్!

జగన్‌కు తల్లి ఝలక్!

– షర్మిలకే ఓటు వేయమని విజయమ్మ పిలుపు
– అవినాష్‌ను ఓడించమని చెప్పిన జగన్ తల్లి
– జగన్‌ను గెలిపించాలని కోరని వైచిత్రి
– జగన్‌ను సీఎంను చేయమని కోరని తల్లి
– కూతురుకే ఓటేసిన తల్లి
– ఇది కోడలు భారతీరెడ్డికి వ్యతిరేకమంటూ సోషల్‌మీడియాలో ట్రోలింగ్
– – కన్న తల్లే జగన్ సీఎం కావాలని కోరుకోవడం లేదంటూ కామెంట్లు
– వైఎస్ కుటుంబమంతా షర్మిల వైపే
– జగన్-భారతీ మాత్రమే ఒకవైపు
– జగన్-అవినాష్‌కు ప్రచారం చేస్తున్న భారతీరెడ్డి
– ఎట్టకేలకూ తేలిన ‘పులివెందుల పంచాయతీ‘
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘పులివెందుల పంచాయతీ’ని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భార్య విజయమ్మ తన తీర్పుతో తేల్చేశారు. తాను బిడ్డవైపే ఉన్నానని చెప్పి, వైఎస్ కుటుంబ కథకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేశారు. ఇన్నాళ్లూ అటు కొడుకు జగన్, ఇటు కూతురు షర్మిలారెడ్డి మధ్య ఊగిసలాడిన ఆ తల్లి కడకు కూతురువైపే మొగ్గుచూపి, కొడుకు జగన్‌కు ఝలక్ ఇవ్వడం వైసీపీకి షాక్ ఇచ్చింది. అటు రాహుల్ కూడా వైఎస్ మావాడేనని చెప్పి మరో ఝలక్ ఇచ్చారు. ఇలా ఒకే రోజు రెండు దెబ్బలు. ఇదీ పులివెందుల పంచాయితీలో కొత్త ట్విస్టు.

పోలింగుకు రెండురోజుల ముందు జగన్ నాయకత్వంలోని వైసీపీకి వజ్రాఘాతం-శరాఘాతం జమిలిగా తగిలాయి. కడప కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న తన బిడ్డ షర్మిలారెడ్డిని గెలిపించి, వైఎస్ ఆశయాలను బతికించాలంటూ వైసీపీ అధినేత-సీఎం జగన్ తల్లి విజయమ్మ ఇచ్చిన సందేశం, వైసీపీని నైతికం-రాజకీయంగా దెబ్బతీసింది. ఆ మేరకు ఆమె అమెరికా నుంచి పంపిన ఒక వీడియో సందేశం రాష్ట్రంలో చర్చనీయాంశమయింది.

ఇదే రోజు అనుకోకుండా కడప ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా ‘వైఎస్ మావాడే. వైఎస్ వ్యతిరేకించే బీజేపీకి జగన్ కేసుల భయంతో మద్దతునిసున్నార’ంటూ విమర్శించడం రాజకీయంగా మరో శరాఘాతం. ఇలా ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగలడం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసింది.

‘‘నా పేరు విజయలక్ష్మి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు.

వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. వైఎస్సార్‌బిడ్డ షర్మిలమ్మను గెలిపించి, పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నా’’నంటూ ఒక వీడియో విడుదల చేశారు. విజయమ్మ ప్రస్తుతం అమెరికాలోని షర్మిల కొడుకు దగ్గర ఉంటున్నారు.

సరిగ్గా పోలింగ్‌కు రెండురోజుల ముందు విజయమ్మ విడుదల చేసిన ఈ వీడియో, కడపలో కొడుకు-కోడలు మద్దతునిస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్ధి అవినాష్‌రెడ్డి విజయావకాశాలను, దారుణంగా దెబ్బతీసినట్టయింది. కొద్దిరోజుల క్రితమే దివంగత వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ కూడా.. షర్మిలకే ఓటు వేసి, న్యాయాన్ని గెలిపించాలని ఎన్నికల సభలో కోరారు. జగన్ బావ బ్రదర్ అనిల్ కూడా విశాఖ జిల్లాలో జగన్‌కు వ్యతిరేకంగా క్రైస్తవ మత పెద్దలతో సమావేశాలు నిర్వహించారు.

దీనితో వైఎస్ కుటుంబంలో జగన్-భారతీరెడ్డి ఒకవైపు విజయమ్మ-షర్మిల-అనిల్- సౌభాగ్యమ్మ-డాక్టర్ సునీత మరోవైపు నిలిచినట్లు స్పష్టమయింది. కాగా పులివెందులలో తన భర్త జగన్, ఎంపి అభ్యర్ధి మేనబావ అవినాష్‌రెడ్డి విజయం కోసం భారతీరెడ్డి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జగన్ తల్లి విజయమ్మ.. తన కూతురు షర్మిలను ఎంపీగా గెలిపించాలని ప్రత్యక్షంగా, అవినాష్‌రెడ్డిని ఓడించాలని పరోక్షంగా ఇచ్చిన పిలుపుతో జగన్ ఒంటరివాడయినట్టయింది. ఎంపీగా పోటీ చేస్తున్న తన బిడ్డ షర్మిలకు ఓటేయమని చెప్పిన విజయమ్మ.. పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న కొడుకు జగన్‌కు మాత్రం, ఓటేయాలని చెప్పకపోవడం చర్చనీయాంశమయింది.

ఇటీవల తన కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పిన విజయమ్మ, ఇంటి పోరు పడలేక అమెరికా వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం కొడుకును గెలిపించాలని కనీసం మొహమాటానికి కూడా కోరకపోవడం చూస్తే, జగన్ సీఎం కావడం సొంత తల్లికే ఇష్టం లేదన్న సంకేతాలు వెళ్లడం ఆయనను నైతికంగా ఇబ్బందికర పరిణామమే.

విజయమ్మ తాజా వీడియోపై సోషల్‌మీడియాలో కూటమి సైనికులు చెలరేగిపోయి, జగన్-వైసీపీని యమా ట్రోలింగ్ చేస్తున్నారు. ‘‘ ఊళ్లోవాళ్లందరినీ నా అక్క చెల్లెమ్మలు అని చెప్పుకునే జగన్ వెంట, ఇప్పుడు సొంత అక్క చెల్లెళ్లే కాదు. తల్లి కూడా లేదు. తల్లీ, చెల్లెమ్మలే నమ్మని జగన్‌ను ఇక బయట మహిళలు ఎలా నమ్ముతార’ని ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు.

‘విజయమ్మ సందేశం తన కోడలు భారతీరెడ్డికి వ్యతిరేకంగా ఉంది. కోడలు మద్దుతిస్తున్న అవినాష్‌రెడ్డిని ఓడించి, కూతురు షర్మిలనే గెలిపించాలని విజయమ్మ స్పష్టంగా చె ప్పిన తర్వాత, ఇక వైఎస్సార్ అభిమానులు అవినాష్‌కు ఎందుకు ఓటేస్తారు’ అని ప్రశ్నిస్తున్నారు.

‘తల్లి కనీసం కొడుకును గెలిపించమని కూడా కోరలేదంటే, జగన్‌ను తల్లి కూడా నమ్మడం లేదని కనిపిస్తూనే ఉంది. అంటే కొడుకు సీఎం కావడం చివరకు తల్లి విజయమ్మకూ ఇష్టం లేదన్నమాట. కన్నతల్లే జగన్‌కు ఓటేయమని చెప్పలేద ంటే ఇక అవ్వాతాతలు, అమ్మలు వైసీపీకి ఓటెలా వేస్తారు? లేటయినా విజయమ్మ లేటుస్టుగా జగన్‌కు ఓటేయద్దని ప్రజలకు చెప్పారు’’ అని సోషల్‌మీడియా సైనికులు ఫలితాలకు ముందే తీర్పులిచ్చేస్తున్నారు.

ఏదేమైనా తాజా పరిణామాలు, వైసీపీ పరాజయానికి మరో ప్రధాన కారణం కాబోతోంది. జగన్ తన సొంత జిల్లాలో.. తనను సవాల్ చేసి కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలబడిన షర్మిల ఎంపీగా గెలిస్తే, అది ఆయనకు అప్రతిష్ఠనే. పైగా పులివెందులలో తనకు ఓటు వేయమని, కనీసం మాటమాత్రమైనా చెప్పని విజయమ్మ తీరుతో.. వైఎస్‌ను అభిమానించే పులివెందుల ఓటర్లు, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ప్రమాదం కనిపిస్తోంది. ఇవన్నీ నేతగా జగన్‌కు.. పార్టీగా వైసీపీకి నైతికంగా-రాజకీయంగా ఎదురు దెబ్బేనన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

Leave a Reply