-
పోలీస్ హౌసింగ్ కార్పోషన్ చైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు
-
ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్
-
ఢిల్లీ ఏపీభవన్ ఇన్చార్జిగా ఉత్తర్వు
-
ఏబీకి సలహాదారు పదవి ఇస్తారన్న అంచనా
-
ఏబీవీ ఆ బాధ్యతలు స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా?
-
చేరకుండా మౌనంగా ఉండిపోతారా?
-
చేరి ఆ పదవికి రాజీనామా చేస్తారా?
-
గతంలో ఇదే హోదాలో పనిచేసిన నాగుర్‌మీరా
-
ఏబీకి తగిన హోదా కాదంటూ టీడీపీ సైనికుల పోస్టింగులు
-
జగన్ జమానాలో ఆర్టీసీ ఎండీ, విజిలెన్స్ కమిషనర్‌గా చేసిన ఠాకూర్
-
జగన్ కక్షకు పోస్టింగ్ లేకుండా బలైపోయిన ఏబీ వెంకటేశ్వరరావు
-
ఏబీ సహ బాధితుడు పునేఠాకు విజిలెన్స్ కమిషనర్ పోస్టు
-
ద్వారకా రిటైరైన మరుసటి రోజునే ఆర్టీసీ ఎండీ పోస్టింగ్
-
ఏబీకి అప్రధాన్య కార్పొరేషన్ చైర్మన్ పదవా అంటూ పెదవి విరుపు
-
దీనికంటే బాబుగారు పిలిచి భోజనం పెట్టి పంపినా గౌరవంగా ఉండేదంటూ పోస్టింగులు
-
చేరవద్దంటూ సోషల్‌మీడియాలో పోస్టింగుల వెల్లువ
-
ఏబీకి అవమానంపై కమ్మ సంఘాల కన్నెర్ర
-
అందరి చూపూ ఏబీ వైపే
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ ఇది చంద్రబాబు స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఈ పోస్టింగ్ కంటే బాబుగారు ఏబీ వెంకటేశ్వరరావును ఇంటికి భోజనానికి పిలిచి బట్టలు పెట్టి ఉంటే బాగుండేది. ఏబీ గారు ఈ పోస్టు ఆమోదిస్తారనుకోను. పెద్ద గుమాస్తా పోస్టు ఇది’’
– మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌గా నియమిస్తూ ఉత్తర్వు వెలువడిన తర్వాత, కొసరాజు రాజేశ్వరరావు అనే వ్యక్తి టీడీపీ సోషల్‌మీడియా గ్రూపులలో పెట్టిన పోస్టు ఇది.
ఏబీవీ.. ఏబీ వెంకటేశ్వరరావు.. ఆలూరు బాల వెంకటేశ్వరరావుపై కూటమి సర్కారు ఎనిమిది నెలల తర్వాత విశాల హృదయంతో దయతలిచి.. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. ఇది గతంలో విజయవాడ నియోజకవర్గ నేత నాగుర్‌మీరా అనే నాయకుడికి ఇచ్చిన పదవి. దానికంటే ముందు ఎన్టీఆర్ జమానాలో, కంభంపాటి రామ్మోహన్‌రావుకు ఇచ్చిన పదవి. అసలు అది అప్రాధాన్యమైన కార్పొరేషన్ పదవి. దానికి నిధులేమీ ఉండవు. బుగ్గకారులో తిరగాల్సిందే.
మరి.. జగన్ ఐదేళ్ల జమానాలో ఆయనపై లీగల్‌వార్ చేసిన ఐపియస్ వారియర్.. డీజీపీ కావలసిన వ్యక్తి, జగన్ కులదురహంకార వేధింపులకు గురైన ఏబీ వెంకటేశ్వరరావు ఆ పదవిని తీసుకుంటారా? నాకు వ ద్దని తిరస్కరిస్తారా? పోనీ చేరి రాజీనామా చేస్తారా? అసలు చేరకుండా దూరంగా ఉంటారా?.. ఇంతకూ ఏబీవీ దారెటు?.. ఇదీ ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కేంద్రంగా నడుస్తున్న చర్చ. ప్రధానంగా టీడీపీ సోషల్‌మీడియా, కమ్మ సామాజికవర్గంలో నడుస్తున్న హాట్‌టాపిక్.
జగన్ ఐదేళ్ల జమానాలో ఆయన అహంకారాన్ని ప్రశ్నించి, కనీసం ఒక్కసారి కూడా ఎదుటపడి సెల్యూట్ చేయని.. ఏకైక ఐపిఎస్ అధికారిగా రికార్డు సృష్టించిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును, ఏపి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ జారీ చే సిన ఉత్తర్వు చర్చనీయాంశమయింది. తొలుత జీఓ నెంబర్ లేకుండా విడుదలయిన ఉత్తర్వు కొంత గందరగోళం రేపినా, తర్వాత ప్రభుత్వ వెబ్‌సైట్ ఉత్తర్వులో జీఓ నెంబర్ ఉటంకించారు. అంటే మొత్తానికి కూటమి సర్కారు ఏబీని ఎనిమిది నెలల తర్వాత కరుణించిందన్నమాట.
ఇదే సమయంలో మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ వెలువడిన మరో ఉత్తర్వు చర్చనీయాంశమయింది. ఆయనకు ఢిల్లీలో ఏపీభవన్ ఇన్చార్జిగా ఉత్తర్వులు ఇచ్చారు. నిజానికి జగన్ బాధితుడైన ఏబీకి సలహాదారు పదవి ఇస్తారని పార్టీ వర్గాలు భావించాయి. విభజన తర్వాత టీడీపీ హయాంలో డీజీపీగా పనిచేసిన ఠాకూర్‌ను, జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీ ఎండీగా నియమించారు. రిటైరయిన తర్వాత ఆయనను విజిలెన్స్ కమిషనర్‌గా నియమించింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకూ ఆయన, జగన్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించారు. అంటే ఆయన జగన్ బాధితుడు కాదన్నది సుస్పష్టమని పోలీసు వర్గాలు, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు స్పష్టం చేస్తున్నారు.
తర్వాత టీడీపీ విజయం కోసం ఆయనతోపాటు రిటైర్డ్ డీజీ ఏబీ, రిటైర్డ్ ఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ తెరవెనుక పనిచేశారని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఠాకూర్, ఘట్టమనేని.. సీఐ, డీఎస్పీ, ఎస్పీ పోస్టింగుల్లో కీలకపాత్ర పోషించారని, కీలకనేత ఆఫీసుతో సమన్వయం చేసుకుని బదిలీలలో చేసిన వడపోత ఆధారంగానే, పోలీసు అధికారులకు పోస్టింగులు దక్కాయని, చివరకు టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖలను కూడా తిరస్కరించారన్న ప్రచారం, వైసీపీ అధికార మీడియాలో జరిగిన విషయం తెలిసిందే. కొన్ని జోన్‌లలో వారు తమకు కావలసిన వారినే ఐజిలుగా నియమించారని, ఉత్తరాది ఐపిఎస్‌ల నియామకంలో వారే కీలకపాత్ర పోషించాన్న విమర్హలు వైసీపీ అధికార మీడియాలో వచ్చాయి. అయితే వైసీపీ అధికార మీడియాలో ఆ అంశానికి సంబంధించి ఏబీ పేరు వచ్చినప్పటికీ, అందులో ఆయన పాత్రలేదన్నది తర్వాత స్పష్టమయింది.
ఈ క్రమంలో ఏబీకి వ్యతిరేకంగా జగన్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను, కూటమి సర్కారు ఉపసంహరించుకుంది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని పనిచేసినట్లుగా ఉత్తర్వులిచ్చింది. అది ఇచ్చిన కొద్దిరోజులకు… తాజాగా పోలీసు హౌసింగ్ కార్మొరేషన్ చైర్మన్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై, తీవ్రస్థాయిలో చర్చ మొదలయింది. జగన్ దురహంకారం వల్ల డీజీపీ కావలసిన ఏబీకి, ఎలాంటి ప్రాధాన్యం లేని పోలీసు హౌసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడమేమిటి? జగన్ హయాంలో కూడా అన్ని పదవులను అనుభవించిన ఠాకూర్‌కు, ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడమేమిటి? తెలుగువాడికి ఇచ్చే గౌరవం ఇదేనా? సలహాదారుగా తెలుగువాడు పనికిరారా? పార్టీ కోసం పనిచేసి బలైన వారికి ఇచ్చే బహుమతి ఇదేనా? మరి ఏబీ ఆ పదవి తీసుకుంటారా? లేదా? అన్నది ఆ చర్చల సారాంశం.
అంటే ఏబీ ఆ పదవి తీసుకుంటారా? తీసుకుని రాజీనామా చేస్తారా? అసలు చేరకుండా ఉంటారా? అన్న చర్చ సోషల్‌మీడియా వేదికగా జరుగుతోంది. ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది కాబట్టి, ప్రభుత్వనిర్ణయాన్ని గౌరవిస్తూ ..చార్జి తీసుకుని తర్వాత వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తారా? లేక అసలు చేరకుండానే మౌనంగా ఉంటారా? అన్న చర్చ జరుగుతోంది.
ఎందుకంటే మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా, ఇదే తరహాలో ఇప్పటిదాకా కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పటికీ చార్జి తీసుకోలేదు. మంత్రిగా పనిచేసిన తనకు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడంపై అసంతృప్తితో ఉండటమే దానికి కారణమంటున్నారు. అదే తరహాలో ఏబీ కూడా చార్జి తీసుకోకుండా, తన పరోక్ష అసంతృప్తి వ్యక్తం చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా కమ్మవర్గానికి చెందిన సోషల్‌మీడియా గ్రూపులలో విపరీతమైన చర్చకు తెరలేచింది. ఏబీ వెంకటేశ్వరరావు వంటి సీనియర్ ఐపిఎస్ అధికారి, త నకు ఆదేశాలిచ్చిన పాలకుల అంచనా వేయడంలో విఫలమయ్యారన్నదే ఆ చర్చ సారాంశం.
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పార్టీకి ఎలాంటి సేవలు చేయని మాజీ ఐఏఎస్ లక్ష్మీపార్ధసారధికి మొదటి పోస్టింగ్ ఇచ్చారు.ఆమె పార్టీకి చేసిన సేవలంటో తెలియదు. గత ఎన్నికల్లో ఏబీతో పాటు బాధితుడైన పునేఠాకు విజిలెన్స్ కమిషనర్ పోస్టింగ్ ఇచ్చారు. మంచిదే. ఆయన అందుకు అర్హుడే. రామారావు అనే మాజీ అధికారికి పోస్టింగ్ ఇచ్చారు. జగన్ జమానాలో అన్ని పదవులు అనుభవించిన ఐఏఎస్ అధికారి రాజశేఖర్‌కు, రిటైరయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా డీజీపీగా పదవీ విరమణ చేసిన, ఏబీ బ్యాచ్‌కే చెందిన ద్వారకా తిరుమలరావుకు మరుసటి రొజునే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు.
కానీ టీడీపీతో అంటకాగి, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించారన్న కారణంతో.. జగన్ పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిన ఏబీ వెంకటేశ్వరరావును మాత్రం ఇప్పటిదాకా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యం లేని, అసలు ఎలాంటి బడ్జెట్ లేని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టింగ్ ఇస్తే.. అది ఆయనను గౌరవించినట్లా? అవమానించినట్లా?’’ అని కమ్మ సంఘాలు సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడుతున్నాయి.
అసలు ఏబీ ఎవరి కోసం బలయ్యారు? టీడీపీ ముద్ర లేకపోతే ఆయన కూడా ఠాకూర్ మాదిరిగానే ఆర్టీసీ చైర్మన్ అయి, రిటైరయిన తర్వాత విజిలెన్స్ కమిషనర్ అయ్యేవారు కదా? జగన్‌తో రాజీ పడి ఉంటే సతీష్‌చంద్ర మాదిరిగా మంచి పోస్టింగే ఇచ్చేవారు కదా? డీజీపీ కూడా అయ్యేవారు కదా? 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్పించే ప్రక్రియలో ఏబీవీ భాగస్వామి అయిన సతీష్‌చంద్రకు పోస్టింగ్ ఇచ్చిన జగన్, మరి ఏబీకి మాత్రం పోస్టింగ్ ఇవ్వకపోవడానికి కారణం, ఆయన కమ్మవాడన్న కోపమే కదా? అంటే కేవలం పార్టీకి పనిచేసినందుకే ఏబీ బలయితే మరి పార్టీ చేసిన న్యాయమేంటి? ఇలాగైతే భవిష్యత్తులో పార్టీని ఎవరు మాత్రం ఎందుకు ఓన్ చేసుకుంటార’’ంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. భవిష్యత్ పరిణామాలు తెలియకుండా అత్యుత్సాహంతో పనిచేసిన ఏబీ.. బహుశా తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతుందని ఊహించి ఉండకపోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో ఆయన తప్పు కూడా లేకపోలేదంటున్నారు.
‘బహుశా కృష్ణా జిల్లా కమ్మవాళ్లు చాలా ముదుర్లు. ఒక తరం ముందు ఆలోచించేవాళ్లన్న కోణంలో ఏబీని విస్మరించి ఉండవచ్చు. పైగా ఆయనకు గత ఆరు నెలల కాలంలో క మ్మ సంఘాల నుంచి ఆహ్వానాలందుతున్నాయి. దానితో ఆయనకు కులంలో మద్దతు-సానుభూతి పెరుగుతుండటం కూడా, కొంత ఇబ్బందికరంగా అనిపించవ చ్చ వచ్చు. అందుకే ఆయనకు ఏదో ఒక పదవి ఇచ్చానమనిపించుకునేందుకే ఈ చైర్మన్ పదవి ఇచ్చినట్లుంది. నిజానికి ఇది ఇది విజయవాడ పశ్చిమ టీడీపీ నేత నాగుర్‌మీరా చేసిన పోస్టు. మరి ఇది డీజీపీ స్థాయి అధికారి అయిన ఏబీకి తగినదా? ఠాకూర్‌కు సలహాదారు, ద్వారాకా తిరుమలరావు పోస్టు ఇచ్చిన ప్రభుత్వం అదే స్థాయిలో జగన్ బాధితుడైన ఏబీని ఎందుకు గౌరవించదు? ఆయన త్యాగాలు,ఈపోరాటాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోదం’టూ, కమ్మ సంఘాలు సోషల్ మీడియాలో పోస్టింగుల పర్వానికి తెరలేపాయి.