Suryaa.co.in

Editorial

ఏబీవీ… ఎందుకలా?

  • ఏబీవీ ఆ పదవి ఎందుకు వద్దంటున్నారు?

  • పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమాకం

  • ఉత్తర్వులు ఇచ్చి పదిరోజులు దాటినా ఇంకా చార్జి తీసుకోని ఏబీ వెంకటేశ్వరరావు

  • ఆ కార్పొరేషన్‌కు ఇన్చార్జి ఎండిగా ఐజి మోహన్‌రావు

  • డీజీ స్థాయిలో రిటైరయిన ఏబీ వెంకటేశ్వరరావు

  • ఐజి కింద డీజీ పనిచేస్తారా అంటున్న టీడీపీ సోషల్‌మీడియా దళాలు

  • ఏబీవీకి ఎండితోపాటు, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటున్న పార్టీ సీనియర్లు

  • జగన్ కేసులు సహా వైసీపీ కేసులు ఆయనకే అప్పగించాలంటున్న పార్టీ నేతలు

  • ఆ పర్యవేక్షణ లేకనే వైసీపీ నేతలుతప్పించుకుంటారన్న వ్యాఖ్యలు

  • వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోవడంపై పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి

  • వీటికి ఏబీని ప్రయోగించడమే రైటు అంటున్న పార్టీ వర్గాలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్‌పై నదురు బెదురు లేకుండా ఐదేళ్లు న్యాయసమరం చేసి.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక్కసారి కూడా కలవని డీజీగా చరిత్ర సృష్టించిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు.. ప్రభుత్వం అప్పగించిన పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఇప్పటివరకూ ఎందుకు చేరలేదు? చార్జి తీసుకునేందుకు ఆయన ఎందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదు? దానిపై ఆయన తన మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు ఇంకా ఎందుకు తీసుకుంటున్నారు? అసలు ఏబీ కోరుకున్నదేమిటి? సర్కారు ఇచ్చిందేమిటి? ఆ తరహా పదవిని ఏబీ కోరుకున్నారా? లేక సర్కారు కూడా ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్లు చేసిందా? లేక ఈ విషయంలో చంద్రబాబును ఏ అధికారయినా తప్పుదోవపట్టించారా? అసలు ఏబీ ఎందుకు ఆ పదవి తీసుకోవడం లేదు?.. ఇదీ ఇప్పుడు పోలీసు,రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్.

మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ, ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో మాజీ డీజీపీ ఠాకూర్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించి, ఆయనను ఢిల్లీలోని ఏపీభవన్‌కు ఇన్చార్జిగా నియమించిన విషయం తెలిసిందే.

అందులో ఏబీ ఐదేళ్ల జగన్ హయాంలో వేధింపులు ఎదుర్కొన్న అధికారి. కాగా ఠాకూర్ ఆర్టీసీ ఎండిగా పదవీవిరమణ చేసిన తర్వాత , జగన్ ప్రభుత్వం ఆయనను విజిలెన్స్ కమిషనర్‌గా నియమించింది. అంటే ఎన్నికలకు కొద్దినెలల ముందు వరకూ ఠాకూర్, వైసీసీ సర్కారులో అన్ని అధికారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుభవించారన్నమాట.

కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. పార్టీ కోసం కష్టపడిన పోలిట్‌బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్, మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, వైసీపీపై యుద్ధం ప్రకటించి జగన్‌తో చావోరేవో తేల్చుకున్న మాజీ ఎంపి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవి, ఇతరులకు సలహాదారు పదవులిచ్చి కూటమి సర్కారు అందలమెక్కిస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. ఎందుకంటే విపక్షంలో వారు పోషించిన పాత్ర అలాంటిది కాబట్టి!

ఇక చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలం పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావును జగన్ ప్రభుత్వం వె ంటాడింది. సస్పెండ్ చేసింది. ఐటికి ఫిర్యాదు చేసింది. ఆయన ఇంటిపై ఐటి దాడులు చేసింది. పోలీసులు శ్రీనివాస్ ఇంటికి అర్ధరాత్రి వెళ్లి మరీ వేధించేవారు. దానితో జగన్ వేధింపులకు తాళలేక, ఏడాదిన్నరపాటు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన విషాదం. శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, ఆయన ద్వారా చంద్రబాబును ఇరికించాలన్నది నాటి జగన్ సర్కారు అసలు లక్ష ్యం.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్‌ను పిలిచి పెద్దపీట వేస్తారని పార్టీ సీనియర్లు భావించారు. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి. అంతేకాదు. సీనియర్లు, ఎమ్మెల్యేలు ఎవరూ బాబు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తి చెందకుండా.. బాబు వెళ్లే సమయంలోనో, వచ్చే సమయంలోనలో వారిని ఆయనతో కలిపించేవారు.

పార్టీ-ప్రభుత్వానికి ముఖ్యమైన వ్యక్తులెవరో తెలిసినందున, వారికి బాబుతో అపాయింట్‌మెంట్లు ఇప్పించేవారు. అందుకే శ్రీనివాస్ ఉన్నంతవరకూ చంద్రబాబు అపాయింట్‌మెంట్ల విషయంలో ఎవరికీ సమస్యలు-ఫిర్యాదులు వచ్చేవి కావు. కానీ జగన్ ప్రభుత్వం శ్రీనివాస్‌పై విధించిన సస్పెన్షన్‌ను తొలగించేందుకే దాదాపు మూడున్నర నెలల సమయం పట్టడం ఆశ్చర్యం. పోనీ తర్వాతయినా శ్రీనివాస్‌ను సీఎంఓలో తీసుకుంటారని పార్టీ సీనియర్లు భావించారు. కానీ ఆయన తన ప్లానింగ్ డిపార్టుమెంట్‌లో చేరి, ఇప్పటికీ సెలవుపై కొనసాగుతుండటం మరో ఆశ్చర్యం.

తొలుత రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్‌గా నియమించడం చాలామందికి రుచించలేదు. నిజానికి ఆయనకు మంత్రి పదవి లేదా స్పీకర్ ఇస్తారని చాలామంది ఆశించారు.విపక్షంలో జగన్‌పై ఆయన చేసిన యుద్ధం అలాంటి ఇమేజ్‌కు కారణమయింది.

ఇక సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తూ, అధినేత మనసెరిగి నేతలతో సమన్వయం చేసే టిడి జనార్దన్‌కు, ఇప్పటివరకూ ఎలాంటి పదవి రాకపోవడం పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది. నిజానికి ఆయనకు సలహాదారు ఇస్తారని పార్టీ వర్గాలు భావించాయి. ఎన్నికల ముందు వివిధ కులాలు, మతాలపై ప్రభావితం చూపే నేతలను బుజ్జగించి వారిని బాబుతో భేటీలు వేయించడంలో టీడీ కీలకపాత్ర పోషించారు. అయితే చంద్రబాబు రాజకీయ కార్యదర్శిగా ఉన్న టీడీ వీటికి అతీతంగా, ఇవేమీ పట్టించుకోకుండా తనకు అప్పగించిన పని చేస్తుండటం విశేషం.

ఇక జగన్‌పై పెద్ద యుద్ధమే చేసిన ఏబీని పదవీ విరమణ తర్వాత కీకల పదవితో గౌరవిస్తారని పోలీసు, పార్టీ వర్గాలు అంచనా వేశాయి. దానికంటే ముందు.. ఆయనపై జగన్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఆగమేఘాలపై తొలగిస్తుందని ఆశించారు. ఆశ్చర్యకరంగా కూటమి సర్కారు ఏర్పడిన ఆరునెలల వరకూ, ఆయనకు ప్రభుత్వపరంగా దక్కవలసిన ఆర్ధిక ప్రయోజనాలు కూడా దక్కలేదు.

నిజానికి రఘురామకృష్ణంరాజు, ఏబీ వెంకటేశ్వరరావు పక్షాన సోషల్‌మీడియా సైనికులు తీవ్రంగా పోరాడారు. వారికి ఎప్పుడు న్యాయ చేస్తారని ప్రశ్నించారు. టిడి జనార్దన్‌కు మాత్రం పార్టీ శ్రేణుల సానుభూతి ఉంది. ఈ మధ్య కాలంలో ఏబీ వెంకటే శ్వరరావు కమ్మ సంఘాల సమ్మేళనాలకు హాజరుకావడం, కమ్మ వారు ఎవరిపై ఆధారపడకుండా-ఎవరినీ నమ్మకుండా సొంతకాళ్లపై ఎదగడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోవడమంటే చావుతో సమానమని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఆ సందర్భంలో కమ్మ నేతలు సైతం.. ‘‘ఏబీని ఈ ప్రభుత్వం ఎందుకు గౌరవించడం లేదు? ఆయన కులమే అందుకు అడ్డు అయితే ఆ విషయాన్ని నేరుగా చెప్పేయండి. ఆ తర్వాత మేం ఏం చేయాలో ఆలోచించుకుంటాం. జగన్‌కు అప్పుడే ఆయన సరెండర్ అయితే డీజీపీ ఇచ్చేవారు. కానీ ధైర్యంగా జగన్‌తో పోరాడినందుకు ఏబీకి ఇచ్చే గౌరవం ఇదేనా? అవసరమైతే మేము ఆయన కోసం రోడ్డెక్కుతామ’’ని వేదికలపైనే అగ్గిరాముళ్లవడం, సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కార్యకర్తల మనోభావాలు గుర్తించిన కూటమి సర్కారు.. ఏబీని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన ఇప్పటి వరకూ ఆ పదవి తీసుకోలేదు. దానిపై కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏబీకి న్యాయం చేశారని, ఆయన ఆ పదవి తీసుకుంటే జగన్ పాలనలో వేధింపులకు గురయిన తమలాంటి వారికి న్యాయం జరుగుతుందని చాలామంది పోలీసు అధికారులు సంబరపడ్డారు. ఆ కోణంలో ఆలోచించి ఏబీ చార్జి తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.

అయితే పార్టీకి చెందిన కొందరు మాత్రం ఏబీని కొంతమంది పక్కదారిపట్టిస్తున్నట్లు కనిపిస్తోందని, ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా, వాస్తవ పరిస్థితిని గ్రహించి చార్జి తీసుకుంటే బాగుందని సూచిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏదో ఆశించి భంగపడుతున్న వారే ఆయనను తప్పుదోవపట్టిస్తున్నారంటున్నారు.

మరికొందరు మాత్రం, జగన్‌తో యుద్ధం చేసిన వ్యక్తికి ప్రాధాన్యం లేని చిన్న కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని వాదిస్తున్నారు.
అయితే పార్టీ సీనియర్లు, పోలీసు వర్గాలు మాత్రం, ఏబీకి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం అభినందనీయమే అయినప్పటికీ.. ఎండిగా కూడా ఆయననే కొనసాగిస్తే, ఏబీ సేవలను గౌరవించినట్లు ఉండేదని సూచిస్తున్నారు.

ఎందుకంటే కార్పొరేషన్‌కు ఐజి స్థాయి అధికారి ఎండిగా ఉన్నారు. మరి డీజీగా రిటైర్ అయిన వ్యక్తి, తనకంటే చిన్నస్థాయి అధికారి కింద ఎలా పనిచేయగలరు? ఈ విషయం ఏబీకి ఆ చైర్మన్ పదవి సూచించిన సీఎంఓ అధికారులకు తెలియదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏబీని చైర్మన్-ఎండిగా నియమించి ఉంటే, ఆయన ఆ పదవి తీసుకునేవారేనని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గౌరవం అనేది పరిపూర్ణంగా ఉండాలి కదా? ఎదుటివారికీ అది తనను గుర్తించారన్న భావన కల్పించాలి కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే మరికొందరు చైర్మన్‌తోపాటు క్యాబినెట్ హోదా ఇచ్చి ఉంటే, ఏబీ సేవలకు సరైన గుర్తింపు ఇచ్చినట్లు ఉండేదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటిదాకా కార్పొరేషన్ చైర్మన్లకు క్యాబినెట్ హోదా ఇవ్వలేదని మరికొందరు గుర్తు చేస్తున్నారు.

‘‘ఏబీకి క్యాబినెట్ హోదానో, కార్పొరేషన్ చైర్మన్-ఎండీగానో నియమించి.. జగన్ కేసులతోపాటు, వైసీపీ హయాంలో పార్టీ నేతలను వేధించిన వారి కేసులను అప్పగిస్తే బాగుంటుంది. ఎందుకంటే అతను జగన్ బాధితుడు కాబట్టి, ఆయనకు ఉండే కసి మిగిలిన వారికి సహజంగా ఉండదు. ఇప్పుడు సీఎంఓలో ఉన్న అధికారులతో సహా ఏ అధికారి జగన్ బాధితులు కాదు. కాబట్టి వారికి జగన్‌పై పెద్ద కోపం ఉండదు. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఇంకా వైసీపీ వారికే పనులు అవుతున్నాయి.. వారికే పోస్టింగులు ఇస్తున్నారన్న కార్యకర్తల అసంతృప్తి, టీడీపీ నేతలపై దాడులు చేసిన వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం లేదన్న అసంతృప్తి వ్యవహారాన్ని కూడా ఏబీకే అప్పగిస్తే, పార్టీపై చాలా భారం తగ్గుతుంది. ఎందుకంటే ఐపిఎస్, ఐఏఎస్‌లలో ఎవరు ఏ పార్టీకి పనిచేశారన్న విషయం ఇప్పుడున్న వారిలో ఏబీకే తెలుసు. మరి బాబుగారు ఏ నిర్ణయం తీసుకుంటారో తె లియదు. ఏదేమైనా ఓసారి ఆయనను పిలిపించి మాట్లాడితే గౌరవంగా ఉంటుంద’’ని ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉండగా.. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. నిజానికి ఏబీకి ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు, సీఎంఓలోని ఓ కీలకనేతకు సూచించగా… ‘‘బీసీ అయిన ద్వారకా తిరుమలరావుకు ఆ పదవి ఇస్తే మంచి సంకేతాలు వెళతాయి. పైగా డీజీపీగా రిటైరయ్యారు కాబట్టి ఆర్టీసీ ఎండీ ఇవ్వడమే సబబుగా ఉంటుంద’’ని బాబుకు నచ్చచెప్పి, ద్వారాకాకు ఆర్టీసీ ఎండి, ఏబీకి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేలా బాబును ఒప్పించారన్న ప్రచారం జరుగుతోంది.

LEAVE A RESPONSE