Suryaa.co.in

Andhra Pradesh

అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

ప్రభుత్వ నిర్లక్ష్యానికి చిన్నారులు బలి
చిత్తూరు జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రంలో గుడ్డు తిని చిన్నారి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత
చిన్నారి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలి
-ఆచంట సునీత

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులు బలవుతున్నారు. అధికార పార్టీకి కమీషన్లపై ఉన్న శ్రద్ధ అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల నాణ్యతపై లేకుండాపోయింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుల్లెపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో నాశిరకం గుడ్డు తిని చిన్నారి మృతి చెందడం బాధాకరం. చిన్నారి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత. కొన్ని రోజుల క్రితం నెల్లూరు జిల్లాలోని ఓ అంగన్ వాడీ కేంద్రంలో నిల్వ ఉన్న ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆరోజే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ విషాదం జరిగి ఉండేది కాదు. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పనిచేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నాడు-నేడు కింద అంగన్ వాడీల రూపురేఖలు మార్చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. అంగన్ వాడీ సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. విద్యార్థులకు తాగడానికి మంచినీరు కూడా అందని పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. అంగన్ వాడీ సెంటర్లకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ. 110 కోట్లుపైగా బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో వారు తూతూ మంత్రంగా గుడ్డు సరఫరాపై దృష్టి పెట్టడం లేదు. కాంట్రాక్టర్ల దగ్గర నిల్వ ఉంటున్న గుడ్లు…అంగన్ వాడీ కేంద్రాల్లోనూ రోజుల తరబడి ఉండటంతో అవి విషంగా మారుతున్నాయి. గుడ్లు పాడవకుండా ఉండాలంటే ప్రతి వారం సరఫరా చేయాలని అంగన్ వాడీ సిబ్బంది ఎన్నిసార్లు మొరబెట్టుకుంటున్న ప్రభుత్వాధికారులు పట్టించుకోవడంలేదు. మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రూ. 50 లక్షలు పరిహారం అందించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి అంగన్ వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, పిల్లలకు నాణ్యమైన ఆహారం పంపిణీపై దృష్టి పెట్టాలి.

LEAVE A RESPONSE