ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన వర్ల రామయ్య

-గుడివాడ మండల దళిత తహశీల్దార్‌ శ్రీనివాసరావుపై మంత్రి కొడాలి నాని అనుచరుడు దాడిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు, బెదిరింపులు, ఆస్తుల విధ్వంసాలు పెరిగిపోయాయి. దళిత ఉద్యోగులపై అధికార వైసీపీ నేతల దాడులు విస్మయం కలిగిస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ మండల దళిత తహశీల్దార్‌పై 15 ఫిబ్రవరి 2022 న స్థానిక వైసిపి నాయకుడు పద్మా రెడ్డి దాడి చేసిన సంగతి మీకు తెలసు. సినిమా థియేటర్ ఓనర్ కు ఎన్.ఓ.సీ ఇవ్వనందుకు తహశీల్ధార్ పై మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, కొంతమంది పోలీసుల సమక్షంలో దాడి చేశారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై దాడి చేసి అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. చెప్పినట్లు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయపెట్టారు. దాడికి గురైన గుడివాడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు చాలా అవమానంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.

మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయంలో దాడి జరిగినందున పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని మంత్రి అనుచరులు శ్రీనివాసరావును బెదిరించారు. శ్రీనివాసరావుకు మేజిస్ట్రేట్ స్థాయి అధికారాలు ఉన్నప్పటికీ ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేయలేదు. దాడిని ప్రత్యక్షంగా చూసిన పోలీసు అధికారులు ‘సుమోటో’గా కేసు నమోదు చేయకుండా వ్రాతపూర్వక ఫిర్యాదు కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారికి వచ్చిన ఈ విధమైన పరిస్థితిపై మీ దృష్టికి తీసుకురావడం బాధాకరం. శ్రీనివాసరావు ఎస్సీ కులానికి చెందినవాడు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితిలో లేకపోవడం బాధాకరం.

స్వతంత్ర భారతావని 75వ సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నా కుల వివక్ష ఇంకా ఒక వాస్తవంగానే మిగిలి ఉంది. శ్రీనివాసరావుపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం ప్రకారమే కాకుండా ప్రభుత్వ అధికారి విధులు అడ్డుకోవడం, నేరపూరిత బెదిరింపులు చేయడం లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి. మీ పర్యవేక్షణలో కూడా ఈ ప్రభుత్వ ఆటవిక రాజ్య చర్యలు కొనసాగితే ప్రభుత్వ అధికారులు తమ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించడం అసాధ్యం. వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులపై నిరంతర దాడుల కారణంగా వారు నైతికతంగా అత్యల్ప స్థాయికి చేకుకున్నారు. ఈ నేపధ్యంలో శ్రీనివాసరావు నుంచి ఫిర్యాదు స్వీకరించి లేదా ‘సూమోమోటో’ కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసేలా పోలీసు శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తీసుకునే సత్వర చర్యలు ప్రభుత్వ అధికారుల మనోధైర్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. వారి విధులను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించడానికి దోహదం చేస్తుంది.

Leave a Reply