తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులతో కలిసి బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా దాతల సహకారంతో శిలాతోరణం, పద్మావతి విశ్రాంతి భవనాల సముదాయం, హెచ్‌విసి, బాలాజి నగర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 13 విశ్రాంతి భవనాల పనుల పురోగతిని పరిశీలించి, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం సిఆర్వో, ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా మరింత మెరుగైన పారిశుద్ద్య పనులు చేపట్టాలని ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు.
అంతకుముందు సిఆర్వో వద్ద టిటిడి అందిస్తున్న సౌకర్యాలను గురించి ఆయన భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత బాలాజి నగర్లో ఆర్టిసి బస్సుల ఎలక్ట్రిక్ చార్జీంగ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలం, శ్మశానం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
డెప్యూటీ ఈవోలు రమేష్‌బాబు, లోకనాథం, భాస్కర్, ఎస్టేట్ అధికారి మల్లిఖార్జున్, విజివో బాలిరెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డా.శ్రీదేవి, ఇఇలు జగన్మోహన్ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, గార్డెన్ సూపరిండెంట్ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.