అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ – కాంగ్రెస్ తూతూ మంత్రంగా డూప్ ఫైటింగ్

– తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. మోదీ మంత్రమే
– తెలంగాణ ప్రజల భవిష్యత్తును బీఆర్ఎస్ తాకట్టుపెట్టింది
– అవినీతి, కుటుంబ పార్టీలతో ఏనాడు కూడా బీజేపీ కలవలేదు.. కలవదు
– బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో ఖమ్మం జిల్లాకు కు చెందిన కాంగ్రెస్ నేతలు అంకిరెడ్డి సుదీర్ రెడ్డి, బొల్లపు సురేందర్ రెడ్డి చేరిక

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ డైరీ ఆవిష్కరించారు. 2024 నూతన సంవత్సర డైరీని బీజేపీ పార్టీ పీఆర్ఓ పరమేశ్వర్ కిషన్ రెడ్డి కి అందచేయడంతో డైరీ ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సుధీర్ రెడ్డి గారు, వారి మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. ఫిబ్రవరి నెలలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీలో చేరికల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో యువకులు, రైతులు, రైతు కూలీలు, మహిళలను పార్టీలో చేర్పించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన ప్రతి నాయకుడు 24 గంటల పాటు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీలో చేరేందుకు ఆహ్వానిస్తారు.

తెలంగాణలో పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూశాం.. అంతకుమందు అనేక సంవత్సరాలు, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. బీఆర్ఎస్ ను ఓడించాలనే పట్టుదలతో ప్రజలు తీర్పునిచ్చారు. అంతేకాని, కాంగ్రెస్ ను గెలిపించాలని కాదు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు పరిష్కారమవుతాయనే విశ్వాసం ప్రజలకు లేదు. అధికారంలోకి రాకముందు కేసీఆర్ కుటుంబం అవినీతి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై ఊరిఊరికి వెళ్లి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా డూప్ ఫైటింగ్ చేస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి అక్రమ లావాదేవీలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వాటిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉంది. కాని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు విచారణ జరిపలేదు. కాంగ్రెస్ పార్టీది అవినీతి, అక్రమాల చరిత్ర. అందుకే, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుంది. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. మోదీ మంత్రమే వినబడుతోంది. నరేంద్ర మోదీ కి మద్దతుగా నిలుస్తున్నారు. దేశ గౌరవం, అభివృద్ధి, ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలపాలని కోరుతున్నాను.

తెలంగాణలో సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, గ్రామస్థాయిలోని రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు దేశం కోసం బీజేపీలో చేరాల్సి అవసరం ఉంది. ఫిబ్రవరి నెలలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లోని ప్రజలను కలుస్తారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరాలని కోరుతున్నాను. తెలంగాణ ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల అవసరం లేదు. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరుతున్నాను. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమదూరంలో ఉంటూ.. ఆ పార్టీల అక్రమాల చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలను సంఘటితం చేస్తాం.

బీజేపీకి ఏ పార్టీతో సంబంధం లేదు.. తెలంగాణ సమాజంతో, దేశ ప్రజలతోనే బీజేపీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో కలిసిన చరిత్ర బీఆర్ఎస్ ది. బీజేపీ ఏనాడూ కాంగ్రెస్ తో కలవలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని దోపిడీ చేశాయి. అవినీతి, కుటుంబ పార్టీలతో ఏనాడు కూడా బీజేపీ కలవలేదు.. కలవదు.

Leave a Reply