Suryaa.co.in

Telangana

ఆర్గానిక్స్‌ పరిశ్రమ ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్‌రావు

-బాధ్యుతలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి
-రియాక్టర్లు తనిఖీ చేయకపోవటం వల్లే ఘటనలు
-కార్మికుల కుటుంబాలపై లాఠీచార్జీని ఖండిస్తున్నాం
-మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌

సంగారెడ్డి జిల్లా చందాపూర్‌ ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో గురువారం మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతూ చాలామంది చనిపోతున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదని, అధికారులు ఏడాది కొకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. క్షతగాత్రులు ఏఏ ఆస్పత్రుల్లో ఉన్నారో స్పష్టత లేదు… ఎంతమంది చనిపోయారో, ఎంతమంది గాయపడ్డారో కూడా తెలియటం లేదు..బాధితుల బాగోగులు ఎవరు చూస్తున్నారో కూడా తెలియడం లేదు.. మంత్రులొచ్చి లాంఛనంగా పరామర్శించడం కాదు.. చిత్తశుద్ధితో ఆదుకోవాలని కోరారు.

ప్రమాదానికి బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి 25 లక్షలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైద్య ఖర్చులను ప్రభుత్వం, కంపెనీ భరించి మృతదేహాలను స్వగ్రామానికి పంపడానికి అంబు లెన్సులు సమకూర్చి సాయం చేయాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిం చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల కుటుంబసభ్యులపై దురుసుగా ప్రవర్తించడం, పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధలో ఉన్న వారికి అండగా నిలబడి ఆదుకోవాలి తప్ప ఇలా వేధించడం సరికాదని హితవుపలికారు. తెలంగాణకు చెందిన బాధితులకు బీఆర్‌ఎస్‌ తరపున తాము సాయమందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా, రియాక్టర్లు పేలకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.

LEAVE A RESPONSE