Suryaa.co.in

అఖండ చైతన్యం
Devotional

అఖండ చైతన్యం

మానవ దేహం మోక్షానికి ద్వారం అని పెద్దలు చెప్తారు. ఐతే ఇది సార్థకం చేసుకోవటానికి ఏ జ్ఞానం తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా జీవితాన్ని వృధా చేసుకున్నప్పుడు మళ్ళీ అనేక జన్మలు పొందవలసి వుంటుంది.
అల్పమైన, అశాశ్వతమైన కోరికలతో సతమతమౌతూ మానవ జీవితం యొక్క విశిష్టత గుర్తించ కుండా సుదీర్ఘమైన ఈ ప్రయాణానికి గమ్యం ఏదో, గమ్యం చేరాలంటే ఏ ప్రయత్నం చేయాలో తెలుసు కోకుండా ఇతర జంతువుల వలెనే శరీర పోషణ కోసమూ, దేహ సౌఖ్యాల కోసమూ, భద్రతకోసమూ, ఇతర జీవులపై ఆధిపత్యం కోసమూ మనో, వాక్కాయ కర్మలు వృధా చేస్తూ పరిమితమైన తన జీవిత కాలాన్ని పూర్తిగా అందుకే వినియోగిస్తే 84 లక్షల జీవరాసులలో అరుదుగా లభించే మానవ జన్మ దుర్వినియోగ మైనట్లే.
అరుదైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జన్మ సఫలం చేసుకునే ప్రయత్నం చేయని వారికి రాబోతున్నాయి లక్షలాది జన్మలు. దుఃఖ భూయిష్టమైన పశు, పక్షి, క్రిమి, కీటక, సరీనృపాది జన్మలు. మళ్ళీ అత్యంత దుర్లభమైన మానవ జన్మ ఎప్పటికి సంక్రమిస్తుందో ఎవరు చెప్పగలరు.
దేహం గురించి కాదు పంచ భూతాలు నేనుకాదు. కనిపిస్తున్నదేదీ నేను కాదు. ఇంద్రియాలకు అందేది ఏదీ నేనుకాదు. ఊహించడానికి కూడా అలవికాని నేను ఎవర్ని? ఎలా వున్నాను? అని తెలుసుకొనే ప్రయత్నమే జ్ఞానం. అదే సాధన. అదే అభ్యాసము అని కూడా అనబడుతుంది.
ఈ దేహం ఏ పని చేస్తున్నా నేను వేరుగా వున్నాను అని గుర్తించాలి. ఇది కష్టం కాదుగదా! ఇంద్రియాలు వాటి క్రియా కలాపాలు సాగిస్తున్నప్పుడు, మనసులో ఆలోచనలు కదులుతున్నప్పుడు ఇవి నేను కాదుగదా. నేను వేరుగా వున్నాను. ఎ కదలికా, వికారమూ లేకుండా, అనంతమైన నిరాకార స్వరూపంగా, ఎ మార్పూ లేకుండా శాశ్వతంగా వున్నాను అనే భావాన్ని పెంచుకోవాలి.
ఇదే.కళ్ళు చూస్తున్నప్పుడు, చెవులు వింటున్నప్పుడు, చర్మము సృశిస్తున్నప్పుడు, నాసిక ఆఘ్రాణిస్తున్నప్పుడు, నోరు భుజిస్తున్నప్పుడు, కాళ్ళు నడుస్తున్నప్పుడు, దేహము నిద్రిస్తున్నప్పుడు, శ్వాస క్రియ జరుపుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విడిచి పెడుతున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు, కనులు తెరుస్తున్నప్పుడు, కనులు మూస్తున్నప్పుడు ఆయా ఇంద్రియాలు వాటి పనులు చేసుకొంటున్నాయి గాని వాటికి భిన్నంగా వున్న నేను కొంచం కూడా ఏమీ చేయటం లేదు, కేవలం సాక్షిగా ఉన్నాను అనే భావన చేయాలి. ఇది అభ్యాసం చేయాలి. ఇదే నేవు నీవుగా ఉండటమంటే. అయితే ఇలా ఉండటానికి అడ్డుపడుతున్నవి రాగ ద్వేషాలు, పాప కర్మలు మొదలైనవి. ఆయా దోషాల నుండి నీవు బయట పడాలంటే యజ్ఞ, దాన, తపోకర్మలు ఆచరించవలసియుంటుంది.
నీవు ఉన్నప్పుడు నిద్ర, అలసత్వంతో వుంటావు. అజ్ఞానం పోగొట్టుకున్నప్పుడు మాత్రమే అంటే యదార్థమైన నీవు ఎవరో తెలుసుకున్నప్పుడు నిద్ర నుండి మేల్కొన్నట్లు తమో గుణం నుండి బయట పడతావు.తృష్ణ నుండి బయట పడితే రజో గుణం నుండి బయట పడతావు. అంటే రాగ ద్వేషాల నుండి బయట పడాలి. అప్పుడే దుఃఖం పోతుంది.అప్పుడు ఎ అంటూ లేని నిర్మలమైన ప్రశాంత స్థితి అనుభవానికి వస్తుంది. అదే సత్వము అనబడుతుంది.
నిన్ను నీవు ఉన్నట్లయితే త్రిగుణాతీతమైన నీ స్వరూప స్థితి క్రమ క్రమంగా అనుభవానికి వస్తూ వుంటుంది, ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలోనే రమించుచూ, తనలోనే ప్రకాశమును పొందుతూ ఉంటాడో అతడే బ్రహ్మ భావముతో నున్న యోగి, పరబ్రహ్మ స్వరూపమును పొందుటకర్హుడు.
ఈ జన్మ పరంపర నుండి విడుదల. అదే మోక్షము అనబడుతున్నది. తానుకానిదానినుండి విడిపడి ఉజ్జ్వలమైన, పరమ పవిత్రమైన, అవ్యయమైన తనను తాను గుర్తించి సనాతనమైన తన అద్వితీయ స్వస్తితిలో తాను ఆనంద స్వరూపుడై ఉండటమే మోక్షము. శ్రేయస్కరమైనది అది ఒక్కటే. అందువల్ల ప్రతి మనిషి మోక్షాపేక్షతో ఉండాలి. దీనినే ముముక్షుత్వము అంటారు.
మానవ జీవితానికి పరమగమ్యం మోక్షం పొందటమే. 84 లక్షల జీవ రాసులలో మరే ఇతర ప్రాణికీ ఈ అవకాశం లేనే లేదు. ఎందువల్లనంటే శాశ్వతత్వాన్ని గుర్తించగల వివేకం మనిషికి మాత్రమే సొంతం. వివేకంతో శాశ్వతమైన తన స్వరూపమును గుర్తెరిగిన మనిషి మళ్ళీ దేహభావము లోకి జారిపోకుండా తాను తానుగా ఉండాలంటే, విషయ ధ్యానములో పడకుండా విషయాల పట్ల వైరాగ్యంతో ఉండాలి.
తనను తాను స్మరించు కుంటూ సర్వ కాల సర్వావస్థలలోనూ తన ఎరుకలో తాను ఉంటూ, దేహముయోక్క, ఇంద్రియముల యొక్క, మనసు యొక్క ప్రతి కదలికనూ గమనిస్తూ వుండాలి. ఇంద్రియాలు వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నప్పుడు ఆ విషయాల పట్ల ఇష్టాయిష్టాలు ఏర్పరచుకోకుండా, ఇంద్రియాలు ఇంద్రియ విషయాలలో ప్రవర్తిస్తున్నాయి, తనకు ఏ సంబంధమూ లేదనీ, తాను కేవలము సాక్షిని అనే భావనతో ఇష్టాయిష్టాల కతీతంగా నిర్లిప్తంగా ఉండాలి.
మనస్సులో మెదిలే ఆలోచనలను సైతం రాగ ద్వేషాలు లేకుండా గమనిస్తూ ఉండాలి. దేహం ఏ పని చేస్తున్నా నిర్వికారంగా గమనిస్తూ ఉండాలి. దేహానికి ఏమి జరుగుతున్నా, దేహ ప్రారబ్దం వల్ల అవి అలా జరుగుతున్నాయి, కష్టాలూ, సుఖాలూ వస్తున్నాయి, పోతున్నాయి, దేహియైన తనకు ఎట్టి సంబంధమూ లేదు అని భావించాలి.

LEAVE A RESPONSE