– మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జులై 1 వ తేదీన అమ్మవారి కళ్యాణం, 2 వ తేదీన రధోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు నగరం నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానంగా ఆలయం ముందు నిర్వహించే అమ్మవారి కళ్యాణాన్ని భక్తులు అందరూ వీక్షించే విధంగా LED స్క్రీన్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా క్యూ లైన్ లలో తోపులాట జరగకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
ఆలయ పరిసరాలలో మ్యాన్ హోల్స్, డ్రైనేజీ లీకేజీ లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూ లైన్ లలో వచ్చే భక్తులకు త్రాగునీరు అందించేందుకు సరిపడా వాటర్ ప్యాకెట్ లు, సిబ్బందిని నియమించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అంతేకాకుండా భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించే వారికి అవసరమైన వాటర్ వాటర్ ట్యాంకర్ లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ కోసం మూడు షిఫ్ట్ లలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని GHMC అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలలో స్ట్రీట్ లైట్ లు అన్ని వెలిగేలా చర్యలు తీసుకోవాలని, కళ్యాణం సందర్భంగా అవసరమైన ప్రాంతాలలో తాత్కాలిక ప్రాతిపదికన లైట్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం CC కెమెరాల ఏర్పాటుతో పాటు బందోబస్తు కోసం అదనపు పోలీసు సిబ్బందిని నియమించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కళ్యాణం, రధోత్సవం దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల పాటు ట్రాఫిక్ దైవర్షన్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులను ఆదేశించారు. వాలంటీర్ లకు ఫోటో గుర్తింపు కార్డులను అందజేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్, దేవాలయ అధికారులకు చెప్పారు.
జోగినీలు, శివసత్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. 2 వ తేదీన నిర్వహించే అమ్మవారి రధోత్సవం సందర్భంగా ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని పోలీసు అధికారులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రధోత్సవం సందర్భంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చెట్ల కొమ్మలను తొలగింపుకు చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.
ఆలయ పరిసరాలలో 4 హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేయడం తో పాటు అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, కార్పొరేటర్ సరళ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, ఆర్ అండ్ బి ఈఈ రవీంద్ర మోహన్, వాటర్ వర్క్స్ CGM ప్రభు, ఆలయ సూపరింటెండెంట్ హైమావతి, ఎలెక్ట్రికల్ AD కిషోర్, స్ట్రీట్ లైట్ DE కిరణ్మయి, శానిటేషన్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, SR నగర్ CI శ్రీనాథ్ రెడ్డి, జోగిని శ్యామల, BRS అధ్యక్షుడు హన్మంతరావు, అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, ప్రవీణ్ రెడ్డి, గోపి లాల్ చౌహాన్, పీయూష్ గుప్తా, బలరాం, ఉత్తమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.