బుగ్గన ఇచ్చివనన్నీ అబద్ధపు లెక్కలే

Spread the love

– టీడీపీ దిగిపోయే నాటికి రూ. 25,000 కోట్ల బిల్లులే పెండింగ్
– మీ మాటల్లోనే రూ. 25 వేల కోట్ల రూపాయిలు తేడా
– కేవలం 10,000 కోట్లు నష్టపోయి రూ. 50,000 కోట్లు ప్రజల నుంచి గుంజారు
– టీడీపీ అధికార ప్రతినిధి జి.వి. రెడ్డి

మూలధన వ్యయం, సాధారణ ఖర్చుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన పత్రికా ప్రకటనలో అన్నీ అబద్ధపు లెక్కలే. పాపం బుగ్గన గారిపై భారం పెరిగిపోయినట్టుంది. ఆయనకు అవే గణాంకాలను ప్రెస్ ముందుకు వచ్చి చెప్పేందుకు మనసు రాలేదో లేక ముఖం చెల్లడం లేదో అర్ధంకాలేదు. ఆయన శాఖకు సంబంధించిన వివరాలపై పత్రికా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఏముంది?

డిబేట్ చేయలేరు, డిబేట్ లకు సరైన వ్యక్తులను పంపలేరు, విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరుకానీ టీడీపీ కంటే బాగా ఖర్చు చేశామని పచ్చి అబద్ధాలు మాత్రం చెబుతున్నారు. గత ప్రభుత్వం అప్పులు పెట్టి పోయిందని బుగ్గన , సజ్జల పదే పదే అసత్యాలు మాట్లాడుతున్నారు. బుగ్గన విడుదల చేసిన పత్రికా ప్రకటన పేజ్ నెంబర్ 4ను గమనిస్తే …2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 41,900 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. మూడు నెలల క్రితం సజ్జల గారు ప్రెస్ ముందుకొచ్చి టీడీపీ హయాంలో రూ. 65,500 వేల కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టారని చెప్పారు. బుగ్గన, సజ్జల చెప్పిన మాటల్లో ఏది నిజం?

మీ మాటల్లోనే రూ. 25 వేల కోట్ల రూపాయిలు తేడా వస్తోంది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 25,000 కోట్ల బిల్లులే పెండింగ్ లో ఉన్నాయి. బడ్జెట్ లెక్కలను ఫాలో అవుతున్నారా లేక మీకు బాగా అలవాటైన నోటికొచ్చిన అబద్ధాలే చెబుతున్నారా? ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చినా అబద్ధాలు మానరా? పేదల సంక్షేమానికి రూ. లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేశామని బుగ్గన చెబుతున్నారు. అంటే వచ్చిన రెవెన్యూ మొత్తం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఖర్చు చేస్తే మరి సంక్షేమం ఎలా చేస్తున్నారు? మీరు చెప్పిన లెక్కలకైనా స్పష్టత ఇవ్వండి.

ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమే రూ. 3 లక్షల 30 వేల కోట్లు. సజ్జల మాటలనే పరిగణలోకి తీసుకుంటే ఆ మొత్తం ఉద్యోగులు, పెన్షనర్లకే అయిపోవాలిగా. మరి లక్షల కోట్ల సంక్షేమం ఎలా చేస్తున్నారు? మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఉద్యోగుల జీతాలు మొత్తం కలిపితే సంవత్సరానికి రూ. 70 వేల కోట్లు ఖర్చవుతోంది. ఆ లెక్కన ఈ మూడేళ్ల మొత్తం కలిపితే రూ. 2 లక్షల 10 వేల కోట్లయ్యింది. ఇప్పటివరకూ వచ్చిన రూ. 3 లక్షల 30 వేల కోట్ల ఆదాయంలో రూ. 2 లక్షల 10 వేల కోట్లు ఉద్యోగుల జీతాలకు తీసేస్తే మరి రూ. లక్షా 20 వేల కోట్లు సంక్షేమానికి ఎలా ఖర్చు చేసినట్టు?

బుగ్గన 2021-2022 ఆర్థిక సంవత్సరానికి రూ. 12 లక్షల కోట్ల జీడీపీ వచ్చిందని చెప్పారు. 2014-15లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేనాటికి రూ. 5 లక్షల 20 వేల 30 కోట్ల జీడీపీ ఉంది. ఆయన దిగిపోయే నాటికి దాన్ని రూ. 9 లక్షల 33 వేల కోట్లకు తీసుకెళ్లారు. రూ. 5 లక్షల కోట్ల జీడీపీ ఉన్నప్పుడే చంద్రబాబుగారు ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. రూ. 25 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశారు. మీరు చేసిందేమిటి? ఐదేళ్లకు కలిపి రూ. చంద్రబాబు యావరేజ్ న రూ. 75 వేల రూపాయిలు రైతులకు డైరెక్ట్ గా అందజేశారు.

రైతులు కట్టాల్సిన డబ్బులను నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మీరిచ్చింది ఎంత రూ. 37,000 . అదీ 10 సార్లు ఇన్ స్టాల్ మెంట్లలో. ఇదేనా రైతు ప్రభుత్వమంటే? ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాము. డ్రిప్ ఇరిగేషన్ లో 90 శాతం సబ్సిడీ ఇచ్చాము. ఏ విషయంలో మీరు రైతు బాంధవులో చెప్పండి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, తెచ్చిన అప్పులకు చెల్లించే వడ్డీ చూస్తే కనుక 2015-16లో రూ. 48 వేల కోట్లు, 2016-17 లో రూ. 55 వేల కోట్లు, 2017-18లో రూ. 62,364 కోట్లు, 2018-19లో రూ. 65 వేల 226 కోట్లు. 2019-20కి రూ. 71, 218 కోట్లు. ఆ ఐదువేల కోట్లు పెరగడానికి కారణం లేకపోలేదు. గ్రామ సచివాలయం, వార్డు వాలంటీర్ల నియామకాల వల్లే ఆ ఖర్చు పెరిగింది.

అంతేకానీ చంద్రబాబు కంటే మీరేమీ ఎక్కువ జీతాలు ఇవ్వలేదు. ఇస్తే మీరిచ్చిన గణాంకాల్లో కనపడాలి కదా. పత్రికా ప్రకటనల్లో వాస్తవ లెక్కలను చెప్పకుండా మాయమాటలు చెబుతున్నారు. టీడీపీ హయాంలో రెవెన్యూ ఖర్చు చూస్తే బడ్జెట్ లో పెట్టినదానికంటే మొదటి సంవత్సరం రూ. 18, 671 కోట్లు , రెండో సంవత్సరం వచ్చే సరికి రూ. 1475 కోట్లు తక్కువ ఖర్చు చేశాం. 2016-17 వచ్చేసరికి 2,047 కోట్లు ఎక్కువ పెట్టాం. మీరు బడ్జెట్ లో రూ. లక్షా 80 వేల 476 కోట్లు పెట్టి ఖర్చు చేసింది మాత్రం లక్షా 30 వేల 475 కోట్లు. బడ్జెట్ లో చెప్పిన దానికంటే మీరు చేసిన ఖర్చు రూ. 43000 కోట్లు తక్కువ. 2018-19లో పెట్టిన రెవెన్యూ ఖర్చు తక్కువే.

కరోనా వచ్చింది 2020 మార్చి లో. 2020-21 మార్చి వరకూ చూసుకుంటే లాక్ డౌన్ మూడు నెలలే. మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. కరోనా సమయంలో గ్రామాల్లో రోజువారీ పనులు పెద్దగా ఆగింది కూడా లేదు. ప్రతి దానికీ కరోనా సాకు చెబుతారు? మూడు నెలలు లాక్ డౌన్ ఉన్న పాపానికి లిక్కర్ సహా అన్నింటిపై రేట్లు పెంచేసి ప్రజలను పీల్చి పిప్పిచేసేశారు. ఈ మధ్య ఏదో తూతూమంత్రంగా లిక్కర్ రేటు తగ్గించారు. ఆస్తి , చెత్త పన్నులు వేశారు. కరోనా వంక చెప్పి ట్యాక్స్ ల ద్వారా దండుకున్నారు.

రూ. 36 వేల కోట్లపైన పన్నుల ద్వారా సేకరించారు. కరోనా సమయంలో కేంద్రం చెప్పిన అన్ని కండిషన్లకు ఒప్పుకుని రూ. 20,000 కోట్లు అప్పులు తెచ్చుకున్నారు. రూ. 30,000 కోట్లకు పైగా పన్నుల రూపంలో వసూలు చేశారు. మీరు చెప్పిన లెక్కల ప్రకారమే చూసినా కేవలం 10,000 కోట్లు నష్టపోయి రూ. 50,000 కోట్లు ప్రజల నుంచి గుంజారు. కరోనా కాకమ్మ కథలు ఎన్ని సంవత్సరాలు చెబుతారు? దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. లక్షా 30 వేల కోట్లు కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశారు. చంద్రబాబు గారి హయాంలో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు రూ. 50,000 కోట్లు దాటింది లేదు.

రెండున్నరేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 3 లక్షల 54 వేల 104 కోట్లు. 1956వ సంవత్సరం నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి మొత్తం ఉన్న అప్పే రూ. 3 లక్షల కోట్లు. ఇవి చాలవన్నట్టు ఆర్బీఐ ద్వారానూ తెచ్చుకున్నారు. దుబారా, లూటీ మించి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. రంగులు వేయడం తీయడం మించి చేసిందేమీ లేదు. కరోనా సాకుతో తప్పించుకోవాలని చూడొద్దు. కరోనా పేరు చెప్పి అప్పులు చేశారు. పన్నులు బాదారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. గుంతలు పూడ్చలేదు.

చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. వచ్చిన డబ్బంతా దోచుకున్నారు. 2021 లో అన్ని రాష్ట్రాల్లో 50 రోజులకు పైగా అసెంబ్లీ జరిగితే మనకు మాత్రం 7 రోజులే జరిగింది. దేశంలో ఎక్కడా కరోనా లేదా?మన రాష్ట్రానికే కరోనా ఉందా? అసెంబ్లీ సమావేశాలు పెడితే చేపిన తప్పులన్నీ బయటకు వస్తాయి, విపక్షాలు ప్రశ్నిస్తాయనే భయంతోనే పారిపోతున్నారు. అసెంబ్లీలో పచ్చి బూతులు తిడుతూ పరువు తీస్తున్నారు. పదేపదే అబద్ధాలు చెప్పొద్దు. చంద్రబాబు హయాంలో ఆర్థిక క్రమశిక్షణ ఉంది. మీకు తెలిసింది దోచుకోవడమే. దోచుకున్నదీ ప్రజల కోసం చేసిన ఖర్చులో రాసేస్తే ఎలా? వైసీపీ ప్రభుత్వ తప్పుడు లెక్కలు, ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలంతా గమనించాలి.

Leave a Reply