– అమరావతి లేకుండా సీమాంధ్ర లేదు
-బి కే కాలం యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
– అనంతవరం బహుజన పొలికేక సభలో వక్తల ఉద్ఘాటన
అనంతవరం : ప్రజా రాజధాని అమరావతి వ్యతిరేకులంతా రాష్ట్ర ద్రోహులని దేశద్రోహులు, దేశ ద్రోహులే అని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. అమరావతి లేకుండా సీమాంధ్ర లేదని స్పష్టం చేశారు.ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర అభివృద్ధి వేదిక సమన్వయకర్త టి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమరావతిని నాశనం చేసే హక్కు పాలకులకు లేదని తెగేసి చెప్పారు. చట్టాలను, రాజ్యాంగాన్ని, హక్కులను గౌరవించడం చేతకాని పాలకులకు అమరావతిని కాదననే హక్కు ఎక్కడిది అని నిగ్గదీశారు.
రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే దేశ ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాజధాని ఉద్యమంలో ఉద్యమకారులు చేస్తున్న త్యాగాలు స్ఫూర్తిదాయకం అన్నారు.అమరావతి కోసం రాజకీయ పదవిని వదిలేశానని గుర్తుచేశారు. రాజధానిని రక్షించుకోవడం 29 గ్రామాల ప్రజల బాధ్యత కాదని, ఐదున్నర కోట్ల ప్రజల బాధ్యత కూడా అని తెలిపారు.
అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ అమరావతిని హత్య చేసేందుకు కత్తి దూసిన వైకాపా ప్రభుత్వాన్ని వదలబోమని హెచ్చరించారు. రాజధాని రైతులపై,మహిళలపై, అక్రమ కేసులు పెట్టి, అవహేళన చేసి, దాడులు చేసిన ప్రభుత్వాన్ని శిక్షించి తీరుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన 1400 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దాడుల సంఘటనకు ప్రభుత్వం పశ్చాత్తాపం ప్రకటించేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అమరావతి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తారీకు నుంచి రాజధాని ఉద్యమాన్ని విస్తృతం చేయబోతున్నట్లు తెలియజేశారు. ప్రజా పోరాటం ఉన్నప్పుడే, న్యాయస్థానాల్లో తీర్పులు కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ రాజధాని ఉద్యమ మహిళలు చేస్తున్న త్యాగాలను కొనియాడారు.ప్రభుత్వ విధానాలు న్యాయస్థానాల్లో చెల్లవని చెప్పారు.
మైనార్టీ నాయకులు ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ అమరావతి కోసం కట్టుబడి ఉన్నట్లు, ప్రశ్నించడమే తప్పయితే ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. సభకు ఆలూరి రఘునాధరావు అధ్యక్షత వహించగా , నన్నపనేని రామారావు ఆలూరి యుగంధర్,పార శ్రీనివాస రావు, కొమ్మినేని కోటేశ్వరరావు, గోవిందమ్మ ,ఆలూరి శ్రీదేవి, కె. అప్పారావు , కంచర్ల గాంధీ తదితరులు ప్రసంగించారు. సభ ప్రారంభం కాగానే బికె యూట్యూబ్ ఛానల్ ను వక్తలంతా కలిసి ఆవిష్కరించారు.