Suryaa.co.in

Andhra Pradesh

వచ్చేది కూటమి ప్రభుత్వమే …

  • వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతోంది
  • సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం
  • వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు పోతాయి
  • పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ 
  • రోడ్ షోకు పోటెత్తిన యువత, మహిళలు
  • మండుటెండను సైతం లెక్కచేయక ఆరు గంటల పాటు నిర్విరామంగా రోడ్ షో
  • ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలిన పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో వచ్చేది “జనసేన – తెలుగుదేశం – బీజేపీ” కూటమి ప్రభుత్వమేనని… వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.  అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పిఠాపురం తెలుగు దేశం ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ , కాకినాడ లోక్ సభ ఎన్.డి.ఏ. అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ , పిఠాపురం బీజెపీ కృష్ణంరాజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “రాష్ట్రం బాగుండాలి, ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించే వాడిని. అది దృష్టిలో పెట్టుకొనే 2014లో ఏమీ ఆశించకుండా తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు ఇచ్చాను. వారి గెలుపునకు కృషి చేశాను.

ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన మొహంలో ప్రశాంతత పోలేదు
వైసీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల నాయకుల దౌర్జన్యాలు, దాష్టీకాలు పెరిగిపోయాయి. ఉత్తరాంధ్రలో బీజేపీ నాయకుడిని నడిరోడ్డుపై కత్తితో పొడిచారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబుని అరెస్ట్ చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అకారణంగా అరెస్ట్ చేయడం బాధనిపించింది. రాజమండ్రి జైల్లో చంద్రబాబుని కలిసినప్పుడు ఆయన ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఇది రాజకీయం.. దెబ్బలు సహజం. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ముందుకు కదలాలి అని అన్నారు. ఇలాంటి నాయకుడు ఉండటం వల్లే ఎన్ని సంక్షోభాలు ఎదురైనా టీడీపీ క్యాడర్ చెక్కు చెదరలేదు. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో మాట్లాడి వచ్చిన తరువాత మనసుతో స్పందించి పొత్తు ప్రకటన చేశాను. నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ కు అండగా నిలబడ్డాను. 2021లోనే చెప్పాను.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అందులో భాగంగానే మమ్మల్ని మేము తగ్గించుకొని పొత్తు పెట్టుకున్నాం. వర్మని చట్ట సభలకు పంపించే బాధ్యత తీసుకుంటాం. ఆయనకు అన్ని విధాల సంపూర్ణ మద్దతు ఇస్తాను.

వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు పోతాయి
జగన్ మన భూములు దోచుకోవడానికి ప్రమాదకరమైన జీవోలు తీసుకొస్తున్నాడు. ఇదివరకు దున్నేవాడిదే భూమి అనే వారు. ఇప్పుడు వైసీపీకి ఓటు వేస్తే దున్నని భూమి కూడా వైసీపీ నాయకులకు వెళ్లిపోయేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు. మన భూమి మన హక్కు కాదా..? జగన్ తాతల ఆస్తినా..? రేపు భూమిని పసుపు కుంకుమ కింద ఇవ్వాలన్నా, తాకట్టుపెట్టాలన్న ఒరిజనల్స్ పత్రాలు కావాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మన ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంటుంది. మన దగ్గర కేవలం జిరాక్స్ లు మాత్రమే ఉంటాయి. వైసీపీకి ఓటు వేస్తే అందరి ఆస్తులు పోతాయి. మన భూములకే దిక్కు లేదంటే అసైన్డ్ భూముల పరిస్థితి ఏంటీ? ఎత్తిపోతల పథకాలకు డబ్బులు లేవు కానీ ఒక్క మద్యంలోనే వేలకోట్లు దోచుకున్నారు. మన నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తయ్యేలా చేస్తాం.

ఓడిపోతారని తెలిసే అసత్య ప్రచారం : ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ
పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి వర్మ మాట్లాడుతూ “పిఠాపురంలో వైసీపీ ఓడిపోతుందని తెలిసే బ్లూ మీడియా వారం రోజులుగా దుష్ప్రచారం చేస్తోంది. నేను వైసీపీలోకి వెళ్లిపోతున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తోంది.  నేను మాట ఇచ్చానంటే ప్రాణం పోయినా వెనక్కి తగ్గను. పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబుకి మాట ఇచ్చాను. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తానని చెప్పాను. దానికి కట్టుబడి నిజాయతీగా కష్టపడి పనిచేస్తున్నాను” అన్నారు.

ర్యాలీలో పోటెత్తిన జనం
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం ఖాయమైపోయింది.  పవన్ కళ్యాణ్ ప్రచారానికి అడుగు కదిపితే మద్దతుగా పదం కలుపుతూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సోమవారం పిఠాపురం మండల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షో అందుకు నిలువెత్తు నిదర్శనం. పవన్ కళ్యాణ్ రాక సమాచారం తెలుసుకున్న పిఠాపురం గ్రామీణులు రోజువారీ పనులు మానుకుని మరీ ఆయనకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. రోడ్ షో ఆద్యంతం ఆయన వెంట కదిలారు. జన సైనికుల కేరింతలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల జేజేల మధ్య సోమవారం 10 గంటలకు మొదలైన రోడ్ షో మండుటెండను సైతం లెక్కచేయక ఆరు గంటలపాటు నిర్విరామంగా సాగింది. ప్రజలకు గాజు గ్లాసు గుర్తు చూపుతూ ఓటు వేయాలని కోరుతూ.. తనకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికీ అబివాదం చేస్తూ, ఆత్మీయంగా ముందుకు వచ్చిన వారిని ప్రచార రథంపై నుంచే హత్తుకుంటూ, పర్యటించిన ప్రతి గ్రామాన సమస్యలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ రోడ్ షో న భూతో న భవిష్యత్ అన్న చందంగా సాగింది.

ఆత్మీయ పలకరింపులు… ఆడపడుచుల హారతులు
సోమవారం ఉదయం 10 గంటలకు చెందుర్తి జంక్షన్ నుంచి మొదలైన పవన్ కళ్యాణ్ రోడ్ షో గొర్రెల కాపరుల పలకరింపుతో మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ ని తమ వద్ద ఉన్న కంబళితో సత్కరించి గొర్రె పిల్లను బహూకరించారు. జనసేనానికి భారీ విజయం సిద్ధించాలని ఆకాంక్షించారు. గొర్రెల కాపరులు ఆత్మీయంగా ఇచ్చిన గొర్రెపిల్లను స్వీకరించిన  పవన్ కళ్యాణ్  వారికి ధన్యవాదాలు తెలిపారు. అక్కడి నుంచి జనసేన, టీడీపీ కార్యకర్తలు వేలాదిగా ద్వి చక్ర వాహనాలు, కార్లతో అనుసరించగా, కూటమి జెండాల రెపరెపల మధ్య రోడ్ షో మొదలయ్యింది. ప్రతి అడుగునా గజమాలల ఆత్మీయ సత్కరాలు, ఆడపడుచుల హారతుల మధ్య ఒక్క రోజులో సుమారు 20 గ్రామాలను  పవన్ కళ్యాణ్ చుట్టారు.

చందుర్తి జంక్షన్ నుంచి మొదలైన రోడ్ షో వన్నెపూడి, కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బి. కొత్తూరు, తిమ్మాపురం, గోకివాడ, జములపల్లి, నరసింగపురం, యల్.యన్.పురం, కోలంక, విరవాడ, విరవ, మంగితుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్.కె.పాలెం,  కందరాడ, కుమారపురం తదితర గ్రామాల్లో పార్టీ శ్రేణుల ఉత్సాహం మధ్య కొనసాగింది. రోడ్ షో సాగిన ప్రతి గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్లు విడిచి రోడ్ల మీదకు వచ్చి మద్దతు తెలిపారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి మీ వెంటే మేమంటూ నినదించారు. ప్రతి ఇంటా గాజు గ్లాసు గుర్తులతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి భారీ మెజారిటీతో గెలిపిస్తామంటూ మాటిచ్చారు.

పిఠాపురం ప్రజల ఉత్సాహం చూసి మండుతున్న ఎండను సైతం లెక్క చేయక ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తు, తనతో పాటు ఎంపీ అభ్యర్ధి ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేయాలని కోరారు. గ్రామాల్లో జనోత్సవం చూస్తే వచ్చే రోజుల్లో జనసేనోత్సవం ఖాయం అన్న రీతిలో యాత్ర సాగింది. మధ్య మధ్యలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్  ఉత్సాహపరిచారు.

LEAVE A RESPONSE